వలం‘టియర్స్‌’

ABN , First Publish Date - 2021-07-09T05:20:58+05:30 IST

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేతలో వలంటీర్ల వద్ద ఉండే డివైజ్‌లు(స్కానర్లు) కీలకం. వాటిపై వేలిముద్ర వేశాకే పింఛనైనా.. ఇతర పథకాలైనా వర్తిస్తాయి. ఇంత ముఖ్యమైన పరికరాలు అనేక చోట్ల మూలకు చేరుతున్నాయి. మరమ్మతుల కోసం వాటిని పంపి నెలలైనా తిరిగి రావడం లేదు. దీంతో వలంటీర్లు ఉన్న వాటిని వంతులుగా వినియోగిస్తున్నారు.

వలం‘టియర్స్‌’

 మూలకు చేరుతున్న స్కానర్లు

జిల్లాలో సగానికిపైగా మొరాయింపు

కొత్తవి సమకూర్చని సర్కారు

సమ్యలు ఎదుర్కొంటున్న వలంటీర్లు

 

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేతలో వలంటీర్ల వద్ద ఉండే డివైజ్‌లు(స్కానర్లు) కీలకం. వాటిపై వేలిముద్ర వేశాకే పింఛనైనా.. ఇతర పథకాలైనా వర్తిస్తాయి. ఇంత ముఖ్యమైన పరికరాలు అనేక చోట్ల మూలకు చేరుతున్నాయి. మరమ్మతుల కోసం వాటిని పంపి నెలలైనా తిరిగి రావడం లేదు. దీంతో వలంటీర్లు ఉన్న వాటిని వంతులుగా వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల సొంత డబ్బులతో కొనుక్కోవాలని, బిల్లు పెడితే డబ్బులు మంజూరయ్యాక ఇస్తామని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఈ పరిస్థితితో వలంటీర్లు అటు పని చేయలేక..ఇటు మానుకోలేక అవస్థలు పడుతున్నారు.

మెంటాడ/ గరుగుబిల్లి, జూలై 8:

జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న వలంటీర్లకు ప్రభుత్వం అందజేసిన స్కానర్ల(డివైస్‌)లో దాదాపు సగం మేర మొరాయించి మూలకు చేరాయి. వాటి స్థానంలో కొత్తవి సమకూర్చే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. లక్ష్యాలను చేరకపోతే మాత్రం వలంటీర్లను హెచ్చరిస్తోంది. దీంతో వారు అయోమయంలో పడుతున్నారు. గత్యంతరం లేని స్థితిలో కొందరు కొత్తవి కొనుగోలుకు అవసరమైన  రూ.4వేల భారాన్ని ఫించనుదారులపై నెడుతూ తలా రూ.వంద వంతున వసూలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 13,054 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికీ రూ.4వేల విలువ చేసే స్కానర్లను సర్కారు మొదట్లో అందజేసింది. సామాజిక పింఛన్లు, జగనన్న విద్యాదీవెన పంపిణీ సహా ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు లబ్ధిదారునికి అందాలంటే స్కానర్‌పై వేలిముద్ర(బయోమెట్రిక్‌) వేయాల్సిందే. క్షేత్రస్థాయి సమాచారం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసేందుకు కూడా వీటినే వలంటీర్లు వినియోగిస్తున్నారు. గతంలో అందజేసిన డివైస్‌లలో సగానికి పైగా మొరాయిస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో వలంటీర్లు నానాతిప్పలు పడుతూ ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. అనేక చోట్ల మూలకు చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్న వాటిని వలంటీర్లు రోజుకొకరు చొప్పున సర్దుకొని విధులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల పింఛన్ల పంపిణీతో పాటు ఇతర సమాచారం చేరవేతలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కార్యదర్శులు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ‘కొత్త స్కానర్లు కొనుగోలు చేయండి.. బిల్లు పెడితే నిధులు విడుదల చేస్తాం’ అని చెబుతున్నారు. గతంలో చేతులు కాల్చుకున్న అనుభవాల నేపథ్యంలో అధికారులు, కార్యదర్శులు ఆ భారాన్ని తెలివిగా వలంటీర్లపైనే మోపి తప్పించుకుంటున్నారు.

