గోదాముల్లో ధాన్యం

ABN , First Publish Date - 2021-12-31T04:26:58+05:30 IST

రైతు భరోసా కేంద్రాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసే ధాన్యాన్ని మిల్లర్లు తీసుకెళ్లే వరకు ఏఎంసీ గోదాముల్లో నిల్వ ఉంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాములను దీనికి సిద్ధం చేశారు.

గోదాముల్లో ధాన్యం

మిల్లర్లు తీసుకెళ్లే వరకు ఉంచేందుకు సన్నాహాలు 

జిల్లాలో ఎనిమిది ఏఎంసీ గొడౌన్ల అప్పగింత

బొబ్బిలి రూరల్‌, డిసెంబరు 30: రైతు భరోసా కేంద్రాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసే ధాన్యాన్ని మిల్లర్లు తీసుకెళ్లే వరకు ఏఎంసీ గోదాముల్లో నిల్వ ఉంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాములను దీనికి సిద్ధం చేశారు. వీటి నిల్వ సామర్థ్యం 8,230 మెట్రిక్‌ టన్నులుగా నిర్ధారించారు.  పార్వతీపురం ఏఎంసీ పరిధిలో 1800 టన్నుల సామర్థ్యం కలిగిన మూడు గోదాములను, బొబ్బిలి ఏఎంసీ పరిధిలోని డొంకినవలసలో 600 టన్నుల సామర్థ్యం కలిగిన ఒక గోదాము, సాలూరులో రెండు (3500 టన్నులు), గజపతినగరంలో ఒకటి (2000 టన్నులు), చీపురుపల్లిలో ఒకటి (300 టన్నులు) చొప్పున  కలెక్టర్‌ ఆదేశాల పౌరసరఫరాల సంస్ధకు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ అధికారులు అప్పగించారు.  బొబ్బిలి ఏఎంసీలో మొత్తం ఏడు గోదాములు ఉండగా.. రెండు ఖాళీగా ఉన్నాయని, ఒకటి మరమ్మతులకు గురికావడంతో డొంకినవలస గోదామును అప్పగించినట్లు స్థానిక ఏఎంసీ కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. బొబ్బిలి మండలంలోని జగన్నాథపురం, పాతబొబ్బిలి, దిబ్బగుడ్డివలస, పారాది, మెట్టవలస రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తాము సేకరిస్తామన్నారు. బాడంగి, చింతాడలో 600 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలిచారని తెలిపారు. పీఏసీఎస్‌ పరిధిలోని ఖాళీ స్థలాల్లో వీటిని నిర్మిస్తారని, ఈ బాధ్యతలను మార్కెటింగ్‌ శాఖకు అప్పగించారని చెప్పారు. ఈ ఏడాది బొబ్బిలి ఏఎంసీలో మార్కెట్‌ ఫీజు కింద రూ.2.14 కోట్లు లక్ష్యం కాగా ఇంతవరకు రూ.80 లక్షలు వసూలైందన్నారు. గత ఏడాది ధాన్యం కొనుగోళ్లపై రెండు కోట్ల రూపాయల మార్కెట్‌ ఫీజు సివిల్‌ సప్లయిస్‌ నుంచి రావాల్సి ఉందని వాసుదేవరావు తెలిపారు.


Updated Date - 2021-12-31T04:26:58+05:30 IST