అదే మార్క్‌!

ABN , First Publish Date - 2021-05-22T04:09:07+05:30 IST

మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద చుక్కెదురవుతోంది. అధికారులు మాత్రం జిల్లావ్యాప్తంగా 38 వేల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేస్తాం. మరో 20 వేల టన్నుల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు.

అదే మార్క్‌!
బిత్రపాడులో పురుగు మందు డబ్బాలతో నిరసన తెలుపుతున్న రైతులు




మొక్కజొన్న కొనుగోలులో మార్క్‌ఫెడ్‌ వెనుకబాటు

రైతుల వద్ద నిల్వలు

లక్ష్యం పూర్తయ్యిందని చెబుతున్న కొనుగోలు కేంద్రాల సిబ్బంది

ఆందోళనలో అన్నదాతలు

(జియ్యమ్మవలస)

 మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద చుక్కెదురవుతోంది. అధికారులు మాత్రం జిల్లావ్యాప్తంగా 38 వేల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేస్తాం. మరో 20 వేల టన్నుల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కనీస స్థాయిలో కూడా కొనుగోలు చేయని పరిస్థితి. ఒక్క బిత్రపాడులో 120 మంది రైతుల వద్ద వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న నిల్వలు ఉన్నాయి. చినమేరంగిలో పీఏసీఎస్‌లో విక్రయించేందుకు వెళ్లగా అక్కడున్న సిబ్బంది కొనుగోలు లక్ష్యం పూర్తయ్యిందని చెప్పారు. దీంతో రైతులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. గత ఏడాది రబీలో భాగంగా జిల్లాలో 23,450 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1.76 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాదిని పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది పంట కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  ఈక్రాప్‌, రిజిస్ట్రేషన్లు సక్రమంగానే పూర్తి చేశారు. కానీ కొనుగోలు విషయానికి వచ్చేసరికి ఆశించిన పురోగతి లేదు.మార్క్‌ఫెడ్‌ ద్వారా 30 శాతం మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన 38,400 టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకూ 30 వేల టన్నులు కొనుగోలు చేశామని...మరో 8,400 టన్నులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా రైతుల వద్ద మొక్కజొన్న నిల్వలు ఉండిపోయాయి. అందుకే లక్ష్యాన్ని మరింతగా పెంచి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


రైతుల నిరసన

చినమేరంగి సొసైటీలో అధికారుల తీరుపై బిత్రపాడు రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. మొక్కజొన్న పట్టుకొని సొసైటీకి వెళ్తే లక్ష్యం పూర్తయ్యిందని..కొనుగోలు చేయలేమని అక్కడి అధికారులు, సిబ్బంది తేల్చిచెప్పడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో 120 మంది రైతుల వద్ద వందలాది టన్నుల నిల్వలు పేరుకుపోవడంతో ఏంచేయాలో వారికి పాలుపోవడం లేదు. వ్యయప్రయాసలతో పంట సాగుచేశామని..ఇప్పుడు మాకు చావే శరణ్యమంటూ రైతులు పురుగు మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలిపారు. చినమేరంగి సొసైటీలో దళారుల హవా నడుస్తోందని ఆరోపించారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి పంట కొనుగోలుకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై మార్క్‌ఫెడ్‌ ఇన్‌చార్జి ఏడీ శ్యామ్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు చేస్తామన్నారు. ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బిత్రపాడు రైతుల వద్ద నుంచి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. 


251 ఆర్బీకేలలో కొనుగోలు

  జిల్లావ్యాప్తంగా 251 రైతుభరోసా కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయనున్నట్టు జేసీ కిషోర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.1,850 మేరకు కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. జిల్లాలో 38 వేల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మరో 20 వేలు టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు జేసీ పేర్కొన్నారు. 





Updated Date - 2021-05-22T04:09:07+05:30 IST