ఆ పింఛన్లపై ఆరా

ABN , First Publish Date - 2021-06-14T05:02:11+05:30 IST

దీర్ఘకాలిక రోగులకు అందించే పింఛన్ల మంజూరులో అక్రమాలు జరిగాయి. అనర్హులను ఎంపిక చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా వైద్యశాఖలోని కొందరి నిర్లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ ఎండగడుతున్నారు. ఎటువంటి రోగాలు లేని వారు సీతానగరం.. వేపాడ మండలాల్లో పింఛన్లు అందుకుంటున్న వైనాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది.

ఆ పింఛన్లపై ఆరా

మంజూరుపై వైద్య శాఖలో లోతుగా దర్యాప్తు

పక్కదారి పట్టిన ఐడీ.. పాస్‌ వర్డ్‌ 

కొంప ముంచిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు

చర్చనీయాంశంగా దీర్ఘకాలిక రోగుల పింఛన్ల వ్యవహారం

దీర్ఘకాలిక రోగులకు అందించే పింఛన్ల మంజూరులో అక్రమాలు జరిగాయి. అనర్హులను ఎంపిక చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా వైద్యశాఖలోని కొందరి నిర్లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ ఎండగడుతున్నారు. ఎటువంటి రోగాలు లేని వారు సీతానగరం.. వేపాడ మండలాల్లో పింఛన్లు అందుకుంటున్న వైనాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. జిల్లా వైద్యాధికారి ఐడీ, పాస్‌వర్డ్‌ను కొందరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పక్కదారి పట్టించారన్న విమర్శ బహిరంగంగా వినిపిస్తోంది. దీనిపై విచారిస్తున్న అధికారులు ఒకటి రెండు రోజుల్లో  ఆ వివరాలను బహిర్గతం చేయనున్నారు. 

(విజయనగరం- ఆంధ్రజ్యోతి/ రింగురోడ్డు)

అనర్హులు దీర్ఘకాలిక రోగం కింద పింఛన్లు పొందుతున్నట్లు బహిర్గతం అయిన దగ్గర నుంచి వైద్యశాఖ అధికారుల్లో ఈ అంశం నలుగుతోంది. సిబ్బందిలోనూ చర్చ సాగుతోంది. దర్యాప్తునకు ఆదేశించినా మొక్కుబడిగా ఆరా తీస్తున్నారు తప్ప పకడ్బందీగా సాగలేదు. ఇదే విషయాన్ని జిల్లా మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణలు ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. దర్యాప్తులో నిర్లిప్తతను ఎత్తిచూపారు. డీఎంఅండ్‌హెచ్‌ఓను ప్రశ్నించారు. అనంతరం విచారణ ఊపందుకుంది. జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనర్హులు 120 మంది వరకు పింఛన్లు పొందుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. పూర్తి స్థాయి దర్యాప్తు తేలాక ఎంత మంది అనర్హులన్నది వెలుగులోకి రానుంది. కాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలు సర్వ సాధారణమయ్యాయి. గతంలో కూడా కొన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంతో వైద్య శాఖ పరువు రాష్ట్ర వ్యాప్తంగా చర్యనీయాంశమైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులుగా పనిచేసిన కొంత మంది నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు చెడ్డ పేరొస్తోంది. 

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం గతేడాది పెద్ద ఎత్తున వైద్య శాఖలో తాత్కాలిక సిబ్బందిని భర్తీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో నర్సు పోస్టు కోసం ఒకామె దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ధ్రువీకరించిన సర్వీస్‌ సర్టిఫికెట్‌ నకిలీదని అధికారులు తేల్చారు. దర్యాప్తునకు ఆదేశించారు. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. ఆ ధ్రువీకరణ పత్రం విజయనగరం జిల్లా నుంచి విడుదలైనట్లు రుజువు కావడంతో జిల్లా వైద్యశాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ హయాంలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు విడుదలైనట్లు గుర్తించారు.

నేషల్‌నల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ద్వారా విడుదలవుతున్న నిధుల్లో అక్రమాల అంశం కూడా గతంలో వెలుగు చూసింది. దీనిపై అప్పట్లో దర్యాప్తునకు ఆదేశించడంతో జిల్లా నుంచి బదిలీపై వెళ్లిపోయిన ఓ డీఎంఅండ్‌హెచ్‌ఓ దర్యాప్తు నేపథ్యంలో తిరిగి రావాల్సి వచ్చింది. 

ఇటీవల వెలుగుచూసిన దీర్ఘకాలిక రోగుల పింఛన్ల దర్యాప్తు వ్యవహారం కూడా పక్కతోవ పట్టించారు. గతేడాది కరోనా సమయంలో డీఎంఅండ్‌హెచ్‌ఓగా పనిచేసిన రమణకుమారి కరోనా బారిన పడడంతో ఆ ఏడాది జూన్‌ ప్రాంతంలో సెలవు పెట్టారు. ఆ సమయంలో దీర్ఘకాలిక రోగుల కింద పింఛన్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దీర్ఘకాలిక రోగులుగా గుర్తించి ధ్రువీకరించేందుకు జిల్లా అధికారికి మాత్రమే అవకాశం ఉంది. డీఎంఅండ్‌హెచ్‌వో నిర్ధారణ చేశాకే మండల స్థాయిలో ఎంపీడీఓలు పింఛను మంజూరు చేస్తారు. అప్పట్లో ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓగా వ్యవహరించిన ఓ వ్యక్తి తన ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు ఇచ్చారు. ఆ డాక్టర్లు ఆయా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్లకు సైతం పాస్‌వర్డ్‌లను వెళ్లడించారు. దీంతో వివిధ స్థాయిలో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. రాజకీయ నాయకులు, సిబ్బంది తమకు కావాల్సి వారికి జిల్లాలో 120 మందికి పైగా అక్రమంగా పింఛన్లకు ఎంపిక చేశారు. ఇందులో ఎవరిది తప్పు అన్నది గుర్తించేందుకు వైద్య శాఖ తలలు పట్టుకుంటోంది. రోగం ఆధారంగా రూ.3వేలు, రూ.5వేలు, రూ.10వేల స్థాయిల్లో పింఛన్లు ఇస్తున్న కారణంగా సునాయాసంగా కొంతమంది అక్రమార్కులు నచ్చిన వారికి పింఛన్లు మంజూరయ్యేలా వ్యవహరించారు. ఇదే విషయాన్ని డీఎంఅండ్‌హెచ్‌ఓ రమణకుమారి వద్ద ప్రస్తావించగా దర్యాప్తు పూర్తి కావొచ్చిందని, నివేదికను కలెక్టర్‌, జేసీలకు అందజేస్తామన్నారు. 

-------------


Updated Date - 2021-06-14T05:02:11+05:30 IST