ఇంటింటికీ వెళ్లండి!

ABN , First Publish Date - 2021-10-30T04:02:41+05:30 IST

‘మీకు సంక్షేమ పథకాలు, పౌరసేవలు సక్రమంగా అందుతున్నాయా? నవరత్నాల్లో మీకు లబ్ధి చేకూరుతుందా? సమస్యలేమైనా ఉన్నాయా?.. అంటూ సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నారు. నెలలో చివరి శుక్ర, శనివారాల్లో ‘సిటిజన్‌ బెనిఫిషియరీ అవుట్‌ రీచ్‌’ పేరిట ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇంటింటికీ వెళ్లండి!
ఎస్‌.కోట పంచాయతీ సీతంపేటలో ‘సిటిజన్‌ బెనిఫిసరీ అవుట్‌ రీచ్‌’ను పర్యవేక్షిస్తున్న తహసీల్దారు ప్రసాదరావు


సచివాలయ ఉద్యోగులకు పథకాల బాధ్యతలు

నెలలో ఆఖరి శుక్ర, శనివారాల్లో ఇంటింటా ఆరా

మండల అధికారుల పర్యవేక్షణ 

ఆదేశించిన ప్రభుత్వం

(శృంగవరపుకోట)

 ‘మీకు సంక్షేమ పథకాలు, పౌరసేవలు సక్రమంగా అందుతున్నాయా? నవరత్నాల్లో మీకు లబ్ధి చేకూరుతుందా? సమస్యలేమైనా ఉన్నాయా?.. అంటూ సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నారు. నెలలో చివరి శుక్ర, శనివారాల్లో ‘సిటిజన్‌ బెనిఫిషియరీ అవుట్‌ రీచ్‌’ పేరిట ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.  దీనికి సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోంది. ఇప్పటికే శాఖాపరమైన సేవలు, అత్తెసరు జీతంతో సతమతమవుతున్న సచివాలయ ఉద్యోగులకు కొత్తగా ఈ ప్రచార బాధ్యతలు కత్తిమీద సామే. ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. నిధులు లేక చిన్న పాటి సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. మరోవైపు పింఛన్లు, రేషన్‌కార్డులు నిలిచిపోయాయి. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో గృహ నిర్మాణ లబ్ధిదారులకు నోటీసులు అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాల ప్రచారానికి  వెళితే ప్రజల నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురవుతాయని సచివాలయ ఉద్యోగులు భయపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 పెరుగుతున్న పని ఒత్తిడి

సచివాలయ ఉద్యోగులపై రోజురోజుకూ పని ఒత్తిడి పెరుగుతోంది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగంపై భరోసా కలగడం లేదు. రోజుకో జీవోతో అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితులో విధులను కాదని ప్రచార బాధ్యతలు అప్పగించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి ప్రభుత్వంపై అన్నివర్గాల్లో అసంతృప్తి నెలకొంది. నేరుగా ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘సిటిజన్‌ బెనిఫిషియరీ అవుట్‌ రీచ్‌’ కార్యక్రమంలో భాగంగా నెలలో చివరి శుక్ర, శనివారాల్లో పథకాల ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పర్యవేక్షణ బాధ్యతలను మండల స్థాయి అధికారులకు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో శుక్రవారం సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో ఇంటింటికీ కలియతిరిగారు. పథకాలపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తంకాక పోగా.. సమస్యలపై విన్నపాలే అధికంగా కనిపించాయి. పథకాలు నిలిచిపోయాయని ఎక్కువ మంది విన్నవించారు. వారికి  సర్దిచెప్పలేక సచివాలయ ఉద్యోగులు సతమతమయ్యారు. మరోవైపు రహదారులు, పారిశుధ్యం, తాగునీరు వంటి వాటిపై కూడా అధికంగా విన్నపాలు వచ్చాయి. వీటన్నింటి ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి సచివాలయ ఉద్యోగులు వెనుదిరిగారు. 



Updated Date - 2021-10-30T04:02:41+05:30 IST