50 ఏళ్లు నిండిన కళాకారులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-11-28T05:45:49+05:30 IST

కళాకారులను...ముఖ్యంగా 50 ఏళ్లు నిండిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, రంగస్థల కళాకారుడు యడ్ల గోపాలరావు అన్నారు. వయసు మీద పడుతోందని...అయినా శక్తి వంచన లేకుండా కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

50 ఏళ్లు నిండిన కళాకారులను ఆదుకోండి
గోపాలరావును ఉద్దేశించి మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

 ప్రత్యేకంగా పింఛన్‌ అందించండి 

‘పద్మశ్రీ’ యడ్ల గోపాలరావు వేడుకోలు

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ బాబామెట్ట, నవంబరు 27: కళాకారులను...ముఖ్యంగా 50 ఏళ్లు నిండిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, రంగస్థల కళాకారుడు యడ్ల గోపాలరావు అన్నారు. వయసు మీద పడుతోందని...అయినా శక్తి వంచన లేకుండా కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం ఆల్‌ ఇండియా కళా రంగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోపాలరావుకు సత్కార సభ ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పైడితల్లమ్మ దేవాలయం నుంచి వివిధ కళారూపాలతో ఊరేగింపు చేపట్టారు. సభలో యడ్ల గోపాలం మాట్లాడుతూ, కళాకారుల అభివృద్ధి కోసం ఆల్‌ ఇండియా కళా రంగం ఏర్పాటు కావడం ఆనందదాయకమన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కళాకారుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలని కోరారు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేద కళాకారులకు ప్రత్యేక పెన్షన్‌ మంజూరు చేయాలన్నారు. కలెక్టర్‌ సూర్యకుమారి మాట్లాడుతూ ఇతర జిల్లాల్లోని కళాకారులను కూడా గౌరవించి సత్కరించడం గొప్ప  సంప్రదాయమన్నారు. కళాకారులు సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యపరిచేలా యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా కూడా సేవలు అందించవచ్చునని చెప్పారు. కార్యక్రమం ఆద్యంతం కళాకారుల గీతాలాపనతో సందడిగా సాగింది. రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్‌పర్సన వంగపండు ఉషారాణి తన తండ్రి ప్రసాద్‌ రచించి ఆలపించిన ఏం..పిల్లడో ఎల్దమొస్తవా పాటను ఉత్సాహంగా ఆలపించారు. జానపద కళాకారుడు అసిరయ్య జముకుల పాటతో అందరినీ ఉర్రూతలూగించారు. 

కళాకారుల సంక్షేమానికి కృషి

జిల్లాలో 10వేల మంది వరకూ వివిధ కళాప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ఉన్నారని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఆల్‌ ఇండియా కళారంగం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు బోను సింహాచలం, గరివిడి లక్ష్మిలు చెప్పారు. గోపాలరావు సత్కార సభలో మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రదర్శనలు లేక ఎంతో మంది కళాకారులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. అటువంటి వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ప్రచారాలకు జిల్లా కళాకారులను వినియోగిస్తే ఉపాధి లభిస్తుందని, ఆ వైపుగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేసీ కిషోర్‌కుమార్‌,  ఆల్‌ ఇండియా కళా రంగం వ్యవస్థాపకులు మాడుగుల సుధీర్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు ధనుంజయరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T05:45:49+05:30 IST