సాలూరులో వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-10-21T04:47:20+05:30 IST
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ సాలూరులో ఆ పార్టీ శ్రేణులు బంద్ పాటించాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు బుధవారం తెల్లవారుజామునే పట్టణంలో ఉన్న ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.

సాలూరు, అక్టోబరు 20: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ సాలూరులో ఆ పార్టీ శ్రేణులు బంద్ పాటించాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు బుధవారం తెల్లవారుజామునే పట్టణంలో ఉన్న ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం 26వ నంబర్ జాతీయ రహదారిపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత పట్టణంలో ర్యాలీ చేపట్టారు. డీలక్స్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు టీడీపీ శ్రేణుల్లో కొంతమందిని అరెస్టు చేశారు. దీంతో సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 26వ జాతీయ రహదారిపై పడుకుని నిరసన తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమ పార్టీ నాయకులను అరెస్టు చేయటమేంటని పోలీసులను ప్రశ్నించారు. వారిని విడుదల చేస్తే కానీ తాను అక్కడి నుంచి లేచేది లేదని చెప్పడంతో సీఐ అప్పలనాయుడుతో పాటు ఎస్సై ఫకృద్దీనలు టీడీపీ నాయకులను విడుదల చేశారు. అక్కడి నుంచి టీడీపీ శ్రేణులంతా సంధ్యారాణి ఇంటికి చేరుకున్నారు. అనంతరం విలేకరులతో సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాతి తిరుపతిరావు, పిన్నింటి ప్రసాద్‌బాబు, ముఖీ సూర్యనారాయణ, చోడవరపు గోవిందరావు, శ్యాం తదితరులు పాల్గొన్నారు.