అనుమానం పెనుభూతమై..

ABN , First Publish Date - 2021-12-08T05:09:23+05:30 IST

భార్యను కంటికి రెప్పలా కాపాడుతానని పెళ్లినాట ప్రమాణం చేసిన భర్తే ఆమెపై నిర్దాక్షణ్యంగా హత్యాయత్నం చేశాడు. అనురాగం చూపాల్సిన వ్యక్తి అక్కసు వెళ్లగక్కాడు. నరనరాన అనుమానం పెంచుకుని ఆమె పట్ల నిర్దయగా ప్రవర్తించాడు. కత్తితో ఒళ్లంతా గాయపరిచాడు.

అనుమానం పెనుభూతమై..

భార్యపై హత్యాయత్నం 

తీవ్రంగా గాయపడిన భార్య

సాలూరు రూరల్‌, డిసెంబరు 7: భార్యను కంటికి రెప్పలా కాపాడుతానని పెళ్లినాట ప్రమాణం చేసిన భర్తే ఆమెపై నిర్దాక్షణ్యంగా హత్యాయత్నం చేశాడు. అనురాగం చూపాల్సిన వ్యక్తి అక్కసు వెళ్లగక్కాడు. నరనరాన అనుమానం పెంచుకుని ఆమె పట్ల నిర్దయగా ప్రవర్తించాడు. కత్తితో ఒళ్లంతా గాయపరిచాడు. తీవ్ర గాయాలతో ఆమె ప్రస్తుతం విజయనగరం కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యపై అనుమానంతో హత్యాయత్నం చేసిన ఘటన కొత్తవలస పంచాయతీ గొందివలసలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

గొందివలస గ్రామానికి చెందిన మర్రి సత్యారావుకు రమణమ్మతో దాదాపు 13ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. మొదట్లో అన్యోన్యంగానే ఉండేవారు. తర్వాత రోజుల్లో ఆమెపై భర్తకు అనుమానం కలిగింది. అది రానురాను పెనుభూతంగా మారింది. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు తీవ్రమయ్యాయి. కొద్దినెలలుగా రోజూ గొడవ పడుతున్నారు. సత్యారావు మద్యం తాగి వచ్చి ఇష్టాసారంగా మాట్లాడడం.. ఆమె నొచ్చుకుని నిలదీయడం మామూలైపోయింది.  సోమవారం రాత్రి సైతం గొడవ జరిగింది. తాగిన మత్తులోనే నిద్రపోయిన సత్యారావు మంగళవారం తెల్లవారు జామున లేచి నిద్రలో ఉన్న భార్య రమణమ్మపై కత్తితో దాడి చేశాడు. మొహం, చేతిపై తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో ఆమె హాహాకారాలు చేస్తున్నా పట్టించుకోలేదు.  అనుమానం కలిగి చుట్టుపక్కల వారు ఇంటికి రాక వారిని లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. అయినాసరే వారు అతన్ని నెట్టి ఇంట్లోకి వెళ్లారు. సృహ కోల్పోయిన ఆమెను చూసి 108కి ఫోన్‌ చేశారు. ఆ వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆటోలో సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాసుపత్రికి తీసుకెళ్లారు. సాలూరు రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 


--------


Updated Date - 2021-12-08T05:09:23+05:30 IST