రామతీర్థంలో తగ్గిన ఆదాయం

ABN , First Publish Date - 2021-05-14T04:48:20+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానం ఆదాయంపై కరోనా ప్రభావం పడింది. దర్శనాల వేళలు మార్పుచేయడంతో భక్తుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా ఆదాయం క్షీణించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఆదాయం పెంపుపై దృష్టి సారించారు.

రామతీర్థంలో తగ్గిన ఆదాయం
రామతీర్థం దేవస్థానం

శిస్తు బకాయిల వసూలుపై అధికారుల దృష్టి

నెల్లిమర్ల, మే 13: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానం ఆదాయంపై కరోనా ప్రభావం పడింది. దర్శనాల వేళలు మార్పుచేయడంతో భక్తుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా ఆదాయం క్షీణించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఆదాయం పెంపుపై దృష్టి సారించారు. ప్రత్యామ్నాయంగా శిస్తు బకాయి వసూలుపై దృష్టి సారించారు. దశాబ్దాల కాలంగా దేవస్థానానికి చెందిన భూములను సాగు చేసుకుంటున్న కౌలు రైతుల నుంచి శిస్తు బకాయిలను ఎలాగైనా వసూలు చేసుకోవాలని ఈవో డీవీవీ ప్రసాదరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దేవస్థానం ఉద్యోగులతో బృందాలను కూడా నియమించారు. శిస్తు బకాయిల మొత్తం 14 లక్షల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దేవస్థానం ఉద్యోగులు భూములున్న అన్ని గ్రామాల్లోనూ పర్యటించి తొలుత రైతులకు నోటీసుల ద్వారా గానీ, మౌఖికంగా గానీ తెలియపరిచాలని,  15 రోజుల వ్యవధిలోనే నగదు వసూలు చేయాలని భావిస్తున్నారు. దేవస్థానం రికార్డుల ప్రకారం నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామంలో 410 ఎకరాలు, తంగుడుబిల్లి గ్రామంలో 266, సీతారామునిపేటలో 60, రామతీర్థంలో 7, పూసపాటిరేగ మండలం కుమిలిలో 10, రణస్థలం మండలం డి.పాలవలసలో 7.6 ఎకరాలు, శృంగవరపు కోట మండలం ఉసిరికలో 4 ఎకరాలు కలిపి మొత్తం 700 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములపై సుమారు 1100 మంది రైతులు శిస్తు చెల్లిస్తూ కౌలు రైతులుగా భూములను సాగుచేస్తున్నారు. వారందరి నుంచి అనుకున్న ప్రకారం బకాయిలు వసూలైతే కొంతలో కొంత ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. 

 బకాయిల వసూలుపై దృష్టి  

దేవస్థానం భూములకు సంబంధించి రైతులు చెల్లించాల్సిన శిస్తు బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం సిబ్బందిని నియమించాం. నేను కూడా సిబ్బందితో  గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నాను. శిస్తు చెల్లింపు విషయంలో రైతులు సహకరించాలని కోరుతున్నాను. శిస్తు చెల్లింపును రైతులు బాధ్యతగా భావించాలి.

- ప్రసాదరావు, ఈవో



Updated Date - 2021-05-14T04:48:20+05:30 IST