ధరలు పైపైకి..
ABN , First Publish Date - 2021-11-22T04:05:32+05:30 IST
కూరగాయల ధరలు నింగినంటుతున్నాయి. సామాన్యుడు ఏం తినేటట్టు లేవని మార్కెట్ నుంచి ఖాళీ చేతులతో ఇంటిముఖం పడుతున్నాడు. కార్తీకమాసంలో కూరగాయల ధరలు పెరగడం సహజమే కానీ ఈ ఏడాది దారుణంగా పెంచుకుపోతున్నారని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా టమాటా ధర వింటేనే అమ్మో అంటున్నారు.

నింగినంటుతున్న కూరగాయల ధరలు
కార్తీక మాసం ప్రభావంతో ఒకేసారి పెరుగుదల
పంట దిగుబడులూ అంతంతమాత్రమే
కొనుగోలు చేయలేకపోతున్న పేదలు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
కూరగాయల ధరలు నింగినంటుతున్నాయి. సామాన్యుడు ఏం తినేటట్టు లేవని మార్కెట్ నుంచి ఖాళీ చేతులతో ఇంటిముఖం పడుతున్నాడు. కార్తీకమాసంలో కూరగాయల ధరలు పెరగడం సహజమే కానీ ఈ ఏడాది దారుణంగా పెంచుకుపోతున్నారని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా టమాటా ధర వింటేనే అమ్మో అంటున్నారు. కిలో వద్ద రోజుకూ రూ.10లు చొప్పున పెంచేస్తున్నారు. తాజా ధర మార్కెట్‌లో రూ.100కు చేరుకుంది. రైతుబజారులో కూడా కిలో టమాటా రూ.90 వరకు పలుకుతోంది. డిమాండ్ ఉన్నప్పుడే దంచేయాలన్న సూత్రాన్ని వ్యాపారులు అనుసరిస్తున్నారు. కొందరు కృత్రిమ కొరతను సృష్టించి పంట తక్కువగా వస్తోందని చెప్పుకొస్తున్నారు. హోల్‌సేల్ వర్తకులు చాలా మంది రైతుకు కిలో వద్ద రూ.10 ఇచ్చి మార్కెట్‌లో ప్రజల నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు.
కార్తీకమాసంలో ప్రజలు ఎక్కువగా శాఖాహారానికి ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు చాలా వరకు మాంసాహారం జోలికి వెళ్లరు. మరో వైపు శివ, అయ్యప్ప భక్తులు ఎక్కువగా కనిపిస్తారు. దీక్షలు తీసుకున్న కారణంగా వారంతా శాఖాహారమే తీసుకుంటారు. దీంతో కూరగాయలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా వర్తకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. టమాటా ధర మరింత దారుణంగా పెరిగింది. కిలో రూ.100కు పెంచేశారు. పట్టణాలే కాదు పల్లెల్లోనూ ఇదే ధర చెబుతున్నారు. పల్లెల్లో ఉండే చిరు వ్యాపారులు టమాటా అమ్మడం మానేశారు. అంత ధర పెట్టి కొనుగోలు చేశాక అమ్ముడుకాకపోతే నష్టపోవాల్సి వస్తుందని వారు టమాటాను విక్రయించడం లేదు. రైతు బజారులోనూ ధరలు ఽభయపెడుతున్నాయి. కొన్ని కూరగాయల ధరలు బోర్డులకే పరిమితమై ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తున్నారు. దీనికి కారణం రైతు బజారులో అమ్మకాలు చేస్తున్న వారిలో అనేక మంది వర్తకులే. రైతులు తెచ్చిన కూరగాయలను కొనుగోలు చేసి రైతుబజారులో విక్రయిస్తున్నారు. వారు చెప్పిందే ధరగా సాగుతోంది.
తగ్గిన పంట దిగుబడి
ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయాల పంటలు దెబ్బతిన్నాయి. టమాటాతో పాటు చిక్కుడు, బెండ, బీర, కాకర పాదులు పాడయ్యాయి. పొలాల్లోకి వరద నీరు పోటెత్తడంతో ముంపులో ఉండి కుళ్లిపోయాయి. విజయనగరం పట్టణానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. కొన్ని చోట్ల మండల కేంద్రాలతో పాటు సమీప గ్రామాల్లో పండిస్తున్న వాటిని ఆటోల్లో పట్టణాలకు తరలించి అమ్మకాలు నిర్వహిస్తారు. విజయనగరం పట్టణ శివారుల్లో ఉన్న ఫూల్‌బాగ్, వైఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో కూరగాయలు పండుతున్నాయి. ఇదే మండలం కొండకరకాం, కోరుకొండ తదితర ప్రాంతాల నుంచి కూడా కూరగాయలు వస్తున్నాయి. గంట్యాడ మండలం లక్కిడాం, చంద్రంపేట. మెంటాడ మండలం జయతి, పిట్టాడ, జక్కువ, ఆండ్ర ప్రాంతాల్లో విస్తారంగా పండిస్తున్నారు. గజపతినగరం మండలం మధుపాడ, శ్రీరాంపురం, ఎమ్.గుమడాం ప్రాంతాల్లోనూ ఎక్కువగా సాగు చేస్తున్నారు. రామభద్రపురంతో పాటు ఆరికితోట ప్రాంతం కాయగూరల పంటలకు పేరు. అన్నింటా వర్షాలకు నష్టం సంభవించింది. దిగుబడులు అనూహ్యంగా తగ్గాయి. డిమాండ్‌కు తగ్గట్టు దిగుబడులు లేక వినియోగదారులు ఏవీ కొనలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కిలో కొనాల్సిన వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. రైతు బజారుల్లో కొన్ని తక్కువ ధరలు చూపిస్తున్నా బాగా ఇష్టపడే కూరగాయలు లభ్యం కావడం లేదని వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
--------------------------------------------
కూరగాయలు(కిలో) రైతు బజారు మార్కెట్‌లో
-----------------------------------------------
టమాటా 74 100
వంకాయలు 35 60
పొడవు చిక్కుడు 48 60
గోరు చిక్కుడు 30 70
క్యాబేజీ 35 60
క్యాలీఫ్లవర్ --- 30
బెండకాయలు 50 60
బీరకాయలు 52 60
కాకరకాయలు 26 50
క్యారట్ 35 50
బీట్‌రూట్ 23 50
ఉల్లిపాయలు 30 50
=========