బ్రాందీ షాపు కోసం మహిళల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-05T19:36:10+05:30 IST

విజయనగరం జిల్లా: మహిళలు ఆందోళనబాట పట్టారు. వారికి పెద్దలంతా సంఘీభావం తెలిపారు.

బ్రాందీ షాపు కోసం మహిళల ఆందోళన

విజయనగరం జిల్లా: మహిళలు ఆందోళనబాట పట్టారు. వారికి పెద్దలంతా సంఘీభావం తెలిపారు. గ్రామస్తులంతా ధర్నాకు దిగారు. వారి ఆందోళన తాగునీరు, రోడ్లు, వైద్యం, పెన్షన్ల కోసం అనుకుంటే పొరపాటు.. ఇంతకీ వారు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.


విజయనగరం జిల్లా, మెంటాడ మండలం, మేడపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఎప్పుడూ ఇంటి, పొలం పనులతో బిజీగా ఉంటారు. వారికి ఆందోళలు, నిరసనల్లో పాల్గొనడం అసలు తెలియదు. కానీ ఇప్పుడు ఈ మహిళలు నిరసన స్వరం వినిపిస్తున్నారు. వారి ఆందోళన చూసి పొరుగు గ్రామాల వారు ఆశ్చర్యపోయారు. తమ గ్రామంలో ఓ బ్రాందీ షాపు పెట్టమని డిమాండ్ చేస్తూ మహిళలు పిడికిలి బిగించారు. బ్రాందీ షాపు పెట్టి ఆర్థిక సమస్యల నుంచి తమను గట్టెక్కించాలని కోరుతున్నారు. మద్యపానం నిషేధించాలని కోరుతూ మహిళలు ఆందోళనలు చేయడం చూశాం. మరి మేడపల్లిలో బ్రాందీ షాపు పెట్టమని ఇంతగా పట్టుపడుతున్నారంటే.. వారి ఆవేదనకు అర్థముంది. 


ప్రభుత్వ పనితీరు, నిర్లక్ష్య వైఖరిని ఈ రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అది అమలు చేయకపోగా గ్రామంలోని ప్రతి వీథిలో బెల్టు షాపులు పుట్టుకొచ్చాయి. రోజంతా కష్టపడి పనిచేసిన కూలి డబ్బులతో తమ భర్తలు తాగడానికే తగలేస్తున్నారని, ఎలా బతకాలని వాపోతున్నారు. మద్యపాన నిషేధం అయినా విధించాలని, లేకపోతే ప్రభుత్వమే తమ గ్రామంలో మద్యం షాపు పెట్టాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-11-05T19:36:10+05:30 IST