ఫ పింఛన్ల పంపిణీ సమయంలో వలంటీర్లు ఏం చేయాలో అర్థంకాక ఆ భారాన్ని పింఛనుదారులపై నెడుతున్నారు. ‘మిషను పాడైపోయిందని, కొత్తది కొనేవరకు పింఛన్ల బట్వాడా జరగదని’ తేల్చిచెబుతున్నారు. అటు నుంచి వచ్చే స్పందన బట్టి ‘తలా రూ.వంద వంతున ఇస్తే కొత్తది కొని తెస్తామని.. పింఛన్ల చెల్లింపు వెంటనే జరిగిపోతుందని’ చెబుతున్నారు. దీంతో ఫించనుపైనే ఆధారపడి బతుకుతున్న నిరుపేదలు వందేసి చొప్పున వలంటీర్లకు ఇచ్చుకుంటున్నారు. మెంటాడ మండలంలోని ఓ సచివాలయ సెక్రటరీతో ‘ఆంద్రజ్యోతి’ మాట్లాడగా డబ్బులు వసూలు విషయం వాస్తవమేనని తన పేరు బయటకు పొక్కనీయవద్దనీ తెలిపారు. ఇప్పటికే సుమారు 4 నుంచి 5 డివైస్‌లు తన సొంత నిధులతో కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ గురించి రోజూ గొప్పగా ప్రకటించుకునే ప్రభుత్వం కొత్త స్కానర్లు సమకూర్చే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం గమనార్హం. 

బయోమెట్రిక్‌దీ ఇదే దుస్థితి

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల ఒకటి నుంచి బయోమెట్రిక్‌పై హాజరు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలా సచివాలయాల్లో ఆచరించలేదు. బయోమెట్రిక్‌ పరికరాలు లేకపోవడంతో పాటు ఉన్నవి మరమ్మతులకు గురవడమే దీనికి కారణం. బయోమెట్రిక్‌ విధానాన్ని గత ఏడాదే తెచ్చినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడింది. కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా మినహాయింపు ఇచ్చింది. మళ్లీ పునరుద్ధరించినా గాడిన పడలేదు. 

కంపెనీలే మరమ్మతులు చేయాలి

డివైస్‌ల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుంది. అవి పాడైనా.. మొరాయించినా బాగుచేసి సంబంధిత గ్రామాలకు అప్పగించాల్సి ఉంది. మూడు, నాలుగు మండలాల నుంచి వచ్చిన డివైస్‌లను ఒకే చోట బాగుచేయించడానికి అప్పగిస్తాం. ఈ బాధ్యత టెండర్లు పొందిన కంపెనీలపై ఉంది. జిల్లాలో డివైస్‌లు పాడైన విషయం నా దృష్టికి రాలేదు. కొత్తవి కొనుగోలు చేయాలని ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే అది వారి వ్యక్తిగతం.

- టి.వెంకటేశ్వరావు, జడ్పీ సీఈవో

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా

మెంటాడ మండలంలో 70 శాతం డివైస్‌లు పనిచెయ్యటం లేదు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచాను. పనిచెయ్యని వాటిని వెనక్కి పంపించాం. పూర్తి స్థాయిలో తిరిగి రాలేదు. సకాలంలో ప్రభుత్వ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో కొన్నిచోట్ల సర్పంచ్‌లు స్కానర్లు కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల సెక్రటరీలు, వలంటీర్లు బాధ్యత తీసుకుంటున్నారు. 

- భానుమూర్తి, ఎంపీడీవో, మెంటాడ 
Updated Date - 2021-07-09T05:20:58+05:30 IST