గుండెకోత

ABN , First Publish Date - 2021-09-03T04:53:00+05:30 IST

చిన్నారుల అల్లరితో ఆ ఇల్లంతా సందడిగా ఉండేది. వారి ముద్దు మాటలతో అంతా మురిసిపోయేవారు. ఆ సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో. అంతు తెలియని వ్యాధి దాడి చేసింది. చివరకు మృత్యువు పాలు చేసింది. వివరాలివీ...చింతలవలస గ్రామానికి చెందిన కలిశెట్టి సూర్యనారాయణ ఇప్పలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.

గుండెకోత
ఆర్యన్‌, ఉదయ్‌(ఫైల్‌)

ముంచుకొచ్చిన మాయరోగం

 వారం వ్యవధిలో అన్నదమ్ముల మృతి

 మెంటాడ, సెప్టెంబరు 2: చిన్నారుల అల్లరితో ఆ ఇల్లంతా సందడిగా ఉండేది. వారి ముద్దు మాటలతో అంతా మురిసిపోయేవారు. ఆ సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో. అంతు తెలియని వ్యాధి దాడి చేసింది. చివరకు మృత్యువు పాలు చేసింది. వివరాలివీ...చింతలవలస గ్రామానికి చెందిన కలిశెట్టి సూర్యనారాయణ ఇప్పలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఆర్యన్‌ (14), ఉదయ్‌ (11). ఇద్దరూ ఐదేళ్ల వయసు వరకు తోటి పిల్లలతో ఆడతూ, పాడుతూ సరదాగా ఉండేవారు. పెద్దబ్బాయి ఆర్యన్‌కు ఐదేళ్లు వచ్చేసరికి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. మాట పడిపోయింది. గొంతు మూగబోయింది. చూపు మందగించింది. అప్పటి నుంచి వైద్యం కోసం ఆసుపత్రులకు తిప్పుతుండగా...చిన్న కుమారుడు ఉదయ్‌కూ ఐదేళ్లు వచ్చేసరికి అవే లక్షణాలు బయట పడ్డాయి. ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారిని వైద్యం కోసం ఆసుపత్రులకు తిప్పుతూనే ఉన్నారు. ఏపీ, తెలంగాణలోని ఆసుపత్రులన్నింటా చూపించారు. కొందరు సీనియర్‌ వైద్యుల సలహా మేరకు కేరళ రాష్ట్రంలో కూడా కొన్నేళ్లుగా వైద్యం అందిస్తూ వచ్చారు. జన్యుపరమైన లోపమని వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వారం కిందట పెద్ద కుమారుడు ఆర్యన్‌ మృతిచెందాడు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే రెండో కుమారుడు ఉదయ్‌ గురువారం కన్నుమూశాడు. తండ్రి కలిశెట్టి సూర్యనారాయణ ఇప్పలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ఉన్న ఇద్దరు కొడుకులూ మృతి చెందడాన్ని జీర్ణించుకోలేపోతున్నారు.Updated Date - 2021-09-03T04:53:00+05:30 IST