‘నో’ ఇయర్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-31T04:25:53+05:30 IST

‘న్యూ ఇయర్‌ వేడుకలకు మేం దూరంగా ఉంటాం.. ఈ ఏడాది మమ్మల్ని కలిసేందుకు ఎవరూ రావద్దు.. ఒమైక్రాన విస్తరించకుండా జాగ్రత్త పడుదాం’ అంటూ కొందరు నేతలు ప్రకటిస్తున్నారు. ఇది మంచి నిర్ణయమని చాలా మంది హర్షిస్తున్నారు.

‘నో’ ఇయర్‌ వేడుకలు
దాబా నిర్వాహకులకు జాగ్రత్తలు చెబుతున్న పోలీసులు

ఒమైక్రాన్‌పై అప్రమత్తం 

వైద్యుల హెచ్చరికలు

నిబంధనలు పాటించాలని సూచన

గజపతినగరం, డిసెంబరు 30:  ‘న్యూ ఇయర్‌ వేడుకలకు మేం దూరంగా ఉంటాం.. ఈ ఏడాది  మమ్మల్ని కలిసేందుకు ఎవరూ రావద్దు.. ఒమైక్రాన విస్తరించకుండా జాగ్రత్త పడుదాం’ అంటూ కొందరు నేతలు ప్రకటిస్తున్నారు. ఇది మంచి నిర్ణయమని చాలా మంది హర్షిస్తున్నారు. ‘వేడుకలు సరదాగా జరుపుకోండి.. పరిమితికి మించి ఒక్కచోట చేరకండి.. దూరం మరువకండి..’ అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఒమైక్రాన కేసులు మన రాష్ట్రంలోనూ నమోదవుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. పండగల సమయాల్లో వైరస్‌ ఎక్కువగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం పరిపాటి.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే ఉత్సాహం కనిపిస్తుంటుంది. కరోనా  తో పరిస్థితి తారుమారైంది. పండగల స్వరూపం మారిపోయింది. వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్‌ ,రంజాన్‌ పండగలను నిబంధనల ప్రకారమే జరుపుకోవాల్సి వచ్చింది. 2021 జనవరి 1న కూడా కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారమే యువత వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత క్రమేపీ  కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో పెళ్లిళ్లు, పండగలు ముమ్మరంగా జరిగాయి. దీంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పక్కన పెట్టేశారు. మాస్క్‌లు, శానిటైజర్‌ను పూర్తిగా మరిచిపోయారు. భౌతిక దూరాన్ని కూడా పాటించడం లేదు. ఇదిలా ఉండగా మన దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన విస్తరిస్తోంది. ఈ సమయంలో కొత్త సంవత్సర వేడుకలను జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశాయి. దీంతో యువత ఆశలు ఆవిరయ్యాయి. ఒమైక్రాన్‌ వైరస్‌కు అత్యంత వేగంగా వ్యాపించే గుణం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పోలీసులూ ఆంక్షలు విధిస్తున్నారు. పరిధులు దాటకుండా వేడుకలు జరుపుకోవాలని హితవు చెబుతున్నారు. దీంతో ఆ దిశగానే అన్ని వర్గాల వారూ నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 

నిబంధనలు పాటించాల్సిందే

నూతన సంవత్సర వేడుకలకు యువత దూరంగా ఉండాలి. ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాత్రి పదిగంటలు దాటాక యువత రోడ్లపై తిరగరాదు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనాలు సీజ్‌ చేస్తాం.

-డి.రమేష్‌, సీఐ ,గజపతినగరం 



Updated Date - 2021-12-31T04:25:53+05:30 IST