గుట్టుగా తిరిగేస్తున్నారు..

ABN , First Publish Date - 2021-05-09T04:46:10+05:30 IST

చుట్టుపక్కల వారు వివక్షతో చూస్తారనో.. బయటకు రానీయరనో.. వైద్య సిబ్బంది వచ్చి హడావిడి చేస్తారనో.. కొంత మంది కొవిడ్‌ పరీక్షల కోసం గుట్టుగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడైతే కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయినా ఎవరికీ తెలియదు.

గుట్టుగా తిరిగేస్తున్నారు..

ఖర్చయినా ప్రైవేటులోనే కొవిడ్‌ పరీక్షలు

ఎవరికి చెప్పకుండా సొంత వైద్యం

ఆన్‌లైన్‌ కాకపోవడంతో లెక్కల్లోకి రాని వైనం

వైరస్‌ విస్తరణకు ఇదో కారణం 

 శృంగవరపుకోట, మే 8: చుట్టుపక్కల వారు వివక్షతో చూస్తారనో.. బయటకు రానీయరనో.. వైద్య సిబ్బంది వచ్చి హడావిడి చేస్తారనో.. కొంత మంది కొవిడ్‌ పరీక్షల కోసం గుట్టుగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడైతే కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయినా ఎవరికీ తెలియదు. మందులు కూడా మెడికల్‌ షాపుల నుంచి సొంతంగా తెచ్చుకుని వాడేస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు బయటకు కనిపిస్తున్నప్పటికీ వైరల్‌, సాధారణ జ్వరాలుగా చెప్పుకుంటున్నారు. తగ్గిపోయిందంటూ నలుగురితో కలసి తిరిగేస్తున్నారు. వైరస్‌ విస్తరణకు ఇదొక కారణంగా మారుతోంది. 

కొవిడ్‌ మొదటి దశలో ఎక్కువగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖే కరోనా పరీక్షలు నిర్వహించేది. ప్రైవేట్‌ ల్యాబ్‌లలో పరీక్షలు చేసుకున్నప్పటికీ వివరాలు ఆన్‌లైన్‌ చేయడంతో వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఉండేది. దీంతో ఎక్కడ కరోనా పరీక్షలు చేసుకున్నప్పటికీ వైరస్‌ ఉన్న వారి వివరాలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి తెలిసేవి. వారంతా బాధితులను బయట తిరగకుండా చూసేవారు. బాధితులు కలిసిన వారితో పాటు చుట్టుపక్కల నివాసాలకు చెందిన వారికి పరీక్షలు చేసేవారు. ఇలా ఎంతోకొంత వైరస్‌ కట్టడి జరిగేది. ఇప్పుడు కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇదే విధానాన్ని పాటిస్తోంది. పరీక్షలతో పాటు మందులు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాపిడ్‌ టెస్టులు తగ్గించింది. వీటిని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ పరీక్షలకు రూ.1000 నుంచి రూ.2000 వరకు దోచేస్తున్నారు. పరీక్ష చేసుకున్న ఆరగంటలోపే వైరస్‌ నిర్ధారణ కావడం.. ఎవరికీ తెలియకుండా ఉండడంతో పైసలెక్కువైనా అటువైపే మొగ్గు చూపుతున్నారు. పరీక్షల రిపోర్టులనుఆన్‌లైన్‌ చేయకపోవడంతో బాధితుల వివరాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియడం లేదు. దీంతో పాజిటివ్‌లతో పాటు కాంటాక్టులను ఈ శాఖ గుర్తించలేకపోతోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడుతోంది. పాజిటివ్‌ల గురించి తెలియకపోవడంతో వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి వైద్యం అందడం లేదు. దీంతో కొంతమంది ఆరోగ్యం క్షిణిస్తోంది. ఆక్సిజన్‌  స్థాయిలు పడిపోతున్నాయి. అప్పుడు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా చేర్చుకోవడం లేదు. తొందరగా కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరాలని సూచిస్తున్నారు. లక్షణాలను బట్టి కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నప్పటికీ రిపోర్టులు వచ్చేవరకు వైద్యం అందించడంలోను, బెడ్‌లు కేటాయించడంలోను ఆలస్యం జరుగుతోంది. ఈ విధంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కర్ప్యూతో పాటు ప్రైవేటు టెస్టుల రిపోర్టులను కూడా ఆన్‌లైన్‌ చేసేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే వైరస్‌ వ్యాప్తికి కొంతవరకు కట్టడి చేసే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పరీక్షించుకోవాలి

ప్రభుత్వ ఆసుపత్రులైన కేంద్ర, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేసుకోవాలి. వీటి ఆధారంగానే పాజిటివ్‌ బాధితులకు చికిత్స ఉంటుంది. జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ టెస్టులు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ దృష్టిలో ఉంది. ఇలాంటి వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రెండు రోజుల కిందట హెచ్చరించారు. 

        - డాక్టర్‌ ఆర్‌.త్రినాథరావు, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, ఎస్‌.కోట



Updated Date - 2021-05-09T04:46:10+05:30 IST