ఆంధ్రులుగానే ఉంటాం

ABN , First Publish Date - 2021-10-26T04:47:57+05:30 IST

ఒడిశా పరిధిలోకి రాకపోతే అక్రమ కేసులతో జైల్లో పెడతామంటున్నారని.. ఏళ్ల తరబడి ఆంఽద్రులగానే ఉన్న తాము ఇకపై కూడా అలాగే కొనసాగుతామని సాలూరు మండలం కొఠియా ప్రాంత సర్పంచులు, ఎంపీటీసీలు కలెక్టర్‌ వద్ద స్పష్టం చేశారు.

ఆంధ్రులుగానే ఉంటాం
నిత్యావసరాలు అందజేస్తున్న ఎస్పీ దీపికాపాటిల్‌

భద్రత కల్పించండి

కలెక్టర్‌కు కొఠియా వాసుల వినతి

 విజయనగరం(ఆంధ్రజ్యోతి), అక్టోబరు 25 : ఒడిశా పరిధిలోకి రాకపోతే అక్రమ కేసులతో జైల్లో పెడతామంటున్నారని.. ఏళ్ల తరబడి ఆంఽద్రులగానే ఉన్న తాము ఇకపై కూడా అలాగే కొనసాగుతామని సాలూరు మండలం కొఠియా ప్రాంత సర్పంచులు, ఎంపీటీసీలు కలెక్టర్‌ వద్ద స్పష్టం చేశారు.  సోమవారం ‘స్పందన’కు వచ్చిన వారు ఒడిశా నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఒడిశా ప్రభుత్వ పెద్దలు, అధికారులు అనేక రకాలుగా బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. కొఠియా పరిఽధిలోని గంజాయిభద్ర, పట్టుచెన్నూరు, పగులుచెన్నూరు పంచాయతీలకు చెందిన సర్పంచులు, ఏంపీటీసీలు స్వచ్ఛందంగా సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారికి కలెక్టర్‌ సూర్యకుమారి, జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, ఇతర జిల్లా ఉన్నతాధికారులు మంగళవాయిద్యాలతో  స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సుమారు 50 మంది కొఠియా వాసులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొఠియా గ్రామాల నుంచి ఇంతమంది వచ్చి ఆంధ్రాలోనే ఉంటామని చెప్పడం హర్షించదగ్గవిషయమన్నారు. కొన్ని రోజులుగా కొఠియా గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని, ఎలాంటి సమస్య వచ్చినా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. 

అండగా ఉంటాం: ఎస్పీ

కొఠియా వాసులు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం, జిల్లా పోలీసు శాఖ పూర్తిగా అండగా ఉంటామని అక్కడి ప్రజలకు ఎస్పీ దీపికాపాటిల్‌ భరోసా ఇచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం కొఠియా గ్రామాల ప్రజలు ఎస్పీని కలిశారు. తాము ఒడిశా నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కొఠియా గ్రామాల్లో ఉన్న వారందరూ ధైర్యంగా స్వేచ్ఛగా ఉండొచ్చని, వారికి పోలీస్‌ శాఖ అండగా ఉంటుందన్నారు. తొలుత వారికి సాదర స్వాగతం పలికారు. సత్కరించి నిత్యావసరాలను అందజేశారు. త్వరలోనే కొఠియా గ్రామాల్లో పోలీసుస్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఇందుకు సంబంధించి  ఉన్నతాధికారుల అనుమతి కోరనున్నట్లు ఎస్పీ భరోసా కల్పించారు. 

ఆంధ్రా మా పుట్టిల్లు 

ఆంధ్రా మా పుట్టిల్లు. ఒడిశా రాష్ట్ర పోలీసులు, పెద్దలు మమ్మల్ని ఎంతగానో బెదిరిస్తున్నా, ఇక్కడి అధికారులు, ప్రజా ప్రతినిధులపై నమ్మకంతో ఇక్కడే ఉంటామని తెల్చిచెప్పాం. ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం అందించాలని కోరుతున్నాం. 

- చోడపల్లి బీస్‌, పగులు చెన్నూరు మాజీ సర్పంచ్‌

ఆ పోలీసులు బెదిరిస్తున్నారు

మేమంతా ఆంధ్రాలోనే ఉండాలని నిర్ణయించుకున్న తరువాత ఒడిశా పోలీసులు అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా మేమంతా ఆంధ్రాలోనే ఉండాలని తీర్మానం చేసుకున్నాం. 

- గె మ్మిలి బీస్‌, గంజాయి బద్ర ఉపసర్పంచ్‌ 



Updated Date - 2021-10-26T04:47:57+05:30 IST