భీమసింగికి రూ.15 కోట్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-10-30T04:04:28+05:30 IST

‘భీమసింగి చక్కెర కర్మాగారానికి ప్రభుత్వం రూ.15 కోట్లు ఇస్తే ఎంతోమందికి మేలు కలుగుతుంది. రైతులు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళదాం. చక్కెర కర్మాగారాన్ని తెరవాలని కోరుదామ’ని సీబీఐ పూర్వ జేడీ వి.లక్ష్మీనారాయణ అన్నారు.

భీమసింగికి రూ.15 కోట్లు ఇవ్వండి
నిరసనకు సంఘీభావం తెలుపుతున్న జేడీ లక్ష్మీనారాయణ




సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ 

శృంగవరపుకోట రూరల్‌ (జామి), అక్టోబర్‌ 29 : ‘భీమసింగి చక్కెర కర్మాగారానికి ప్రభుత్వం రూ.15 కోట్లు ఇస్తే ఎంతోమందికి మేలు కలుగుతుంది. రైతులు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళదాం. చక్కెర కర్మాగారాన్ని తెరవాలని కోరుదామ’ని సీబీఐ పూర్వ జేడీ వి.లక్ష్మీనారాయణ అన్నారు. భీమసింగి చక్కెర కర్మాగారం తెరిపించాలని అఖిలపక్షం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ‘రైతు మహాజనసభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. కర్మాగారంలో పనిచేసే వందలాది మంది ఉద్యోగులకు 16 నెలలుగా జీతాలు లేవని...ఇదేమని ప్రశ్నిస్తే ఒక్కనెలకు ఇచ్చి సరిపెట్టడం దారుణమన్నారు. వారి ఆకలి కేకలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. పదవీ విరమణ చేసిన వారికి సంబంధిత ప్రయోజనాలు కల్పించడంలో తాత్సారం చేయడం దారుణమన్నారు. మన రాష్ట్రంలోని 29 పరిశ్రమలకు గాను కేవలం నాలుగింటినే నడిపించడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. ఎంతో చరిత్రగల భీమసింగి ఆధునికీకరణకు రూ,15కోట్లు ఇస్తే పూర్వవైభవం సంతరించుకుంటుందని సూచించారు. తద్వారా వేలాది మంది రైతులు..ఉద్యోగులకు మేలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఉత్పత్తి చేసే పంచదారను రాష్ట్రంలో పౌర సరఫరాలు, దేవదాయశాఖలకు కేటాయిస్తే ఈ పరిశ్రమలు చక్కగా నడుస్తాయన్నారు. ఎవరో కాంట్రాక్టర్ల నుంచి పంచదారను సేకరించే బదులు మన పరిశ్రమల నుంచి సేకరిస్తే మూసివేసే ప్రమాదం నుంచి బయట పడతాయని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. భీమసింగి అంశంపై పరిశ్రమకు పర్సన్‌ ఇన్‌చార్జిగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి వివరిస్తామన్నారు. అదే విధంగా అమరావతి రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాజధానిపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇస్తే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి... రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు భీశెట్టి బాబ్జి, బండారు పెదబాబు, పి.కామేశ్వరరావు, తమ్మినేని సూర్యనారాయణ, కృష్ణమూర్తి, లగుడు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అఖిలపక్షం నాయకులు, కార్యకర్తలు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీనారాయణను రైతులు ఘనంగా సత్కరించారు.




Updated Date - 2021-10-30T04:04:28+05:30 IST