పండగొచ్చెనమ్మా..!
ABN , First Publish Date - 2021-01-13T05:00:26+05:30 IST
పల్లెలు పెద్ద పండగకు ముస్తాబయ్యాయి. ముంగిళ్లలో రంగవల్లులు.. గొబ్బిళ్లు.. రైతుల ఇంట కొత్త పంటలు.. పిల్లల చేతిలో పతంగులు.. యువతుల సంప్రదాయ వస్త్రధారణలు.. కొత్త అల్లుళ్ల సందడులు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. హరిదాసుల ఆశీర్వచనాలు.. కలగలిపి సందడి తెచ్చే సంక్రాంతి వచ్చేసింది.

సంక్రాంతికి సిద్ధమైన పల్లెలు
నేడు భోగి
ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్న యువత
పల్లెలు పెద్ద పండగకు ముస్తాబయ్యాయి. ముంగిళ్లలో రంగవల్లులు.. గొబ్బిళ్లు.. రైతుల ఇంట కొత్త పంటలు.. పిల్లల చేతిలో పతంగులు.. యువతుల సంప్రదాయ వస్త్రధారణలు.. కొత్త అల్లుళ్ల సందడులు.. డూడూ బసవన్నల విన్యాసాలు.. హరిదాసుల ఆశీర్వచనాలు.. కలగలిపి సందడి తెచ్చే సంక్రాంతి వచ్చేసింది. బుధవారం భోగితో పండగ సంబరాలు మొదలుకానున్నాయి. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులంతా పండగకు తిరిగొస్తున్నారు. వీరి రాకతో ఆర్టీసీ బస్సులు మంగళవారం కిటకిటలాడాయి.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ విజయనగరం రూరల్ / రింగురోడ్డు/
శృంగవరపుకోట, జనవరి 12:
తెలుగు లోగిళ్లకు పండక కళ వచ్చేసింది. భోగి, సంక్రాంతి, కనుమ పండగలు జరుపుకునేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఉన్నత చదువులు, ఉపాధి కోసం దూరంగా వెళ్లిన వారంతా ఊళ్లకు చేరుకుంటున్నారు. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో సొంతగూటికి దాదాపుగా చేరుకున్నారు. మూడు రోజుల పండుగలో భాగంగా తొలి రోజు భోగిని జిల్లా ప్రజలు వేడుకగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. కొన్నిచోట్ల యువత మంగళవారం రాత్రంతా మేల్కొనేందుకు డీజే సౌండ్స్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాది కాలంగా ప్రజలంతా పండుగలు...వేడుకలకు దూరమయ్యారు. ఎట్టకేలకు వీరంతా పెద్ద పండుగను కుటుంబాలతో జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. భోగి సందర్భంగా ఆలయాల్లో గోదాదేవి కల్యాణం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తపేట, యాదవ వీధి, ఇప్పిలివీధితో పాటు స్టేడియంపేట, పీఎస్సార్ కాలనీ, దాసన్నపేట తదితర ప్రాంతాల్లో మంగళవారం మహిళలంతా మేలుకొలుపు, దీపారాధన కార్యక్రమాలు చేపట్టారు.
కోలాహలంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లు
ఇతర జిల్లాలు, రాషా్ట్రలకు వలస వెళ్లిన వారంతా స్వగ్రామాలకు రావడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, జంక్షన్లు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. కరోనా తరువాత రైళ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించని కారణంగా అందరూ ఆర్టీసీ సర్వీసులపైనే ప్రయాణిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వేసింది. అదనంగా ఛార్జీల బారం మోపుతోంది. బస్సులు అందుబాటులో లేక అనేక మంది ప్రైవేటు వాహనాలనూ ఆశ్రయిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఆర్టీసీ చార్జీలను పెంచింది. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఆర్‌ఎమ్ అప్పలరాజు వద్ద ప్రస్తావించగా జిల్లా పరిధిలో ఛార్జీలు పెంచే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ వంటి ప్రాంతాలకు వెళుతున్న సర్వీసులలో మాత్రం కాస్తా ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. జిల్లాకు చేరుకుంటున్న వారిలో చెన్నై, బెంగళూరు రాష్టాలకు వెళ్లిన వారు ఎక్కువగా ఉన్నారు. గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు బతుకు తెరువుకోసం వెళ్లినవారూ ఉన్నారు. వీరంతా స్వగ్రామాలకు సంక్రాంతి కోసం తిరిగి వస్తున్నారు.
మార్కెట్ కిటకిట
వారం రోజులుగా విజయనరం మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడుతోంది. వసా్త్రలు, నిత్యావసరాలతో పాటు, ఇతర వస్తువుల కొనుగోళ్లకు అధిక సంఖ్యలో విజయనగరం మార్కెట్‌కు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో మూడులాంతర్లు, గంటస్తంభం, అంబటిసత్తర్వు రోడ్డు, వీటీ అగ్రహారం, కలెక్టరేట్ జంక్షన, ఎస్‌బీఐ జంక్షన, కన్యకాపరమేశ్వరి ఆలయం, చిన్న మార్కెట్, పెద్ద, మార్కెట్, కంటోన్మెంట్‌లోని బాలాజీ వస్త్రమార్కెట్, ఉల్లివీధి తదితర ప్రాంతాలలో కొనుగోలుదారులతో రద్దీ నెలకొంది.
పల్లెల్లోనూ మాల్స్
పట్టణాలు, నగరాలకు దీటుగా పల్లె ప్రాంతాల్లోనూ షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. దుస్తుల నుంచి నిత్యావసరాల వరకు అన్నీ చెంతనే దొరుకుతున్నాయి. నాణ్యతలోనూ పోటీ పడుతున్నాయి. గ్రామీణ ప్రజలు పండగలు, పబ్బాలకు అవసరమైన వివిధ రకాల వస్తువుల కొనుగోలుకు గతంలో పట్టణాల వైపు చూసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. చిన్నచిన్న జంక్షన్‌లలో కూడా షాపింగ్‌మాళ్లు ప్రత్యక్షమవుతున్నాయి. బ్రాండెడ్ సరుకులనూ విక్రయిస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీల తరువాత శృంగవరపుకోట, కొత్తవలస, చీపురుపల్లి, గజపతినగరం వంటి మేజర్ పంచాయితీల్లోనూ మార్కెట్‌లో అనూహ్య మార్పులు వచ్చాయి. నగరాల్లో ఏర్పాటు చేసిసట్లే నిత్యవసర వస్తువులన్నీ ఒకేచోట దొరికేలా మాల్స్, రకరాల బ్రాండెండ్ దుస్తులు, వివిధ రకాల టీ, కాఫీ రుచులు అందించే దుకాణాలు విరివిగా ఏర్పాటు చేస్తున్నారు.