ఫీజుల వసూలుకు ఏకరూప విధానం
ABN , First Publish Date - 2021-02-02T04:52:30+05:30 IST
ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల వసూలులో ప్రత్యేక విధానం తీసుకొస్తామని, ఇక నుంచి ఏకరూపంగా ఫీజుల విధానం ఉంటుందని పాఠశాల విద్యా నియంత్రణ, పరిశీలన కమిషన్ సభ్యుడు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్ అన్నారు

త్వరలోనే కార్యాచరణ
ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్‌కు 91503 81111
విద్యార్థులకు 30 శాతం రాయితీ ఇవ్వాల్సిందే
పాఠశాల విద్యా నియంత్రణ, పరిశీలన కమిషన్ సభ్యులు
కలెక్టరేట్, ఫిబ్రవరి 1: ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల వసూలులో ప్రత్యేక విధానం తీసుకొస్తామని, ఇక నుంచి ఏకరూపంగా ఫీజుల విధానం ఉంటుందని పాఠశాల విద్యా నియంత్రణ, పరిశీలన కమిషన్ సభ్యుడు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్ అన్నారు. జిల్లా పర్యటనకు సోమవారం వచ్చిన ఆయన ముందుగా విజయనగరం మండల పరిధిలోని మల్లిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. అనంతరం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాఠశాల, జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు.. వసతుల కల్పనకు, విద్యలో నాణ్యత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దన్నారు. 13 జిల్లాల్లో ఉన్న జూనియర్ కళాశాలలు, పాఠశాలలను దశల వారీగా తనిఖీ చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఏకరూప ఫీజుల విధానం అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒకే ఫీజు విధానం అమలు చేస్తామన్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల కమిటీ ఉండేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. పాఠశాలల్లో సమస్యలపై నేరుగా టోల్ ఫ్రీ నెంబర్‌కు 9150381111 ఫోన్ లేదా మెయిల్‌లో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో 30 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈవో నాగమణి, ఉప విద్యాశాఖ అధికారులు ఉన్నారు.