వ్యాపారికి తుపాకీతో బెదిరింపులు
ABN , First Publish Date - 2021-03-22T04:53:22+05:30 IST
నకిలీ మావోయిస్టు పేరుతో ఓ బంగారం వ్యాపారిని తుపాకీతో బెదిరించి అడ్డంగా దొరికిపోయాడు ఆర్మీ ఉద్యోగి. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

రూ.5 కోట్లు డిమాండ్
నిందితుడు ఆర్మీ ఉద్యోగి
అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయనగరం క్రైం, మార్చి 21: నకిలీ మావోయిస్టు పేరుతో ఓ బంగారం వ్యాపారిని తుపాకీతో బెదిరించి అడ్డంగా దొరికిపోయాడు ఆర్మీ ఉద్యోగి. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ రాజకుమారి ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పార్వతీపురం మండలం చినబంటువలస గ్రామానికి చెందిన సీహెచ్ రాజేశ్వరరావు ఉత్తరప్రదేశ్‌లో ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవుపై సొంతూరు వచ్చాడు. గతంలో భూ వ్యవహారానికి సంబంధించి రూ.22 లక్షలను రాజేశ్వరరావు నష్టపోయాడు. పోగొట్టుకున్న డబ్బును సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో రూ.30వేలతో ఓ నాటు తుపాకీని కొనుగోలు చేశాడు. ఈ నెల 5న రాత్రి పార్వతీపురం పట్టణంలోని పాలకొండ రోడ్డులో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి గుంపస్వామి ఇంటి వద్దకు వచ్చి కిటికీ అద్దాలను తుపాకీతో పేల్చాడు. బయటకు వచ్చి చూసేసరికి పరారయ్యాడు. ఈ నెల 6న రాత్రి గుంప స్వామికి ఫోన్ చేసి తాను జార్ఖండ్ మావోయిస్టు కమాండర్‌గా పరిచయం చేసుకుని, నిన్న రాత్రి మీ ఇంటి పరిసరాల్లో వచ్చిన శబ్దాలు తుపాకీ కాల్పులని, అవి తానే చేశానని, తక్షణమే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో కుటుంబ సభ్యులను చంపుతామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. తాను రూ.5 కోట్లు ఇవ్వలేనని, కోటి 50 లక్షల రూపాయాలు మాత్రమే ఇవ్వగలనని గుంపస్వామి తెలియజేశారు. నగదు సిద్ధం చేసుకోవాలని, ఎక్కడకు డబ్బులు తెచ్చి ఇవ్వాలో వ్యాపారికి రాజేశ్వరరావు తెలిపాడు. అనంతరం వ్యాపారి ఈ నెల7న పార్వతీపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగినదంతా వివరించాడు. ఈ మేరకు పోలీసులు ప్రణాళిక రూపొందించి ఈ నెల 18న నగదు తీసుకుని వెళ్లమని చెప్పారు. విక్రంపురం, డంగాభద్ర గ్రామాల మధ్యలోని కొండ ప్రాంతానికి వెళ్లి వ్యాపారి డబ్బులు అందజేశాడు. ఆ వెంటనే అక్కడే మాటు వేసిన పోలీసులు ఆర్మీ ఉద్యోగి రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి తుపాకీతోపాటు మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలిస్తున్నట్టు ఎస్‌పీ రాజకుమారి తెలిపారు. కేసు చేధించిన డీఎస్పీ సుభాష్, సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ కళాధర్, వీరబాబు, ఏఎస్‌ఐ రవికుమార్, కానిస్టేబుళ్లు ఉదయ్‌భాస్కరరాబు, ఎన్.శ్రీహరి, రాంబాబులను అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.