ఉద్యమం మొదలైంది..

ABN , First Publish Date - 2021-12-08T04:44:51+05:30 IST

ఉద్యమం వైపుగా తొలి అడుగు పడింది. డిమాండ్ల సాధనకు ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, పెన్సనర్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులంతా ఏకమయ్యారు. మొదటిరోజు మంగళవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉద్యమం మొదలైంది..
విజయనగరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్యోగుల నిరసన

తొలిరోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు

జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు

డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు 

ఉద్యమం వైపుగా తొలి అడుగు పడింది. డిమాండ్ల సాధనకు ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, పెన్సనర్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులంతా ఏకమయ్యారు. మొదటిరోజు మంగళవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈ నెల 27 వరకు వివిధ రూపాల్లో నిరసన తెలుపనున్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగుల సంఘం నేతలు ఇప్పటికే ప్రకటించారు. 

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ తీరుపై కొంతకాలంగా నిరాశతో ఉన్న ఉద్యోగులు ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక పిలుపుమేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్న విషయం తెలిసిందే. ఆ మేరకు మంగళవారం తొలిరోజు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అన్ని కార్యాలయాల్లోనూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ తీరును నిరశిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నినాదాలు చేశారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే  ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చేవిధంగా ముందుకు తీసుకువెళతామని రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకుడు కె.గోవిందరావు స్పష్టంచేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మండల రెవెన్యూ, పరిషత్‌ ఇలా అన్ని శాఖల ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇది ప్రారంభం మాత్రమేనని ప్రభుత్వం స్పందించకపోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

2019 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేసినప్పుడు సీపీఎస్‌ రద్దుచేస్తామని జగన హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామన్నారు. కరువు భత్యం బకాయిలన్నీ సత్వరమే చెల్లిస్తామని, పింఛనుదారుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడతామని చెప్పారు. ‘వాటన్నింటినీ నిజమే అనుకున్నాం. గెలిపించాం.. ఇప్పుడు అనుభవిస్తున్నాం’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు మధనపడుతున్నారు. ఆ కోపంతోనే ఉద్యమబాట పట్టారు. విజయనగరం కార్పొరేషన్‌ కార్యాలయం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మునిసిపల్‌ కార్యాలయాల ఉద్యోగులు, ఆర్టీసీ డిపోల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, మండల పరిషత్‌, రెవెన్యూ కార్యాలయాల ఉద్యోగులు, అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈనెల 10వ తేదీవరకు ఇదే విధంగాఉద్యమించనున్నారు. విధులకు హాజరవుతూనే నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరిస్తారు. 10వ తేదీ తరువాత విధులను పక్కన పెట్టి నేరుగా మండల, డివిజన్‌, జిల్లా కేంద్రాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద ఆందోళనలు చేపట్టాలని ఉద్యోగుల సంఘం నేతలు ఇప్పటికే పిలుపునిచ్చారు. 



Updated Date - 2021-12-08T04:44:51+05:30 IST