12 గంటల వరకే పైడిమాంబ దర్శనం

ABN , First Publish Date - 2021-05-06T04:39:29+05:30 IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ దర్శన వేళలను కుదించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వనంగుడి, చదురుగుడిలో అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పూర్తిగా కరోనా నిబంధనల నడుమ మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్టు దేవదాయశాఖ అధికారులు నిర్ణయించారు.

12 గంటల వరకే పైడిమాంబ దర్శనం
మధ్యాహ్నం నుంచి మూతడిన పైడిమాంబ ఆలయం


విజయనగరం రూరల్‌/ మక్కువ/ గరుగుబిల్లి/ నెల్లిమర్ల, మే 5: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ దర్శన వేళలను కుదించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఉదయం 6  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వనంగుడి, చదురుగుడిలో అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పూర్తిగా కరోనా నిబంధనల నడుమ మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్టు దేవదాయశాఖ అధికారులు నిర్ణయించారు. మక్కువ మండలంలోని శంబర పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో భక్తులకు ఉదయం 6  నుంచి 11 గంటల వరకే అనుమతిస్తామని ఈవో బీఎల్‌ నగేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో బి.లక్ష్మీనగేష్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ   రెండు దేవాలయాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు స్వామివారి దర్శనం  ఉంటుందన్నారు. అనంతరం స్వామివారి సేవలు, నిత్య పూజలు ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. రామతీర్థం దేవస్థానం బుధవారం వెలవెలబోయింది. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దర్శనాలు అనుమతించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లే సమయం చాలని దృష్ట్యా భక్తుల రాక తగ్గింది. దీంతో దేవస్థానం ప్రాంతం బోసిపోయింది. కేవలం అర్చకులు, ఉద్యోగుల కదలిక మాత్రమే కనిపించింది. 


Updated Date - 2021-05-06T04:39:29+05:30 IST