తర‘గతి’ మారిపోయె!

ABN , First Publish Date - 2021-12-29T05:03:25+05:30 IST

కొవిడ్‌ ప్రభావం విద్యారంగంపైనా తీవ్రంగానే పడింది. సాధారణంగా విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమై.. ఏప్రిల్‌తో ముగుస్తుంది. కానీ 2021-22 విద్యా సంవత్సరంలో ఇప్పటికీ వివిధ కోర్సుల్లో ప్రవేశాలు సాగుతూనే ఉన్నాయి. కనీసం 90 రోజుల తరగతుల నిర్వహణ లేకుంటే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో సెమెస్టర్‌ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదు.

తర‘గతి’ మారిపోయె!

విద్యారంగంపై కరోనా పంజా

గందరగోళంగా విద్యా సంవత్సరం

 టెన్త, ఇంటర్‌లో అంతా పాస్‌

అన్ని తరగతులకు ఆలస్యంగా అడ్మిషన్లు

 బోధకులు 66 మంది మృతి

చేదు అనుభవాన్ని మిగిల్చిన 2021


కొవిడ్‌  ప్రభావం విద్యారంగంపైనా తీవ్రంగానే పడింది.  సాధారణంగా విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమై.. ఏప్రిల్‌తో ముగుస్తుంది. కానీ 2021-22 విద్యా సంవత్సరంలో ఇప్పటికీ వివిధ కోర్సుల్లో  ప్రవేశాలు సాగుతూనే ఉన్నాయి. కనీసం 90 రోజుల తరగతుల నిర్వహణ లేకుంటే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో సెమెస్టర్‌ పరీక్షల నిర్వహణ  సాధ్యం కాదు. దీంతో తరగతులు... పరీక్షలు... ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యమవుతోంది. సాఽధారణ పరిస్థితులు ఏర్పడే వరకు విద్యా రంగం కుదుటపడే అవకాశం లేదని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కరోనాతో విద్యారంగం తీరే మారిపోయింది. 2021లో కాస్త కుదుటపడిందని అంతా ఆశించినా.. కొత్త వేరియంట్ల అలజడితో చదువులు అరకొరగానే సాగాయి. కేజీ నుంచి పీజీ వరకూ.. ఐటీఐ నుంచి ఐఐటీ వరకూ విద్యా వ్యవస్థను ఆ మహమ్మారి కుదిపేసింది. విద్యా సంస్థలు ఎప్పుడు తెరుస్తున్నారో... ఎప్పుడు మూసేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కార్పొరేట్‌ స్కూళ్ల నుంచి సర్కారు వారి పాఠశాలల వరకూ అంతా ఆనలైన తరగతుల బాట పట్టాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి విద్యా సంస్థలు తేరుకుంటున్నా తరగతుల నిర్వహణ మాత్రం గాడిన పడలేదు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బడిలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రైవేట్‌ ఉపాధ్యాయులు ఉపాధి పనులకు, వ్యవసాయ పనులు, భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా మారిపోయారు. ఈ ఏడాది మార్చి 22 వరకు పాఠశాలలు నిర్వహించారు. విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బోధనంతా ఆనలైనలోకి మారిపోయింది. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కలిపి 66 మంది సెకెండ్‌ వేవ్‌లో ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్‌ ఉపాధ్యాయులు కూడా అనేక మంది మృతిచెందారు. వీరే కాకుండా ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఇతర సిబ్బందినీ కరోనా కాటేసింది. 

అంతా పాస్‌

 ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో అందరినీ పాస్‌ చేశారు. తొలుత పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. కాని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పరీక్షలు నిర్వహించలేదు. అందరినీ పాస్‌ చేసినట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు 32వేల మందిని ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆగస్టు 16న ప్రారంభమైంది. వాస్తవంగా జూన్‌ 12నుంచి ప్రారంభించాలి. ఇక ఇంటర్‌లో అయితే పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీఅయోమయ పరిస్థితి కారణంగా మొదటి సంవత్సరం మార్కులను బేరీజు వేసుకుని అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 43వేల మంది పరీక్షలు రాశారు. అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇలా విద్యా సంవత్సరంలో ప్రమాణాలపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. 

కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం

ఇంజనీరింగ్‌, పీజీ సెట్‌, ఐసెట్‌ రాసిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యమైంది. విద్యా సంవత్సరం మరో నాలుగు నెలలే ఉంది. ఇప్పటికీ ఇంజనీరింగ్‌ యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తూనే ఉన్నారు.  పీజీ సెట్‌ రాసిన విద్యార్థులకు విశ్వ విద్యాలయాలు వచ్చే నెల 2వరకు అప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఇచ్చింది. ఇలా విద్యా రంగం 2021లో అనేక ఆటుపోట్లకు గురైంది. 

నూతన విద్యా విధానంపై వ్యతిరేకత

కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ రాషా్ట్రల్లో సైతం అమలు కాని విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు 250 మీటర్ల లోపు ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. దీనివల్ల స్వగ్రామాల్లోని బడికి పంపించాల్సిన చిన్న పిల్లలను ఇప్పుడు దూర ప్రాంతాలకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై తల్లిదండ్రుల్లోనూ వ్యతిరేకత మొదలైంది. 

సిలబస్‌ పూర్తికాని వైనం

ఇంటర్‌లో విద్యార్థులకు సిలబస్‌ కాలేదు. దీనికి కారణం అధ్యాపకుల కొరత. విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా సిలబస్‌ పూర్తి కాలేదు. దీనిపై విద్యార్థులు ఉద్యమిస్తూనే ఉన్నారు. రాజీవ్‌నగర్‌ కాలనీ వద్ద ఉన్న ఆర్‌ఐఓ కార్యాలయాన్ని ఇటీవల ముట్టడించారు. సిలబస్‌ కాకుండానే అర్ధ సంవత్సర పరీక్షలు వచ్చి పడ్డాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న 33 కేజీబీవీ పాఠశాలలను ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేశారు. కాని లెక్చరర్లను నియమించలేదు. 

ఎయిడెడ్‌ సెక్షన్ల ఎత్తివేత

ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల అంశం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసింది. ముఖ్యంగా జిల్లాకే తలమానికంగా ఉన్న మహరాజా(ఎమ్మార్‌) కళాశాలలో ఎయిడెడ్‌ సెక్షన్ల ఎత్తివేత పెద్ద దుమారాన్ని రేపింది. పేద విద్యార్థులకు అందే విద్య పట్ల ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా నిరసించాయి. ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లను ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్‌, పాఠశాలల్లో నియమించింది. 

ధరల ప్రభావం

ధరలు రోజురోజూ పెరుగుతున్నాయి. విద్యార్థుల మెస్‌ ఛార్జీలు పెరగటం లేదు. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు అందించే బిల్లులు పెరగటం లేదు సరికదా బిల్లులు సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పడుతోంది. ఇటీవల బొండపల్లి మండలంలో కేజీబీవీ పాఠశాలలో నాణ్యమైన ఆహారాన్ని అందించని పరిస్థితిని అధికారులు గుర్తించారు. 


Updated Date - 2021-12-29T05:03:25+05:30 IST