ఏం చేద్దాం?

ABN , First Publish Date - 2021-11-27T04:23:04+05:30 IST

ఎనసీఎస్‌ షుగర్స్‌ రైతులు అయోమయంలో పడ్డారు. క్రషింగ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకోగా... ఈ ఏడాది ఏకంగా గానుగ చేపట్టడం లేదని యాజమాన్యం ప్రకటించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే భీమసింగిలో కూడా క్రషింగ్‌ నిలిపేయడంతో చెరకు పంట భవిష్యత ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షుగర్స్‌ కార్మికులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఏడు నెలల జీతాల బకాయిలు, పీఎఫ్‌, గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు.

ఏం చేద్దాం?
ఎనసీఎస్‌ చక్కెర కర్మాగారం

అయోమయంలో చక్కెర రైతులు

ఎనసీఎస్‌లో క్రషింగ్‌ నిలిపివేతపై నిర్వేదం

బకాయిల కోసం డిమాండ్‌

పంటను సంకిలి తరలించాలని అధికారుల ఆదేశం

తాజా పరిణామాలపై కార్మికుల్లోనూ ఆగ్రహం


ఎనసీఎస్‌ షుగర్స్‌ రైతులు అయోమయంలో పడ్డారు. క్రషింగ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకోగా... ఈ ఏడాది ఏకంగా గానుగ చేపట్టడం లేదని యాజమాన్యం ప్రకటించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే భీమసింగిలో కూడా క్రషింగ్‌ నిలిపేయడంతో చెరకు పంట భవిష్యత ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షుగర్స్‌ కార్మికులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఏడు నెలల జీతాల బకాయిలు, పీఎఫ్‌, గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. 

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో చెరకు రైతులకు వరుసగా నిరాశాజనక పరిణామాలు ఎదురవుతున్నాయి. సహకార చక్కెర కర్మాగారంగా ఉన్న జామి మండలం భీమసింగి చెరకు ఫ్యాక్టరీని గత ఏడాది మూసివేశారు. ఈ ఏడాది కూడా క్రషింగ్‌ చేపట్టలేదు. ఆ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు పండించిన చెరకు పంటను ఎనసీఎస్‌, శ్రీకాకుళం జిల్లా సంకిలి కర్మాగారాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. అంతలోనే ఎన్‌సీఎస్‌లో కూడా క్రషింగ్‌ చేపట్టడం లేదని యాజమాన్యం ప్రకటించింది. కర్మాగారం మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టని కారణంగా ఈ ఏడాది క్రషింగ్‌ చేయలేమని చేతులెత్తేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం తగినంత చెరకు లేని కారణంగా ఈ ఏడాది క్రషింగ్‌ చేయలేమని ప్రకటించింది.  బొబ్బిలి సమీపంలోని సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద మొదట ప్రభుత్వ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారం ఏర్పాటైంది. ప్రభుత్వం దీనిని సక్రమంగా నిర్వహించలేకపోయింది. దీంతో అమ్మకానికి పెట్టింది. 2002లో ఎన్‌సీఎస్‌ యాజమాన్యం ఫ్యాక్టరీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చెరకు గానుగ స్థాయిని గణనీయంగా పెంచింది. 2006 సీజన్‌లో ఫ్యాక్టరీ చరిత్రలోనే 6,94,058 టన్నుల చెరకును గానుగ ఆడించారు. ఆ ఏడాది నవంబరు 14న ప్రారంభించిన క్రషింగ్‌ 2007 జూలై వరకు కొనసాగించారు. ఇన్ని నెలల పాటు క్రషింగ్‌ జరగడం అదే తొలిసారి. ఆ తరువాత యాజమాన్య విధానాలతో దశల వారీగా చెరకు పంటను రైతులు సాగు చేయడం తగ్గించారు. ఈ ఏడాది గరిష్టంగా 1.5 లక్షల టన్నులకు పడిపోయింది. . రైతులకు రాయితీలు ఎత్తివేయటం, ప్రోత్సాహకాలు ఇవ్వకపోవటంతో పరిస్థితి ప్రతికూలంగా మారిపోయింది. ముఖ్యంగా చెరకు సరఫరా చేసే రైతాంగానికి బిల్లులు చెల్లించడం లేదు. దీంతో రైతులు సాగు తగ్గించారు. ఈ ఏడాది ఏకంగా క్రషింగ్‌ చేపట్టలేని స్థితికి ఫ్యాక్టరీ చేరింది. మరమ్మతులు, నిర్వహణ పేరుతో ఈ సీజన్‌కే పరిమితం చేస్తారా లేదా పూర్తిగా మూసేస్తారా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆధునీకరణ పేరుతో భీమసింగి కర్మాగారాన్ని మూసి వేశారు. ఎటువంటి పనులు చేపట్టకుండా చెరకు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉండగా లచ్చయ్యపేట కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. మరమ్మతుల పేరుతో మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.


Updated Date - 2021-11-27T04:23:04+05:30 IST