పెట్రో మంటలు

ABN , First Publish Date - 2021-02-07T05:09:23+05:30 IST

పెట్రోల్‌, డీజల్‌ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం వీటి ధరలు పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పెరగడం తప్ప తగ్గుదల లేకపోవడంతో వాహనాలను వినియోగించడం కష్టమేనని ఆందోళన చెందుతున్నారు.

పెట్రో మంటలు

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 

గత ఏడాది నవంబర్‌ నుంచి పెరుగుతున్న వైనం

గగ్గోలు పెడుతున్న వినియోగదారులు 

కలెక్టరేట్‌; ఫిబ్రవరి 6: పెట్రోల్‌, డీజల్‌ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం వీటి ధరలు పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పెరగడం తప్ప తగ్గుదల లేకపోవడంతో వాహనాలను వినియోగించడం కష్టమేనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది బ్యాటరీ బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది నవంబరు పది నుంచి ఇప్పటివరకూ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆ నెల 11న పెట్రోల్‌ లీటరు 86 రూపాయల 41 పైసలు ఉండగా, డీజిల్‌ లీటరు రూ.78.59 ఉండేది. అదే నెల 20న పెట్రోల్‌ రూ.86.64, డీజిల్‌ రూ.78.87కు పెరిగింది. అక్కడి నుంచి రోజుకు 20 పైసలు చొప్పున పెరిగింది. డిసెంబరు రెండో తేదీ నాటికి పెట్రోల్‌ లీటరు రూ.87.93కు, డీజిల్‌ రూ.80.94కు చేరింది. ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నాటికి పెట్రోల్‌ రూ.89.43కు, డీజిల్‌ రూ.82.49కు పెరిగింది. ఈనెల 4వ తేదీకి పెట్రోల్‌ రూ.92.08, డీజిల్‌ రూ.85.29కు చేరింది. శనివారం లీటర్‌ పెట్రోల్‌ రూ.92.39కు, డీజిల్‌ రూ.85.61కు విక్రయించారు. ఇలా నిత్యం ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర నిరాశ పడుతున్నారు. చిరుద్యోగులు వీలైనంత వరకు ద్విచక్ర వాహనాల వినియోగం తగ్గించుకోవాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఏజెన్సీల ద్వారా రోజుకు రెండు లక్షల లీటర్ల పెట్రోల్‌, మూడు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. జనవరి నెలలో ఆరువేల కిలోలీటర్ల పెట్రోల్‌, 9,979 కిలోలీటర్ల డీజిల్‌ను వాహనదారులు వినియో గించారు. రోజురోజుకూ ధరలు పెరగడం వల్ల మరికొద్ది రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100కు చేరిపోతుందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే కొనసాగితే పేద, మధ్య తరగతి ప్రజలు వాహనాలను వినియోగించడం కష్టమే. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ధరలు పెరగలేదని వాపోతున్నారు. 


Updated Date - 2021-02-07T05:09:23+05:30 IST