రోడ్డెక్కిన కార్మికులు

ABN , First Publish Date - 2021-12-08T05:02:02+05:30 IST

లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారానికి చెందిన కార్మికులంతా మరోసారి రోడ్డెక్కారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న వారంతా ఎమ్మెల్యేకు మొర వినిపించేందుకు పాదయాత్ర చేశారు. దాదాపు 250 మంది కార్మికులు మంగళవారం ఐదు కిలోమీటర్లు నడిచారు.

రోడ్డెక్కిన కార్మికులు
పాదయాత్రలో షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు

ఐదు కిలోమీటర్లు పాదయాత్ర

ఎమ్మెల్యేకి సమస్యలపై షుగర్స్‌ కార్మికుల మొర

బొబ్బిలి రూరల్‌, డిసెంబరు 7: లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారానికి చెందిన కార్మికులంతా మరోసారి రోడ్డెక్కారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న వారంతా ఎమ్మెల్యేకు మొర వినిపించేందుకు పాదయాత్ర చేశారు. దాదాపు 250 మంది కార్మికులు మంగళవారం ఐదు కిలోమీటర్లు నడిచారు. శ్రీరామా షుగర్‌ మిల్లు లేబర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి చెలికాని గోపాలకృష్ణ, సీపీఐ నేత  కండాపు ప్రసాదరావు, జిల్లా ఏఐటీయూసీ నేత సిద్దాబత్తుల రామచంద్రరావు, జిల్లా సీపీఐ కార్యదర్శి ఒమ్మి రమణ, ఏఐవైఎఫ్‌ నేత కోట అప్పన్నల నాయకత్వంలో కార్మికులంతా నినాదాలు చేసుకుంటూ పాదయాత్ర ప్రారంభించారు. లచ్చయ్యపేట, పాతబొబ్బిలి మీదుగా బొబ్బిలి పట్టణానికి ఐదు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శంబంగిని కలిసి సమస్యలను ఏకరువు పెట్టారు.  వేతన బకాయిలు, పీఎఫ్‌, గ్రాట్యూటీ, ఎల్‌ఐసీ తదితర బకాయిలు రూ.7 కోట్లు చెల్లించకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం తమకును రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే విధుల్లోనుంచి తొలగించిందన్నారు. కర్మాగారం మనుగడను కాపాడాలని, అటు రైతాంగానికి, ఇటు కార్మికులకు మేలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సీజన్‌లో క్రషింగ్‌ నిర్వహించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలన్నారు. ఏనాడూ ఉద్యమబాట పట్టని తమకు యాజమాన్యం తీరని అన్యాయం చేసిందని వాపోయారు. 

మంత్రి స్పందించారు: ఎమ్మెల్యే శంబంగి

కార్మిక నాయకులు చెప్పిన అంశాలను విన్న తరువాత ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ జిల్లా మంత్రి బొత్స సత్యన్నారాయణ తక్షణం స్పందించి షుగర్స్‌పై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆర్‌ఆర్‌ యాక్డు అమలు కోసం ఆదేశాలిచ్చారని, పంచదార నిల్వలను వేలం వేయించారని చెప్పారు. షుగర్స్‌ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మికసంఘం నేతలు కొండలరావు, సన్యాసిరాజు, త్రినాథ, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

గ్రామాల్లో జీపు జాతా

 సీతానగరం : లచ్చయ్యపేట షుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని, ప్రభుత్వమే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని నడపాలని ఆంధ్రప్రదేశ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. సీతానగరం మండలంలోని చినభోగిలలో మంగళవారం జీపు జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడేళ్లుగా ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకు బకాయిలు, కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేయడం దారుణమన్నారు. జాతాలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి లక్ష్మునాయుడు, గేదెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-12-08T05:02:02+05:30 IST