పల్లెల్లో పశుగ్రాస క్షేత్రాలు
ABN , First Publish Date - 2021-05-22T04:10:46+05:30 IST
గ్రామస్థాయిలో పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతునాయి. ఒక్కో రైతుభరోసా కేంద్రం పరిధిలో మూడు ఎకరాలకు తగ్గకుండా పశుగ్రాస క్షేత్రాలు పెంచడానికి అధికారులు నిర్ణయించారు.

ఉపాధితో అనుసంధానం
2 వేల ఎకరాల్లో పెంపకానికి ప్రణాళికలు
(కొమరాడ)
వేసవిలో పశుగ్రాసం కొరతపై ప్రభుత్వం దృష్టి సారించింది. బాహుళ వార్షిక పశుగ్రాసం పెంపకానికి నిర్ణయించింది. ఉపాధి హామీ పథకానికి అనుసంధానించింది. పర్యవేక్షణ బాధ్యతలను పశుసంవర్థక శాఖకు అప్పగించింది. ఎండ తీవ్రతతో పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో పశుగ్రాసం పెంపకానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పాడి రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గ్రామస్థాయిలో పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతునాయి. ఒక్కో రైతుభరోసా కేంద్రం పరిధిలో మూడు ఎకరాలకు తగ్గకుండా పశుగ్రాస క్షేత్రాలు పెంచడానికి అధికారులు నిర్ణయించారు. నీటి వసతి ఉన్న రైతులకు 20 సెంట్ల నుంచి 2.50 ఎకరాల వరకూ పెంచేందుకు అనుమతి ఇవ్వనున్నారు. రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే రైతుభరోసా కేంద్రాల్లో పనిచేసే పశుసంవర్థక సహాయకులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలిస్తారు. పశుగ్రాసం పెంపకానికి అనుకూలంగా ఉంటే రైతుల జాబితాను మండల పశు వైద్యాధికారి ద్వారా ఎంపీడీవోకు పంపించి అనుమతులు తీసుకుంటారు. అనంతరం రైతులకు పశుగ్రాసం పెంచేందుకు అనుమతి పత్రాలను జారీచేస్తారు. ఎకరా పొలానికి సాగు ఖర్చుల కింద రూ. 83,654 మంజూరు చేస్తారు. ఇందులో వేతనదారులకు రూ.45,030, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 38,624 చెల్లించనున్నారు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు కూలీల మస్తర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సహాయకులు చెక్ మెజర్‌మెంట్ చేసిన అనంతరం ఎంపీడీవో ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేస్తారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 4 లక్షలకు పైగా ఆవులు, గేదెలు ఉన్నాయి. వేసవి కాలంలో పచ్చగడ్డి లభ్యంకాకపోవడంతో దాని ప్రభావం పాల దిగుబడిపై పడుతోందని అధికారులు గుర్తించారు. ఏటా వర్షాభావ పరిస్థితులలో పాటు పంటలకు సరైన గిట్టుబాటు, మార్కెట్ సదుపాయం లేక రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ పోషణ నిమిత్తం నెల వారీ ఖర్చులకు వెసులుబాటు ఉండేలా గ్రామీణ ప్రాంత రైతులు ఎక్కువగా పశు పోషణపై ఆధార పడుతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల్లో కొందరు పశు పోషణనే ఉపాధిగా ఎంచుకున్నారు. అందుకే ప్రభుత్వం రైతులకు ప్రోత్సహించడంతో పాటు వేతనదారులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా కార్యక్రమాన్ని రూపొందించింది.
దరఖాస్తుల ఆహ్వానం
పశుగ్రాసం పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు రైతుభరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుడు తప్పనిసరిగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాబ్‌కార్డు కలిగి ఉండాలి. భూమికి సంబంధించిన హక్కు పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం నంబరు, ఆధార్ కార్డు జెరాక్సులు అందించాలి. ఒక రైతు పేరుపై గరిష్టంగా 2.5 ఎకరాల వరకూ పశుగ్రాసం పెంచుకునే వీలుంది.
డాక్టర్ బి.చక్రధర్, పశు సంవర్ధకశాఖ ఉప సంచాలకులు, పార్వతీపురం
పాల దిగుబడి పెరుగుతుంది
బహు వార్షిక పశుగ్రాసం వల్ల పాడి పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోజుకు రెండు లీటర్ల వరకూ పాల దిగుబడి పెరిగే అవకాశముంది. పెంచిన పశుగ్రాసాన్ని పాడి పశువులకు మేతగా వేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాణా ఖర్చు తగ్గుతుంది. ఈ అవకాశాన్ని పశు పోషకులు వినియోగించుకోవాలి.
డాక్టర్ ఎం.సత్యనారాయణ, పశు వైద్యులు, కొమరాడ