నీటి ఇక్కట్లు.. గిటు‘్టపాట్లు’

ABN , First Publish Date - 2021-12-27T05:07:25+05:30 IST

కాలగమనంలో మరో ఏడాది కలిసిపోతోంది. పాత పొరపాట్లను మళ్లీ చేయకుండా కొంగొత్త ఆశలతో పురోగమించాలని సూచిస్తూ టాటా చెప్పబోతోంది. గతించిన కాలంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలని.. నూతన సంవత్సరంలో నవ్యంగా అడుగులు వేయాలని కోరుతోంది.

నీటి ఇక్కట్లు.. గిటు‘్టపాట్లు’

రైతులకు ఈ ఏడాదంతా ప్రతికూలమే

కొత్తగా చుక్క సాగునీరూ పెరగని వైనం

ధాన్యం అమ్మకాలకూ అవస్థలే

జల కళకు పురిటి నొప్పులు

అక్కరకు రాని సూక్ష్మ వ్యవసాయ పరికరాలు

చెరకు పంటను తీసుకోని ఫ్యాక్టరీలు


కాలగమనంలో మరో ఏడాది కలిసిపోతోంది. పాత పొరపాట్లను మళ్లీ చేయకుండా కొంగొత్త ఆశలతో పురోగమించాలని సూచిస్తూ టాటా చెప్పబోతోంది. గతించిన కాలంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలని.. నూతన సంవత్సరంలో నవ్యంగా అడుగులు వేయాలని కోరుతోంది. ఎప్పటిలా ఈ ఏడాది కూడా జరిగిన కీలక ఘట్టాలు, ఘటనలు, సమీకరణాలు, విషాదాలు, ఆనందాల సమాహారాన్ని రంగాల వారీ విశ్లేషిస్తూ ప్రచురిస్తున్న కథనాల్లో తొలి రోజు వ్యవసాయ రంగం పరిస్థితులను అవలోకిద్దాం. జిల్లాలో ప్రధాన రంగంగా చెప్పుకునే వ్యవసాయంలో ఈ ఏడాది ప్రతికూల ఫలితాలే ఎక్కువగా వచ్చాయి. జఠిలమైన సమస్యలను రైతులు ఎదుర్కొన్నారు. వరి పంటతో చివరి వరకు టెన్షన పడ్డారు. కొనుగోలు ప్రక్రియ జాప్యంతో ఇప్పటికీ ఊరట లేకపోయింది. చెరకు రైతులకూ ఒడిదుడుకులు తప్పలేదు. జిల్లాలో ఉన్న రెండు ఫ్యాక్టరీల్లోనూ క్రషింగ్‌ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

వ్యవసాయానికి సంబంధించి ఈ సంవత్సరం ఎక్కువగా చేదు అనుభవాలనే మిగిల్చింది. కష్టాల పాఠాలు నేర్పింది. అవి మిగిల్చిన అనుభవాల నుంచి కొత్త ఆలోచనలతో అన్నదాతలు బంగారు భవిత వైపు నడవాల్సి ఉంది. ఈ ఏడాదిలో ప్రకృతి తెచ్చిన వైపరీత్యాలు కొన్నయితే ప్రభుత్వ తీరు వల్ల రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌ పనులు ఒక్క అడుగు కూడా కదలలేదు. కొత్త ప్రాజెక్టుల మంజూరు దాఖలాలు లేవు. చివరికి ఖరీఫ్‌లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా దిక్కులేని పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. డిసెంబరు నెలాంతం వరకు సమీక్షలతోనే కాలయాపన చేసింది. వెరసి రైతాంగానికి కొత్తగా సాగునీరు అందివ్వక పోగా పండించిన పంటను ఏం చేయాలో తోచని దుస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చినట్లయింది. 

 సా...గుతున్న ప్రాజెక్టులు

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌ పనులు ముందుకు కదలడం లేదు. కీలకమైన రామతీర్థసాగర్‌లో మూడేళ్లుగా ఒక్క పనీ జరగలేదు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు జలాశయంలో ముంపునకు గువుతున్న రెండు గ్రామాల ప్రజలకు పునరావాస, పునర్‌ నిర్మాణ ప్యాకేజీలను కూడా అందివ్వలేదు. వేరే చోట గృహాలను నిర్మించలేదు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం రైతాంగానికి 25వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు పనులు పూర్తిగా పడకేశాయి. రాష్ట్ర బడ్జెట్‌లో ఉత్తుత్తి కేటాయింపులుచేసి ఒక్క పైసా కూడా విదల్చడం లేదు. ఈ ప్రాజెక్టు అధారంగానే విజయనగరం కార్పొరేషన్‌ ప్రజలకు దాహార్తిని తీర్చాల్సి ఉంది. పనులు చేపట్టని కారణంగా తాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.  వేసవిలో నగర ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు.

 తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతుల గుండె చప్పుడు. ఈ ప్రాజెక్టు పరిధిలో కూడా పెండింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. పిల్లల కాల్వల నిర్మాణాలు ఆగిపోయాయి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి తన నియోజకవర్గ పరిధిలోని రైతాంగానికి తోటపల్లి ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయించారు. కాని నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. సొంత మండలంలోని ఒట్టిగెడ్డ జలాశయ ఆధునీకరణ పనులు పూర్తి చేయించ లేదు. గుమ్మిడి గెడ్డ మినీ జలాశయం, వనకాబడి గెడ్డ, అడారు గెడ్డ జలాశయాల పనులను కొలిక్కితేలేకపోయారు. 

మక్కువ మండలంలో సువర్ణముఖీ నదిపై నిర్మించిన వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టు 25వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు పరిధిలో అధునీకరణ పనులు చేపట్టలేదు. బొబ్బిలి మండలంలో అదనంగా 5వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జపాన్‌ అర్థిక సాయం ద్వారా చేపడుతున్న జైకా అభివృద్ధి పనులు కూడా పూర్తి కాలేదు. 

 జల ‘కలే’నా...

జగనన్న జల కళ పడకేసింది. గత ప్రభుత్వాలు చేపట్టిన ఇందిర జల ప్రభ, ఎన్‌టీఆర్‌ జల సిరి పథకాలను ముఖ్య మంత్రి తన పేరుతో జల కళగా మార్చారు. రైతులకు మాత్రం ఈ పథకాన్ని కలగా మిగిల్చారు. గత ఏడాది కాలంలో ఎక్కడా ఒక్క బోరు బావి కూడా రైతులకు అందివ్వలేదు. సాగునీటి వనరులు అందుబాటులో లేని రైతాంగానికి భూగర్భ జలాలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మంచి సంకల్పతో గత ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించాయి. కాని వైసీపీ ప్రభుత్వం దీనిని పడకేయించింది. నియోజకవర్గానికి ఒక రిగ్‌ బోరును మంజూరు చేస్తామని రైతుల్లో ఆశలు కల్పించారు.  పథకం కోసం వేలల్లో దరఖాస్తులు వస్తే వందల్లో కూడా పరిష్కారం కాలేదు. 

పరికరాలు ఏవీ?

రైతులకు సూక్ష్మ వ్యవసాయ పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగునీరు అందించవచ్చు. వాటితో బిందు, తుంపర సేద్యాలు చేపడుతుంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన  తర్వాత రాయితీలు విడుదల చేయక ఈ పథకాన్ని మూలకు చేర్చారు. రైతులకు కూలీల కొరత సమస్య నుంచి బయట తీసుకురావాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు వ్యవసాయ యాంత్రీకరణ అమలు చేశాయి. వైసీపీ వచ్చిన వెంటనే ఈ పథకాన్ని నీరు గార్చేశారు. ఏడాది కాలంగా ఒక్క రైతుకు కూడా ఈ పథకాన్ని అందివ్వలేదు. ట్రాక్టర్లు, వీడర్లు, కలుపు తీసే యంత్రాలు, పంట నూర్పిడి యంత్రాలు, గాలి పంకాలు, స్ర్పేయర్లు ఇలా అనేక రకాల పనిముట్లు అందించే వారు. నేడు ఒక్క పరికరమూ అందివ్వకుండా రైతులకు మొండిచేయి చూపిస్తున్నారు. 

ఎరువు కరువు

రైతులకు ఈ ఏడాది విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. రైతుభరోసా కేంద్రాల్లో అరకొరగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసింది. దీంతో రైతులు మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. 

గిట్టుబాటు ఏదీ?

గతేడాది కాలంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు లభించడంలేదు. ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో రైతులకు కొంత మొత్తాన్ని సాయంగా అందించి రాయితీలను ఎత్తివేసి రైతుల నడ్డి విరుస్తోంది. ఏటా డిసెంబరు మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరిగేవి. ఈ ఏడాది రైతుల ధాన్యం కల్లం దాటడం లేదు. సాధారణ రకం ధాన్యం క్వింటా వద్ద రూ.940. గ్రేడ్‌-1 ధాన్యం క్వింటా వద్ద రూ.960గా మద్దతు ధర ప్రకటించారు కాని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ ఏడాది మొక్కజొన్న నిల్వలను విక్రయించేందుకు కూడా రైతులు అవస్థలు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరిచినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేయలేదు. రైతుల నుంచి వ్యతిరేకత వచ్చాక అదనంగా నిల్వలు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ అంతంతమాత్రమే.

 చెరకు పండించే రైతుల పరిస్థితి అగమ్యగోచరం. ప్రభుత్వం ఎందుకనో చక్కెర కార్మాగారాలను రైతులకు దూరం చేస్తోంది. గతేడాది భీమసింగి, ఈ ఏడాది బొబ్బిలి సమీపంలోని లచ్చయ్యపేట ఫ్యాక్టరీలను మూసివేసింది. దీంతో చెరకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఈ ఏడాది కొత్త ఆయకట్టుకు చుక్క సాగునీరు అందివ్వలేదు. పెండింగ్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదు. రైతులు పండించిన పంటలకూ గిట్టుబాటు కల్పించడంలేదు. చెరకు క్రషింగ్‌ నిలిపేసి అన్ని వర్గాల రైతులను ఇబ్బందులకు గురిచేసింది. 


Updated Date - 2021-12-27T05:07:25+05:30 IST