చిట్టీల పేరుతో టోకరా

ABN , First Publish Date - 2021-12-08T04:47:17+05:30 IST

పెదమేడపల్లిలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో ఓ వ్యక్తి రూ.3కోట్లతో నమ్మినవారికి కుచ్చుటోపీ పెట్టాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదమేడపల్లికి చెందిన బోనెల రామకృష్ణ అందరితో కలివిడిగా ఉండేవాడు.

చిట్టీల పేరుతో టోకరా

రూ.3కోట్లతో ఆ వ్యక్తి పరారీ

పోలీసులను ఆశ్రయించిన బాధితులు 

మెంటాడ, డిసెంబరు 7: పెదమేడపల్లిలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో ఓ వ్యక్తి రూ.3కోట్లతో నమ్మినవారికి కుచ్చుటోపీ పెట్టాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదమేడపల్లికి చెందిన బోనెల రామకృష్ణ అందరితో కలివిడిగా ఉండేవాడు. ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ అప్పులు ఇస్తుండేవాడు. కొన్నాళ్లకు పెదచామలాపల్లి, పోరాం, కుంఠినవలస తదితర గ్రామాలకు వ్యాపారాన్ని విస్తరించాడు. అనంతరం చిట్టీలు నిర్వహించేవాడు. కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, డ్వాక్రా మహిళలు, పింఛనుదారులు కూడా రామకృష్ణ వద్ద చిట్టీలు వేశారు. సుమారు పదేళ్లు ఫైనాన్స్‌ వ్యాపారం, చిట్టీలు సజావుగా నిర్వహించాడు. కొన్ని నెలల కిందటి నుంచి స్థానికంగా ఉండడం లేదు. బొబ్బిలిలోని అత్తవారింటి నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. రామకృష్ణ ప్రవర్తనలో మార్పు గమనించిన స్థానికులు ప్రశ్నించడంతో కుమార్తె చదువు కోసం బొబ్బిలి నుంచి రాకపోకలు సాగిస్తున్నానని నమ్మబలికాడు. చిట్టీలు పాడినవారికి డబ్బులు చెల్లించకుండా గత ఆరు నెలలుగా వాయిదా వేయడమే కాకుండా కనిపించడం మానేశాడు. ఫోన్‌లో గట్టిగా నిలదీస్తే తనకున్న ఆస్తులు అమ్మి చెల్లిస్తానని చెప్పుకొచ్చేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రూపాయి కూడా ఇవ్వబోనని బెదిరించేవాడని, అందుకే ఇంతకాలం ఫిర్యాదు చేయలేదని బాధితులు రవి, ఉమామహేశ్వర్‌ వాపోతున్నారు. రామకృష్ణ ఫోన్‌ కొద్దిరోజులుగా స్విచ్చాఫ్‌ రావడంతో అతని ఆచూకీ కోసం బొబ్బిలి తదితర ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లకు కూడా బాధితులు వెళ్లారు. తాముకూడా బాధితులమేనని బంధువులు లబోదిబోమనడం గమనార్హం. సుమారు 200 మంది వరకు బాధితులు ఉన్నట్లు సమాచారం. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకొన్న బాధితులు కొద్దిరోజుల కిందటే ఆండ్ర పోలీసులను ఆశ్రయించారు. ఓ బాధితుడు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

నిందితుని కోసం గాలిస్తున్నాం

బాధితుల నుంచి ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించాం. రెండు మూడు బృందాలుగా రామకృష్ణ కోసం గాలిస్తున్నాం. 

- సుదర్శన్‌ ఎస్‌ఐ, ఆండ్ర


-

Updated Date - 2021-12-08T04:47:17+05:30 IST