కదంతొక్కారు..

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు కదంతొక్కారు. రెండురోజులుగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యమించారు. కలెక్టరేట్‌కు వందలాదిగా తరలివచ్చి సోమవారం నినాదాలతో హోరెత్తించారు. నిరసన స్వరం వినిపించారు. శాఖల వారీగా మొత్తం ఖాళీలను ప్రకటించి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కదంతొక్కారు..

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల మండిపాటు

ప్రభుత్వం తీరుపై ఆగ్రహం

మొత్తం ఖాళీలను ప్రకటించాలని డిమాండ్‌ 

కలెక్టరేట్‌ వద్ద అందోళన పెద్ద ధర్నా.. మానవహారం 

మద్దతు పలికిన విద్యార్థి సంఘ నాయకులు 


 ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు కదంతొక్కారు. రెండురోజులుగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యమించారు. కలెక్టరేట్‌కు వందలాదిగా తరలివచ్చి సోమవారం  నినాదాలతో హోరెత్తించారు. నిరసన స్వరం వినిపించారు. శాఖల వారీగా మొత్తం ఖాళీలను ప్రకటించి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించగా ఇరువర్గాల తోపులాటలో ఓ నిరుద్యోగి సొమ్మసిల్లిపడిపోయాడు. 


కలెక్టరేట్‌/ విజయనగరం దాసన్నపేట, జూన్‌ 21:

ప్రభుత్వ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. సమస్యను విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. తమలో తామూ చర్చించారు. చివరకు ఉద్యమించడమే మార్గమని నిర్ణయానికొచ్చి సోమవారం కలెక్టరేట్‌కు పయనమయ్యారు. ఉదయం కోట నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు ఎదుట మానహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిదంటూ ఆగ్రహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల తోపులాటలో ఓ నిరుద్యోగి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఆందోళనకారులు కోపంతో రగిలిపోయారు. అరుపులు, కేకలు వేయడంతో కలెక్టరేట్‌ దద్దరిల్లింది. ధర్నా చేస్తున్న కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో డీఆర్వోను కలిసేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతిచ్చారు. 

అంతకుముందు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిందన్నారు. ప్రభుత్వ శాఖల్లో లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే పది వేల పోస్టులకు మాత్రమే క్యాలెండర్‌ విడుదల చేయడం దారుణమంటూ మండి పడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం రాత్రి, పగలు అనకుండా కుటుంబ సభ్యులకు దూరంగా చదువుతున్నామని, ఇప్పుడు పోస్టులు తీయకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసుశాఖలో ఆరువేల పోస్టులు ఖాళీగా ఉంటే 450 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌లో విడుదల చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు వెంకటేష్‌, రాము, సతీష్‌దేవ్‌సింగ్‌, హర్ష, హరీష్‌, జగదీష్‌, చినబాబు తదితరులు పాల్గొన్నారు. 


-------------


పాపం చిట్టితల్లులు

చంపావతి నదిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి 

ఎం.వెంకటాపురం వద్ద ఘటన

గజపతినరగం, జూన్‌ 21: ఆట తప్ప మరో వ్యాపకం తెలియని చిన్నారులు వారు. వరుసకు అక్కాచెల్లెలు కావడంతో మరింత సన్నిహితంగా ఉండేవారు. ఇంటికి సమీపంలో ఆడుకుంటూ నది పక్కకు వెళ్లారు. అక్కడున్న రాయిపై కూర్చొని కొంచెం పక్కకు జరిగిన క్రమంలో నది గుమ్మిలో పడిపోయారు. లోతుగా ఉండడంతో క్షణంలో మునిగిపోయారు. ఈ ఘటనను దూరంనుంచి గమనించిన స్థానికులు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎం.వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న చంపావతినదిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజ్‌, బాధిత కుటుంబ సభ్యులు  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన సబ్బి భవిష్య(4), బోర హారిక (11) వరసకు అక్కాచెల్లెలు. బోర హారిక తల్లిదండ్రులు పైడిరాజు, రాముతో కలిసి తణుకులో నివాసం ఉంటున్నారు. రెండు వారాల కిందట పైడిరాజు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో రాము తన పిల్లలు హారిక, యామిని, మనోజ్‌లతో కలిసి రెండు రోజుల కిందట వెంకటాపుంలోని తన చెల్లెలు మంగ ఇంటికి వచ్చారు. మంచి రోజున ఇంట్లో అడుగుపెట్టే ఉద్దేశంతో వెంకటాపురం వచ్చారు. కాగా సబ్బి మంగ, శివకు ఇద్దరు కుమార్తెలు భవిష్య, గీత ఉన్నారు. పిల్లలంతా సోమవారం ఉదయం నుంచి ఆటలో నిమగ్నంకాగా భవిష్య, హారిక ఆడుకుంటూనే నది పక్కకు వెళ్లారు. చంపావతి నదిలో పనుకురాయి మీద కూర్చొని ఉన్న క్రమంలో పొరపాటున నీటిలోకి జారి పడిపోయారు. వారి అరుపులను దూరం నుంచి గమనించిన కొందరు రక్షించేందుకు పరుగున చేరుకున్నారు. ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి హుటాహుటిన ప్రభుత్వ  ఆసుపత్రికి  తరలించారు. వైద్యులు  కిషోర్‌కుమార్‌ పరీక్షించి అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. ఎస్‌ఐ గంగరాజ్‌ కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇసుక తవ్వకాలతోనే ప్రమాదం

