ఇల్లు ఎలా?

ABN , First Publish Date - 2021-11-01T04:17:48+05:30 IST

సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం సామాన్యుడికి భారంగా మారింది. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ముడిసరుకు ధరలు నింగినంటుతున్నాయి. సిమెంట్‌ ధరలు మరింతగా బెంబేలెత్తిస్తున్నాయి. సొంత స్థలం ఉండి గూడు కట్టుకుందామన్నా అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

ఇల్లు ఎలా?
సాగని ఇంటి నిర్మాణం

పైపైకి సిమెంట్‌ ధరలు

అదే బాటలో ఐరన్‌

ఎక్కడికక్కడ నిలిచిపోతున్న నిర్మాణాలు

(పార్వతీపురం)

సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం సామాన్యుడికి భారంగా మారింది. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ముడిసరుకు ధరలు నింగినంటుతున్నాయి. సిమెంట్‌ ధరలు మరింతగా బెంబేలెత్తిస్తున్నాయి. సొంత స్థలం ఉండి గూడు కట్టుకుందామన్నా అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. సిమెంట్‌ బస్తా ధర ఒక్కసారిగా రూ.50 నుంచి 60కు పెరిగింది. ఏ కంపెనీ ధర చూసినా సెప్టెంబరు నెలతో సరిచూసుకుంటే కనీసం రూ.50 పెరిగింది. బస్తా ధర రూ. 380 నుంచి రూ. 450 వరకు పలుకుతోంది. అదే బాటలో ఐరన్‌ ధర కూడా రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోంది. టన్ను ఇనుము ఒక్కసారిగా రూ.1000 నుంచి రూ.1200 పెరిగింది. గతంలో రూ.4,800ల నుంచి రూ. 5 వేల మధ్య టన్ను ఇనుము ధర ఉండేది. ప్రస్తుతం రూ.5,800 నుంచి రూ.6 వేల వరకు పలుకుతోంది. ఒకేసారి రూ.1200 పెరగడంతో భవన నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిని ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే నిత్యావసర సరుకుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల వరకు పరుగులు పెడుతుండడంతో పేదలు విలవిల్లాడుతున్నారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇళ్ల నిర్మాణం ఓ సాహసమే. కానీ నీడ కోసం తప్పని పరిస్థితిలో కష్టమైనా పనులు ప్రారంభించారు. ముడి సరుకుల ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. సిమెంట్‌, ఇనుము ధరలను నియంత్రించడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పేదల ఇళ్ల నిర్మాణంపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే సిమెంట్‌, ఐరన్‌కు అదనంగా కొనుగోలు చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. Updated Date - 2021-11-01T04:17:48+05:30 IST