రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతాం
ABN , First Publish Date - 2021-01-13T05:19:04+05:30 IST
తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతామని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖరంలోని కొదమ గ్రామ గిరిజనులు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వద్ద తెగేసి చెప్పారు. కొదమ నుంచి గిరిజనులు మంగళవారం ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చారు.

ఎమ్మెల్యే రాజన్నదొరతో గిరిజనుల స్పష్టీకరణ
సాలూరు(విజయనగరం): తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతామని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖరంలోని కొదమ గ్రామ గిరిజనులు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వద్ద తెగేసి చెప్పారు. కొదమ నుంచి గిరిజనులు మంగళవారం ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 9న తమ పంచాయతీకి వచ్చినప్పుడు 70 రోజుల్లో పట్టుచెన్నారు- చింతచెట్టు జంక్షన్ నుంచి కొదమకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మూడు నెలలు దాటినా ఇంకా రోడ్డు పనులు ప్రారంభం కాలేదని... ఎప్పుడు నిర్మిస్తారన్నారని ప్రశ్నించారు. తమ గ్రామం పక్కన ఉన్న ఒడిశా గ్రామాలకు ఆ ప్రభుత్వం రోడ్లు వేసిందని తెలిపారు.
రోడ్డు వేయకుంటే తాము కూడా ఒడిశాలో కలిసిపోతామన్నారు. వారితో ఎమ్మెల్యే రాజన్నదొర చర్చలు జరిపారు. రోడ్డు పని ప్రారంభానికి అటవీశాఖ అనుమతి రాలేదని, త్వరలోనే అనుమతి తీసుకుంటామని చెప్పారు. రోడ్డు నిర్మించి.. కొదమకు వస్తానని చెప్పారు. అప్పటికీ శాంతించని వారు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఆయన ఇంటి వద్ద కాసేపు బైఠాయించారు. వారికి ఆయన మరోసారి సర్దిచెప్పడంతో శాంతించారు. కార్యక్రమంలో చోడిపల్లి మాలతీదొర, చంద్రయ్య, భీమ, వరుణ్, వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.