చంపావతి నదిలో అక్రమ ఇసుక తవ్వకాల కారణంగానే ఈప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. గ్రామానికి దగ్గరగా ఉన్న చంపావతి నదిలో రాత్రి, పగలు ఇసుకను తోడేస్తున్నారని, ఆ క్రమంలో నదిలో భారీగా గోతులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 21జిపిఎం24: హారిక, భవిష్య(ఫైల్‌ ఫొటోలు)

==============డబ్బులు డ్రా చేస్తానంటూ మోసం

ఏటీఎం కేంద్రాల వద్ద 

4 ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం 

విజయనగరం క్రైం, జూన్‌ 21 : ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతూ డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులు, వృద్ధులను టార్గెట్‌ చేసుకుని ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేస్తానని నమ్మించి పిన్‌ నంబర్‌ తెలుసుకుని, అనంతరం కార్డు మార్చేస్తున్న అతని మోసాన్ని పోలీసులు ఛేదించారు. విజయనగరంలోని తన కార్యాలయంలో డీఎస్పీ అనిల్‌కుమార్‌ ఆ వివరాలను సోమవారం వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని బైరాగివీధికి చెందిన పేడాడ చినబాబు విశాఖలోని పీఎంపాలెం కొమ్మాదిలో  నివాసం ఉంటున్నాడు. ఏటీఎం కార్డులను తెలివిగా తస్కరిస్తూ డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 11వ తేదీన విజయనగరం మండలం మర్రిశర్ల ఏటీఎం వద్ద అదే గ్రామానికి చెందిన పట్నాయిక్‌ని కృష్ణారావు అనే వృద్ధుడు ఏటీఎం సెంటర్‌కు వచ్చాడు. అక్కడే మాటువేసిన చిన్నబాబు వృద్ధునికి మాయమాటలు చెప్పి కార్డు మార్చేసి కార్డు పనిచెయ్యలేదంటూ చెప్పాడు. అనంతరం ఆ కార్డుతో రూ.20వేలు డ్రా చేశాడు. ఫోన్‌కి డబ్బులు తీసినట్లు మెసేజ్‌ రావడంతో కృష్ణారావు వెంటనే బ్యాంక్‌కి వెళ్లి ఆరా తీశాడు. మోసం జరిగినట్లు తెలుసుకుని ఈ నెల 14న విజయనగరం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దృష్టి సారించిన సీఐ మంగవేణి, ఎస్‌ఐ నారాయణరావు సిబ్బందితో కలసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీని ఆధారం చేసుకుని చినబాబును గుర్తించారు. అనంతరం నిఘా పెట్టి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఏటీఎం వద్ద నగదు డ్రా చేస్తున్న సమయంలో పట్టుకున్నారు. ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో చినబాబు అంగీకరించాడు. అతని వద్ద నుంచి పోలీసులు నాలుగు ఏటీఎం కార్డులు, రూ.16,500 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సీఐ మంగవేణి, ఎస్‌ఐ నారాయణరావు, ఏఎస్‌ఐ తినాథరావు, కానిస్టేబుల్‌ షపీలను డీఎస్పీ అభినందించారు. 


 వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అనిల్‌కుమార్‌

------------------


ఆరోగ్య‘యోగ’ం

కలెక్టరేట్‌/ క్రైం, జూన్‌ 21: యోగా ఆసనాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌  సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఉద్యోగులంతా యోగసనాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని జూమ్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ప్రారంభించారు. యోగాతో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. జేసీ కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ ఒకప్పుడు భారత దేశానికి పరిమితమైన యోగానే నేడు ప్రపంచమంతా ఆచరిస్తోందని చెప్పారు. కార్యక్రమంలోని జేసీ వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవానీ శంకర్‌ తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సావాన్ని పురస్కరించుకుని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రతినిధి అరుణకుమారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన యోగ తరగతుల్లో ఎస్పీ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నియంత్రణలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవటానికి యోగా ఓ మంచి సాధన మన్నారు. 


