ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ABN , First Publish Date - 2021-07-25T05:08:45+05:30 IST

అధికారులు, ఉద్యోగులంతా ఒక్కసారి బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆటలో దిగింది మొదలు మ్యాచ్‌ చివరి వరకు ఒకటే ఉత్సాహం.. కేరింతలతో గడిపారు. క్రీడాకారుల మాదిరి మాటలు.. పిలుపులతో దూసుకెళ్లారు. ఫోర్‌.. సిక్స్‌.. మేడిన్‌ ఓవర్‌.. రన్‌ అవుట్‌.. గుడ్‌ ఫీల్డింగ్‌ అంటూ అభినందించుకున్నారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా
పరుగులు తీస్తున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

రెవెన్యూ క్రీడలు ప్రారంభం

 నేడు ఫైనల్స్‌

(విజయనగరం- ఆంధ్రజ్యోతి) 

అధికారులు, ఉద్యోగులంతా ఒక్కసారి బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.  ఆటలో దిగింది మొదలు మ్యాచ్‌ చివరి వరకు ఒకటే ఉత్సాహం.. కేరింతలతో గడిపారు. క్రీడాకారుల మాదిరి మాటలు.. పిలుపులతో దూసుకెళ్లారు. ఫోర్‌.. సిక్స్‌.. మేడిన్‌ ఓవర్‌.. రన్‌ అవుట్‌.. గుడ్‌ ఫీల్డింగ్‌ అంటూ అభినందించుకున్నారు. క్రీడా స్ఫూర్తిని చాటారు. విజ్జీ స్టేడియం క్రికెట్‌ మైదానంలో శనివారం ఈ దృశ్యాలు కనిపించాయి. తొలుత రూ.35 లక్షల వ్యయంతో ఆధునికీకరించిన విజ్జీ స్టేడియం క్రికెట్‌ మైదానాన్ని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. అనంతరం రెవెన్యూ అధికారుల క్రీడలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రెవెన్యూ సిబ్బంది జట్ల మధ్య హోరాహోరీ పోటీ సాగింది. ఉదయం మధ్యాహ్నం మూడు జట్లు పాల్గొన్నాయి. రెండు జట్ల మధ్య ఫైనల్స్‌ ఆదివారం జరుగనుంది. కలెక్టర్‌, జేసీలు, పీవో, ఆర్డీవో తదితర ఉన్నతాధికారులు క్రికెట్‌లో అనుభవం ఉన్న వారి మాదిరి పోటాపోటీగా ఆడారు. ఉదయం కలెక్టరేట్‌, విజయనగరం జట్లు తలపడ్డాయి. ఎమ్మెల్యే టాస్‌ వేయగా విజయనగరం డివిజన్‌ జట్టు కెప్టెన్‌ ఆర్డీవో భవనీశంకర్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. కలెక్టరేట్‌ జట్టుకు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కెప్టెన్‌గా వ్యవహరించి బ్యాటింగ్‌కు దిగారు.  ఈ జట్టు సభ్యులు 15 ఓవర్లలో 74 పరుగులు చేశారు. తరువాత బ్యాటింగ్‌ ప్రారంభించిన విజయనగరం డివిజన్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 74 పరుగులను అధిగమించడంతో ఫైనల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌ జట్టు, పార్వతీపురం డివిజన్‌ జట్టు (కెప్టెన్‌ ఐటీడీఏ పీఓ కూర్మనాథ్‌) మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో కలెక్టరేట్‌ జట్టు 15 ఓవర్లలో 117 పరుగులు చేశారు. పార్వతీపురం డివిజన్‌ జట్టు బ్యాటింగ్‌ ప్రారంభించి నిర్ణీత ఓవర్లలో 97 పరుగులు మాత్రమే చేయగలి గింది. ఆదివారం కలెక్టరేట్‌ జట్టుకు, విజయనగరం డివిజన్‌ జట్టుకు ఫైనల్స్‌ జరగనున్నాయి. జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు, క్రికెట్‌ అసోషియేషన్‌ కార్యదర్శి ఎమ్‌ఎల్‌ఎన్‌ రాజు, రెవెన్యూ అసోషియేషన్‌ నాయకులు గొట్టాపు శ్రీరామ్మూర్తి తదితరులు హాజరయ్యారు.


Updated Date - 2021-07-25T05:08:45+05:30 IST