అరకొరే..

ABN , First Publish Date - 2021-07-09T05:10:31+05:30 IST

‘రైతు దినోత్సవం రోజున అనేక రాయితీలు ప్రకటిస్తాం.. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందిస్తాం.. పంటలు వేసే క్షేత్రాల్లో భూ సారాన్ని పరీక్షించేందుకు వీలుగా అగ్రి ల్యాబ్‌లను అనేక చోట్ల ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించిన ప్రభుత్వానిది ఉత్తి హడావిడేనని తేలిపోయింది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పి రైతు దినోత్సవం రోజున మూడు ల్యాబ్‌లకే పరిమితమైంది.

అరకొరే..

రైతు దినోత్సవం రోజున మూడు అగ్రిల్యాబ్‌లకే పరిమితం

వ్యవసాయ యాంత్రీకరణా అంతంత మాత్రమే 

ప్రకటనల్లో కనిపించే హడావిడి క్షేత్ర స్థాయిలో ఏదీ

రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించిన టీడీపీ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

‘రైతు దినోత్సవం రోజున అనేక రాయితీలు ప్రకటిస్తాం.. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందిస్తాం.. పంటలు వేసే క్షేత్రాల్లో భూ సారాన్ని పరీక్షించేందుకు వీలుగా అగ్రి ల్యాబ్‌లను అనేక చోట్ల ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించిన ప్రభుత్వానిది  ఉత్తి హడావిడేనని తేలిపోయింది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పి రైతు దినోత్సవం రోజున మూడు ల్యాబ్‌లకే పరిమితమైంది. చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లోనే ఏర్పాటు చేసింది. పార్వతీపురం డివిజన్‌లో మొదటి దశలో ఒక్క ల్యాబ్‌ కూడా ప్రారంభించలేదు. మరోవైపు రైతు భరోసా కేంద్రాల్లో రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ సంఘాల ఆధ్వర్యంలోనే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అద్దె రూపంలో అందిస్తామన్నారు. మూడు దశల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద యాంత్రీకరణ పరికరాలు ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టారు. మొదటి దశలో రెండు వందల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి 35 కేందాలకే పరిమితం చేశారు. అది కూడా అరకొర పరికరాలతోనే. ఖరీఫ్‌ సీజన్‌లో ట్రాక్టర్ల అవశ్యకత ఉంది. గురువారం ప్రారంభించిన 35 రైతు భరోసా కేంద్రాల్లోనూ ట్రాక్టర్లు ఏర్పాటు చేయలేదు. మిగిలిన చిన్నా చితకా పనిముట్లు మాత్రమే  చూపించి మమ అనిపించారు. కొన్ని చోట్ల రూ.10 పది లక్షల నుంచి 15 లక్షల రూపాయల విలువ గల యాంత్రీకరణ పరికరాలు మాత్రమే తెచ్చి పెట్టారు. ట్రాక్టర్‌ పెట్టాల్సి వస్తే యాక్సరీస్‌తో కలిపి రూ.10లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్‌ మినహా చిన్న చిన్న పరికరాలకే పరిమితం చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీగా రాయితీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సూక్ష్మ వ్యవసాయ విఽదానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాణిజ్య, ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తోంది. ఇక్కడ మాత్రం సూక్ష్మ వ్యవసాయ పంట రాయితీలు విడుదల చేయకుండా రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరోవైపు జగనన్న జలకళ బోర్లు ప్రకటనలకే పరిమితం చేశారు.

 రైతు దగా దినోత్సవం నిర్వహించిన టీడీపీ

తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు దగా దినోత్సవం పిలుపుతో గురువారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన తెలిపారు. చీపురుపల్లి నియోజవర్గ పరిధిలో గరివిడి మండలం కాపుశంభాం గ్రామంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో రైతు దగా దినోత్సవం నిర్వహించారు. టీడీపీ హయాంలో రైతులకు అందించిన రాయితీలన్నీ ఎత్తి వేసినట్లు ఆరోపించారు. ఎరువుల ధరలు పెంచుతూ ప్రభుత్వం రైతులపై భారాన్ని మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి జామి మండలంలో అక్కడి నాయకులు చేపట్టారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బొబ్బిలి చిరంజీవులు, ద్వారపురెడ్డి జగదీష్‌ ఆధ్వర్యంలో రైతు దగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. సాలూరు పట్టణం కూర్మరాజుపేటలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించారు.Updated Date - 2021-07-09T05:10:31+05:30 IST