చెరువు కబ్జా!
ABN , First Publish Date - 2021-05-25T05:19:48+05:30 IST
జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. చెరువు గట్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. భూమి ధరలు నిరంతరం పెరుగుతుండడంతో కబ్జాదారుల కన్ను ప్రధానంగా ప్రభుత్వ స్థలాలపై పడుతోంది. నేతలు, యంత్రాంగాన్ని ప్రసన్నం చేసుకుని తమ పనిని కానిచ్చేస్తున్నారు. కోట్లకు పడగలెత్తుతూ ప్రభుత్వానికి తూట్లు పొడుస్తున్నారు. గజపతినగరంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కొత్తబంద చెరువు ఆక్రమణలకు గురవుతోంది.

గుట్టుగా ప్రైవేటు పరం చేసుకునేందుకు యత్నాలు
ఇప్పటికే గట్టు ఆక్రమణ
చోద్యం చూస్తున్న అధికారులు
గజపతినగరం, మే 24: జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. చెరువు గట్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. భూమి ధరలు నిరంతరం పెరుగుతుండడంతో కబ్జాదారుల కన్ను ప్రధానంగా ప్రభుత్వ స్థలాలపై పడుతోంది. నేతలు, యంత్రాంగాన్ని ప్రసన్నం చేసుకుని తమ పనిని కానిచ్చేస్తున్నారు. కోట్లకు పడగలెత్తుతూ ప్రభుత్వానికి తూట్లు పొడుస్తున్నారు. గజపతినగరంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కొత్తబంద చెరువు ఆక్రమణలకు గురవుతోంది. సర్వే నెంబర్ 202/2లో కొత్తబంద చెరువు 3 ఎకరాల 50సెంట్ల విస్తీర్ణంలో ఉంది. కీలకమైన స్థలంలో చెరువు ఉండడంలో దీనిపై చాలా మంది కన్నేశారు. నాయకుల సహకారంతో ఎంతో కొంత విస్తీర్ణంలో ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. చెరువు గట్టును ఆక్రమించేశారు. ఇందుకు అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. వారికి తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు అక్కడ బలంగా వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్ 202/4లో ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైందని రెవెన్యూ అధికారులు గత ఏడాది డిసెంబర్ 15న బోర్డు ఏర్పాటు చేశారు. ఈ స్థలం ఆక్రమిస్తే శిక్షార్హులని హెచ్చరించారు. గత రెండు రోజులుగా ఇదే స్థలంలో ప్రైవేటు వ్యక్తులు భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఆరు నెలల్లోనే ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఎలా మారిందో అధికారులకే ఎరుక. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల కబంద హస్తాల్లోకి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కొత్తబందచెరువు, దానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిపై సర్వే చేయిస్తాం. ఆక్రమణలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
- ఎం.అరుణకుమారి, తహసీల్దార్, గజపతినగరం