అసంపూర్తి పనులు.. అనాలోచిత నిర్ణయాలు!

ABN , First Publish Date - 2021-08-21T04:56:09+05:30 IST

అసంపూర్తి పనులు.. అనాలోచిత నిర్ణయాలు!

అసంపూర్తి పనులు.. అనాలోచిత నిర్ణయాలు!
యాంత్రీకరణ సామగ్రి పంపిణీ చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

- పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోని పథకాలు

- అక్కరకు రాని ఆర్బీకేల సేవలు

- వెంటాడుతున్న సాగునీటి వెతలు 

- నేడు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం

(టెక్కలి)

‘ఇది రైతు ప్రభుత్వం. అన్నదాత సంక్షేమమే ముఖ్యం. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం’..అంటూ పాలకులు చెప్పుకొస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అసంపూర్తి పనులు, అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ పథకమూ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులకు బిల్లులూ సకాలంలో చెల్లించడం లేదు. సాగునీటికి సంబంధించి సమస్యలు పరిష్కారం కావడం లేదు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలోనైనా తమ సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందనే కొండంత ఆశతో రైతులు ఉన్నారు. 


ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. రైతులకు సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతలకు మెరుగైన సేవలే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు(ఆర్జీకే) అరకొరగానే వినియోగమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 835 రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విత్తనాల నుంచి ఎరువులు, క్రిమిసంహారక మందుల వరకూ అందించనున్నట్టు అధికారులు ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలన్నీ ఆర్బీకేల ద్వారా జరుగుతాయని చెప్పుకొచ్చారు. యంత్ర పరికరాలను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ఇందుకుగాను కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను నెలకొల్పినట్టు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించలేకపోయారు. క్రిమిసంహారక మందుల ఊసేలేదు. ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన ధాన్యం రవాణాకు సంబంధించి చార్జీలు చెల్లించలేదు. రబీలో నష్టపోయిన వేరుశనగ రైతులకు పరిహారం లేదు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లలో యంత్రాలు, పరికరాల జాడలేదు. సాగునీటి కాలువల నిర్వహణ సక్రమంగా లేదు. కానీ అన్నీ సవ్యంగా ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు అగచాట్లు పడుతున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. 


నిరుపయోగంగా పరికరాలు

ప్రస్తుతం ఖరీఫ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లలో పరికరాలకు మాత్రం మూలన పడి ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 252 సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలివిడతగా 142 కేంద్రాలనే ఏర్పాటు చేశారు. అందులో 67 గ్రూపులకు సబ్సిడీ రూపంలో రూ.95 లక్షలు అందించారు. 40శాతం ప్రభుత్వ సబ్సిడీ, రైతు వాటా పది శాతం, బ్యాంకు రుణం 50 శాతం కింద నిర్ణయించి యంత్రాలు, పరికరాలు అందజేశారు. జూలై 8న వైఎస్సార్‌ జయంతి నాడు నాగళ్లు, దమ్ముసెట్లు, రోటావేటర్‌, నూర్పుయంత్రాలు, కోత మిషన్లు, పవర్‌టిల్లర్స్‌ వంటి వాటిని పంపిణీ చేశారు. ఇందులో కొన్నిరకాల పరికరాలు వాడేందుకు ట్రాక్టర్‌ తప్పనిసరి. కానీ ట్రాక్టర్లను అందించకపోవడంతో పరికరాలన్నీ నిరుపయోగంగా మారాయి. ధర విషయంలో తేడాయే ట్రాక్టర్లు ఇవ్వకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం షోరూంలో ట్రాక్టర్‌ ధరకు, సీహెచ్‌సీ గ్రూపులకు అందించనున్న ట్రాక్టర్లకు కంపెనీలు కోట్‌ చేసిన ధరకు రూ.లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకూ వ్యత్యాసం ఉంది. గత ప్రభుత్వ హయాంలో రైతు రథాలకు ఇచ్చిన ట్రాక్టర్లకు సంబంధించి సుమారు రూ.15 కోట్ల వరకూ బకాయిలు ఉండడంతో ముందస్తుగానే అధిక ధరలకు కోట్‌ చేసినట్టు తెలిసింది. ఇవన్నీ ట్రాక్టర్ల పంపిణీకి అవరోధంగా నిలిచాయి. 

 

వీటికి పరిష్కారం దొరికేనా?

- ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సంబంధించి ధాన్యం రవాణా చార్జీలు సుమారు రూ.24 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. రబీ సీజన్‌లో టెక్కలి సబ్‌డివిజన్‌లో కోల్డ్‌స్టోరేజ్‌ వేరుశనగ విత్తనం ద్వారా నష్టపోయిన రైతులకు సుమారు కోటి రూపాయలు మంజూరైనా.. ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. గతంలో వరిని ఎదలు రూపంగా వేసిన రైతులకు నామినీగోల్డ్‌ వంటి కలుపు నివారణ మందును సబ్సిడీతో ముందస్తుగా పంపిణీ చేసేవారు. కానీ రెండేళ్లుగా ఈ మందు పంపిణీ నిలిచిపోయింది. 

- ఏటా ముందస్తు చర్యల్లో భాగంగా 107 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా శివారు ఆయకట్టుకు నీరందించేవారు. కానీ ఈ ఏడాది ప్రణాళిక లోపించింది. దాదాపు నెల రోజులు దాటుతున్నా 90వ కిలోమీటరు కూడా సాగునీరు దాటని పరిస్థితి. వంశధార ఎడమ ప్రధాన కాలువలో పర్యవేక్షణకు లస్కర్లను నియమించాల్సి ఉంది. జల వనరుల సంస్థ(కాడ)ు అనుమతులు ఇచ్చి నెలరోజులు దాటినా ఇప్పటికీ లస్కర్ల


నియామకం చేపట్టని పరిస్థితి. 

- ఎరువుల ధరలను పెంచి వ్యాపారులు విక్రయిస్తున్నారు. యూరియా రూ.300 దాటి  అమ్మకాలు చేస్తున్నా వ్యవసాయ శాఖ నోరు మెదపని పరిస్థితి. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ఆర్‌బీకేలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మత్స్యశాఖ ద్వారా చిరుచేపపిల్లల పంపిణీ గత రెండేళ్లుగా పూర్తిస్థాయిలో జరగడం లేదు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలన్నింటిపై చర్చించి.. మోక్షం కల్పించాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-21T04:56:09+05:30 IST