ఈసారి బ్యాంకు వంతు...

ABN , First Publish Date - 2021-06-23T05:13:20+05:30 IST

విజయనగరం ఎమ్మార్‌ కళాశాల ప్రాంగణంలోని యూనియన్‌ బ్యాంక్‌ శాఖ ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. మాన్సాస్‌ పాలకవర్గం మారిన తరువాత అంతా అస్తవ్యస్తంగా తయారైంది. పాలనంతా గందరగోళంగా మారింది. ఏ రోజు ఏం చేస్తారోనన్న టెన్షన్‌ ఉద్యోగులు, విద్యార్థుల్లో నెలకొనేది. మహరాజా కళాశాలను ప్రైవేటీకరించే ప్రయత్నమూ జరిగింది. తొలుత తరగతులను విలీనం చేసేశారు.

ఈసారి బ్యాంకు వంతు...
ఎమ్‌ఆర్‌ కళాశాలలోని బ్యాంక్‌ బ్రాంచి కార్యాలయం

అన్నీ ఎత్తివేత పద్దులోనే..

ఎమ్‌ఆర్‌ క్యాంపస్‌ యూనియన్‌ బ్యాంకు ఎత్తివేతకు యత్నం

ఇక్కడే ఉంచాలని విన్నపాలు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

విజయనగరం ఎమ్మార్‌ కళాశాల ప్రాంగణంలోని యూనియన్‌ బ్యాంక్‌ శాఖ ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. మాన్సాస్‌ పాలకవర్గం మారిన తరువాత అంతా అస్తవ్యస్తంగా తయారైంది. పాలనంతా గందరగోళంగా మారింది. ఏ రోజు ఏం చేస్తారోనన్న టెన్షన్‌ ఉద్యోగులు, విద్యార్థుల్లో నెలకొనేది. మహరాజా కళాశాలను ప్రైవేటీకరించే ప్రయత్నమూ జరిగింది. తొలుత తరగతులను విలీనం చేసేశారు. ఇదే కళాశాల ప్రాంగణంలోని యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచిని ఖాళీ చేయాలన్న ఆదేశాలు కూడా చైర్‌పర్సన్‌గా పనిచేసిన సంచయిత బ్యాంక్‌ యాజమాన్యానికి జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాల ప్రాంగణంలోని బ్యాంక్‌ శాఖను ఎత్తివేయవద్దని మాన్సాస్‌ చైర్మన్‌ ఆశోక్‌ గజపతిరాజుకు కళాశాల ఉద్యోగులు మంగళవారం వినతిపత్రం అందించారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. కళాశాల బోధన, బోధనేతర, ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది అశోక్‌ను కలిశారు. గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులకు, ఉద్యోగులకు, ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన సీనియర్‌ సిటిజన్లకు, సమీప వర్తక వాణిజ్య రంగాల వారికి ఈ బ్యాంకు బాగా ఉపయోగపడుతోందని, ఎత్తేయాలని నిర్ణయించడం సరికాదని వారు వాపోయారు. వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్నా, డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా.. ప్రాంగణంలోనే ఉన్న బ్యాంక్‌శాఖలో సునాయాసంగా పని పూర్తిచేసుకునేవారు. ఎంతో మంది ఖాతాదారులకు ఈ బ్రాంచి సేవలందిస్తోంది. వ్యాపార కోణంలో కూడా లాభదాయకంగా ఉందని సమాచారం. కొన్ని దశాబ్దాల కిందటి నుంచి ఎమ్‌ఆర్‌ కళాశాలలో ఆంధ్రా బ్యాంక్‌ శాఖ ఉండేది. ఇటీవల యూనియన్‌ బ్యాంక్‌లో విలీనమైంది. ఖాతాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. బ్యాంక్‌ విలీనమైనా ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గత చైర్‌పర్సన్‌ బ్రాంచి ఎత్తివేయాలని ఆదేశించడంతో  దీనిని ఎమ్‌జీ రోడ్డులోని యూనియన్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో విలీనం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయం తెలిసి కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు, మిగిలిన ఖాతాదారులంతా ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మాన్సాస్‌ ట్రస్టుకు సంబంధించిన డిపాజిట్లు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఫోర్ట్‌ బ్రాంచిలో ఉండేవి. సుమారు రూ.1.25 కోట్లు మేర ఉన్న డిపాజిట్లను చింతలవలసలోని మరో బ్రాంచికి తరలించినట్లు సిబ్బంది చెబుతున్నారు. యూనియన్‌ బ్రాంచి కార్యాలయాన్ని  ఎత్తివేయవద్దని సిబ్బంది కోరగా... ఈ అంశాన్ని పరిశీలిస్తానని అశోక్‌గజపతిరాజు హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-06-23T05:13:20+05:30 IST