పోటో రైటప్‌: 21 కలెక్టరేట్‌ 3 యోగా ఆసనాలు వేస్తున్న అధికారులు

===========================రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి 

కొవిడ్‌తో మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలి

ప్రతిపక్ష నాయకుల డిమాండ్‌ 

కలెక్టరేట్‌, జూన్‌ 21 : జిల్లాలో కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం జేసీ మహేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్‌ కొరత వల్ల చాలా మంది మృతిచెందారని, అవి ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామన్నారు. ఆ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వారికి రూ.50 లక్షల బీమా మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలును పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మరింతగా పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి కిమిడి నాగార్జున, ఐవీపీ రాజు, సీపీఐ నుంచి బుగత ఆశోక్‌ తదితరులు ఉన్నారు.


ఫొటోరైటప్‌: 21 కలెక్టరేట్‌ 2: నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

=============== మర్మమేమిటో?

మాంగనీసు తవ్వకాల వివాదంలో కొత్తరాగం

గిరిజనుల నిరసన చర్చనీయాంశం

(మెంటాడ)

తాటిపూడివలస కొండపై మాంగనీసు తవ్వకాలు జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. రెండు నెలల కిందట వెలుగుచూసిన ఓ ఘటన మరుగునపడిపోగా..సోమవారం గిరిజనుల ఆందోళనతో మరోసారి తెరపైకి వచ్చింది. ఇది చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొండలింగాలవలస పంచాయతీ తాటిపూడివలసలో సుమారు 500 ఎకరాల్లో కొండ విస్తరించి ఉంది. కొండలో అత్యంత విలువైన మాంగనీసు నిల్వలు ఉన్నాయి. రెండు నెలల కిందట కొండ సమీపంలో ఎక్సకవేటర్‌తో పాటు యంత్రాలను స్థానికులు గుర్తించి భూగర్భ, గనుల శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. సచివాలయ సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించగా కొండ వద్ద తవ్వకాలు బయటపడ్డాయి. అక్కడే ఉన్న ఎక్సకవేటర్‌ను గుర్తించిన సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చేలోపే ఎక్సకవేటర్‌తో పాటు ఆపరేటర్‌ అక్కడ నుంచి పరారయ్యారు. దీనిని సీరియస్‌గా పరిగణించిన అధికారులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా కొన్ని రోజుల కిందట ఎక్సకవేటర్‌ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీన్‌ కట్‌చేస్తే పోడు వ్యవసాయం కోసం జేసీబీని తీసుకొచ్చామని.. అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కొంతమంది గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇన్ని రోజులు కనిపించని వారు ఉన్నపళంగా నిరసన చేపట్టడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలను నిగ్గు తేల్చాలని స్థానిక సీపీఎం నాయకుడు రాకోటి రాములు డిమాండ్‌ చేశారు. దీనిపై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించనున్నట్టు చెప్పారు. 

ఎవరున్నారో నిగ్గుతేలుస్తాం

తాటిపూడివలస గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై మైనింగ్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో మైనింగ్‌ అధికారులు దాడులు చేశారు. అక్రమ తవ్వకాలు నిర్వహించిన వారిపై కేసు నమోదు చేశాం. ఎక్సకవేటర్‌, ఆపరేటర్‌ పరారీ అయ్యారు. మైనింగ్‌ తవ్వకాలు వెనుక ఎవరున్నారో నిగ్గుతేలుస్తాం.

- విజయలక్ష్మీ, ఏడీ మైన్స్‌ 


ఎక్సకవేటర్‌ను స్వాధీనం చేసుకున్నాం

మైనింగ్‌ అధికారుల ఫిర్యాదు మేరకు తాటిపూడివలస గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై మైనింగ్‌ తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసి ఇటీవల ఎక్సకవేటర్‌  స్వాధీనం చేసుకున్నాం. అది మా ఆధీనంలోనే ఉంది. తవ్వకాలు జరిగి సుమారు నెల రోజులైంది. 

- షేకశంకర్‌, ఆండ్ర ఎస్‌ఐ


మెంటాడ 1 ః- ఎక్సకవేటర్‌ ఇచ్చేయాలంటూ గిరిజనులు ఆంధోళన


Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST