కొండలు కరుగుతున్నాయ్‌

ABN , First Publish Date - 2021-12-26T05:28:41+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అక్రమారుల చెరలో చిక్కి... కొండలు తరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ అధికారులు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా తగ్గడం లేదు. వాటిని తొలగించి... తిరిగి అక్రమంగా తవ్వుకుపోతున్నారు. విజయ నగరం జిల్లా కేంద్రం కార్పొరేషన్‌గా మారిన తరువాత నగరం మరింత వేగంగా విస్తరిస్తోంది. అపార్ట్‌మెంట్లు, భవనాలు, రోడ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో భారీగా గ్రావెల్‌ అవసరం ఉంటుంది. దీంతో జిల్లా కేంద్రానికి సమీపంలోని కొండకరకాం కొండ నుంచి

కొండలు కరుగుతున్నాయ్‌
విజయనగరం సమీపంలో కొండకరకాం వద్ద కొండపై అనధికార తవ్వకాలు

ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న అక్రమార్కులు

హెచ్చరిక బోర్డులు ఉన్నా ఆగని వైనం

పటిష్ట చర్యలు తీసుకోని అధికారులు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

నిన్న మొన్నటి వరకూ హిమాలయాలను తలపించే కొండలవి. ఇప్పుడు మంచు కంటే వేగంగా కరిగిపోతున్నాయి. కాదు కాదు... అక్రమార్కులు కరిగించేస్తున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా... గుట్టుచప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. రాత్రికి రాత్రే కథ నడిపించేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే రూపురేఖలను మార్చేస్తున్నారు. ఇదీ జిల్లాలో గ్రావెల్‌ మాఫియా మాయ.

జిల్లా వ్యాప్తంగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అక్రమారుల చెరలో చిక్కి... కొండలు తరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ అధికారులు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా తగ్గడం లేదు. వాటిని తొలగించి... తిరిగి అక్రమంగా తవ్వుకుపోతున్నారు. విజయ నగరం జిల్లా కేంద్రం కార్పొరేషన్‌గా మారిన తరువాత నగరం మరింత వేగంగా విస్తరిస్తోంది. అపార్ట్‌మెంట్లు, భవనాలు, రోడ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో భారీగా గ్రావెల్‌ అవసరం ఉంటుంది. దీంతో జిల్లా కేంద్రానికి సమీపంలోని కొండకరకాం కొండ నుంచి పెద్ద ఎత్తున గ్రావెల్‌ను యంత్రాలతో తవ్వితీసి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. సాయంత్రం 5 గంటల తరువాత తవ్వకాలను ముమ్మరం చేస్తున్నారు. తెల్లవారేసరికి పూర్తి చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ దృష్టికి కొండకరకాం కొండ తవ్వకాల సమాచారం చేరింది. దీంతో రెవెన్యూ అధికారులు వెళ్లి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ వాటిని కూడా తవ్వకందారులు తొలగించేశారు. 

- నెల్లిమర్ల పరిసర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి ప్రతిరోజూ అనధికార గ్రావెల్‌ వస్తోంది. 

- గంట్యాడ మండలంలో చెరువుల్లో సైతం గ్రావెల్‌ లభ్యం కావడంతో చెరువు గర్భాలను తవ్వేసి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ల అభివృద్ధి పనులకు తరలిస్తున్నారు.

- డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో భారీగా వెంచర్లు ఉండడంతో రోడ్లు వేసేందుకు గ్రావెల్‌ను వాడుతున్నారు. దీని కోసం ఈ పరిసర ప్రాంతాల్లో కొండలపై పడుతున్నారు. 

- భోగాపురం మండలం తడ వద్ద ఇదే తరహాలో అనధికార తవ్వకాలు సాగుతున్నాయి. ఇది భోగాపురం- విశాఖ జిల్లా భీమిలికి సరిహద్దులో ఉండడంతో రెండు వైపులా గ్రావెల్‌ను తరలించుకు పోతున్నారు.

- పూసపాటిరేగ మండలం తొత్తడాం వద్ద అనధికార క్వారీ సాగుతోంది. రెవెన్యూ, పోలీస్‌ శాఖల కళ్లు గప్పి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు చూసీచూడనట్లు పోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతోంది. 

- బొండపల్లి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల నుంచి వివిధ నిర్మాణాలకు, రోడ్లు వేసేందుకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కొండలు విస్తారంగా ఉండడంతో గ్రావెల్‌ తవ్వకాలు సాగుతున్నాయి. 

- కొత్తవలస సమీపంలో తవ్వకాలకు అనుమతులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచే కాకుండా పనులు జరుగుతున్న చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రావెల్‌ను తోడుతున్నారు. 

- పార్వతీపురం చుట్టుపక్కల ఉన్న అడ్డాపుశిల, గొట్టివలస, పెద్దూరు ప్రాంతాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. 

- కొమరాడ మండలం మార్కొండపుట్టి సమీప ప్రాంతాల నుంచి కూడా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం దృష్టి పెడితే ఆదాయ వనరుగా మారుతుంది. చెత్త సేకరణ కోసం పన్నులు వేయకుండా ఇటువంటి ఆదాయ వనరులను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని సీనియర్‌ సిటిజన్లు సూచిస్తున్నారు. 




Updated Date - 2021-12-26T05:28:41+05:30 IST