పాపం మూగజీవులు

ABN , First Publish Date - 2021-11-22T04:13:14+05:30 IST

వర్షాల ప్రభావం పంటలపైనే కాదు.. మూగ జీవులపై కూడా తీవ్రంగా పడింది. ఇటీవల కురిసిన వర్షాలతో గొర్రెలు, మేకలు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఒకటి రెండు రోజులు కాదు గత మూడు నెలల నుంచి వ్యాధులతో అవస్థలు పడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి మూగజీవాలకు కష్టాలు ఎదురవుతున్నాయి. వ్యాధుల నివారణకు మూడు నుంచి నాలుగుసార్లు మందులు వాడినా వ్యాధి నయం కాక పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

పాపం మూగజీవులు
వ్యాధులతో అవస్థలు పడుతున్న మేకలు

వర్షాలకు గొర్రెలు, మేకలకు వ్యాధులు

మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి 

తీవ్రంగా నష్టపోతున్న పెంపకందారులు 

కలెక్టరేట్‌, నవంబరు 21: వర్షాల ప్రభావం పంటలపైనే కాదు.. మూగ జీవులపై కూడా తీవ్రంగా పడింది. ఇటీవల కురిసిన వర్షాలతో గొర్రెలు, మేకలు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఒకటి రెండు రోజులు కాదు గత మూడు నెలల నుంచి వ్యాధులతో అవస్థలు పడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి మూగజీవాలకు కష్టాలు ఎదురవుతున్నాయి. వ్యాధుల నివారణకు మూడు నుంచి నాలుగుసార్లు మందులు వాడినా వ్యాధి నయం కాక పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7లక్షల 25 వేల గొర్రెలు, మేకలు ఉన్నాయి. దాదాపు 23 వేల మంది పెంపకందారులు ఉన్నారు. వీరంతా వాటి మనుగడపైనే జీవిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో గొర్రెలు, మేకలను తమ గ్రామాలకు దూరంగా ఉన్న ప్రాంతాలకు మేతకు తీసుకువెళ్తున్నారు. వారి ఇళ్ల వద్ద విశాలమైన స్థలం లేక మెట్టు ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో అవి ఎప్పటికప్పుడు వర్షాలకు తడుస్తున్నాయి. వర్షం నీటిలోనే తిరుగుతున్నాయి.  గత ఆగస్టు నుంచి ఇప్పటివరకూ వరుస తుఫాన్‌లు రావడంతో వాటికి కాళ్లు.. పుళ్లు వ్యాధులు సోకుతున్నాయి. సాధారణంగా ఈ వ్యాధి సోకిన వెంటనే ఆయా పెంపకందారులు సంబంధిత వైద్యుల సూచనలు తీసుకుని మందులు వాడితే వెంటనే తగ్గుతాయి. ఈ ఏడాది మాత్రం అలా లేదు. వ్యాఽధులు సోకి మూడు నెలలు కావస్తున్నా  నయం కావడంలేదు. ఇప్పటికే మూడు నుంచి నాలుగుసార్లు మందులు వేసిన వారు ఉన్నారు. అయినా తరచూ గొర్రెలు మృత్యుబారిన పడుతున్నాయి. 

గత మూడు నెలల్లో రూ.లక్షా 50 వేల నష్టం

మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నా. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి మేకలకు వచ్చిన కాళ్లు పుళ్లు వ్యాధులు తగ్గడంలేదు. ఇప్పటికి మూడు నుంచి నాలుగుసార్లు మందులు  వేశాం. ఒక్కో ఇంజెక్షన్‌ రూ.800కు కొనుగోలు చేశాను. అయినా వ్యాధి తగ్గలేదు. ఈ మూడు నెలల సమయంలో విలువైన 5 మేకలు మృతి చెందాయి. వీటి విలువ రూ.1,50,000 ఉంటుంది. ఏడాది పొడుగునా కష్ట పడితే లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో? తెలియడం లేదు.

- వారాది పెద్దఎర్నినాయుడు, పెంపకం దారుడు, సిరిపురం, గంట్యాడ మండలం

వర్షాలతోనే నయం కాలేదు

నిత్యం వర్షాలు కురవడంతో ప్రతిచోటా నీరు ఉండటం వల్ల కాళ్లకు వచ్చే వ్యాధి తగ్గడం లేదు. చాలా చోట్ల ఈ సమస్య ఉంది. మందులు వినియోగిస్తున్నా వ్యాధి నయం కావడం లేదు. వర్షాలు తగ్గితే పరిస్థితి మారుతుంది. 

                                  - రెడ్డి కృష్ణ, ఏడి, పశుసంవర్ధక శాఖ Updated Date - 2021-11-22T04:13:14+05:30 IST