నేటి నుంచి రేషన్‌ డీలర్ల బంద్‌

ABN , First Publish Date - 2021-10-26T05:14:05+05:30 IST

రేషన్‌ డీలర్ల రాష్ట్ర యూనియన్‌ పిలుపుమేరకు జిల్లా డీలర్లు మంగళవారం బంద్‌ పాటించేందుకు నిర్ణయించారు. చౌక ధరల దుకాణాలను తెరవకూడదని నిర్ణయించారు.

నేటి నుంచి రేషన్‌ డీలర్ల బంద్‌

 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

రేషన్‌ డీలర్ల రాష్ట్ర యూనియన్‌ పిలుపుమేరకు జిల్లా డీలర్లు మంగళవారం బంద్‌ పాటించేందుకు నిర్ణయించారు. చౌక ధరల దుకాణాలను తెరవకూడదని నిర్ణయించారు. ఎమ్‌ఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద డీలర్లంతా కలిసి ధర్నా చేపట్ట నున్నట్లు ప్రకటించారు. వారిపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ బంద్‌కు సిద్ధమయ్యారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద బియ్యం నిల్వలు పంచిపెడుతున్న వాటికి కమీషన్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం గోనె సంచి ఒక్కంటికి రూ.20 చెల్లిస్తామని ప్రకటించి మోసం చేస్తోందని, ఖాళీ గోనె సంచులను తీసుకుని డబ్బులు ఇవ్వకుండా డీలర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్న సరకులకు సంబంధించిన కమీషన్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గరిబ్‌ కళ్యాణ్‌ యోజన పథకం కింద ఉచిత బియ్యాన్ని డీలర్లు అందిస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం మంగళవారం నిలిచిపోనుంది. డీలర్లు బంద్‌కు పిలుపునివ్వడంతో జిల్లావ్యాప్తంగా 1400 చౌక ధరల దుకాణాలు మూత పడ నున్నాయి. బంద్‌ కొనసాగిస్తే ప్రస్తుతం పంపిణీ జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషను సరకుల పంపిణీకీ ఇబ్బందులు తలెత్తనున్నాయి. 

 

Updated Date - 2021-10-26T05:14:05+05:30 IST