బోడికొండపై కన్ను

ABN , First Publish Date - 2021-03-23T05:01:18+05:30 IST

పార్వతీపురం డివిజన్‌ పరిధిలో విలువైన గ్రానైట్‌ నిక్షేపాలున్న కొండలపై బడాబాబుల కన్ను పడింది. కొన్నేళ్లుగా వాటిని దోచేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో బడిదేవర కొండపై తవ్వకాలకు అనుమతుల కోసం పైరవీలు చేశారు. ప్రస్తుతం బోడికొండను తొలిచేందుకు ఎత్తుగడ వేస్తున్నారు.

బోడికొండపై కన్ను
బోడెమ్మ దేవత ఉన్న బోడికొండ ఇదే

తవ్వకాలకు బడాబాబుల వ్యూహం

గ్రానైట్‌ నిక్షేపాలను దోచేందుకు యత్నం

2010లోనే రంగంలోకి దిగిన వైనం

2019 నుంచి వేగవంతమైన అనుమతుల ప్రక్రియ

నిన్న బడిదేవర కొండ.. నేడు బోడికొండ


పార్వతీపురం డివిజన్‌ పరిధిలో విలువైన గ్రానైట్‌ నిక్షేపాలున్న కొండలపై బడాబాబుల కన్ను పడింది. కొన్నేళ్లుగా వాటిని దోచేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో బడిదేవర కొండపై తవ్వకాలకు అనుమతుల కోసం పైరవీలు చేశారు. ప్రస్తుతం బోడికొండను తొలిచేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. పార్వతీపురం మండలంలోని ఎల్‌ఎన్‌పురం, సంగంవలస, పెదమరికి, కృష్ణపల్లి తదితర 15 గ్రామాల ప్రజల ఆరాధ్య దేవతగా ఉన్న బోడెమ్మ దేవత కొండపై బాంబుల మోతకు అనుమతులు ఉన్నాయంటూ కొందరు గ్రానైట్‌ వ్యాపారులు హడావిడి చేస్తున్నారు. గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకుని అందుకనుగుణంగా జోరు పెంచాలని పథకం పన్నినట్లు తెలుస్తోంది. 


(పార్వతీపురం / రూరల్‌)

బోడికొండను సొంతం చేసుకునేందుకు అక్రమార్కులు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. గ్రానైట్‌ తవ్వకాల కోసం 2010 నుంచి వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ సమీపంలోని సర్వే నెంబరు 323లో ఉన్న ఈ కొండలో విలువైన రంగు గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అదే పేరుతో క్వారీ నిర్వహించుకొనేందుకు అనుమతులు కావాలని 2010 ఏప్రిల్‌ 24న ఎంఎస్‌ఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌, ఎం.మధుప్రియ అనే వ్యక్తులు దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్‌ఎన్‌పురం, ఇతర గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోడికొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని కోరారు. దీంతో కొన్నేళ్ల పాటు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత 2016లో క్వారీ అనుమతులకు ఆ వ్యాపారులు మరోసారి ప్రయత్నించారు. ఆ సమయంలో గనుల శాఖ అధికారులకు, దరఖాస్తుదారులకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో 2019 నుంచి మరింత వేగం పెరిగింది. గతేడాది డిసెంబరు 15న గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులను మంజూరు చేస్తూ గనులశాఖ జిల్లా ఏడీ నుంచి ఏకంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. బోడికొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు మంజూరు చేయవద్దని, మొండిగా ముందుకెళ్తే తీవ్రంగా ఉద్యమిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. తమ ప్రాంత ఆరాధ్య దేవత ఉన్న కొండపై గ్రానైట్‌ తవ్వకాలకు ఎలా అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నిస్తున్నారు. అనుమతులను రద్దు చేసే వరకు అవిశ్రాంతంగా పోరాడాలని, అవసరమైతే ప్రాణ త్యాగాలకు సిద్ధమంటూ ఆ ప్రాంత ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఏ ప్రాంతంలోనైనా కర్మాగారం నిర్మాణం చేపట్టినా, ప్రాజెక్టు నిర్మించినా, గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టాలన్నా ఆ ప్రాంత ప్రజల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ప్రజలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తీసుకోవాలి. గ్రామస్థుల తీర్మానం చేస్తేనే అడుగు వేయాలి. ఇటువంటి కార్యక్రమం మచ్చుకైనా అధికార యంత్రాంగం చేపట్టకపోవడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో బడిదేవర కొండపై...

పదేళ్ల కిందట పార్వతీపురం మండలం గంగాపురం రెవెన్యూ పరిధిలోని బడిదేవర కొండపై గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు. బడిదేవరమ్మ ఉన్న ప్రాంతంలో తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధికార యంత్రాంగాన్ని దిగ్బంధించి అనుమతులు రద్దు చేసేవరకు విశ్రాంతి లేకుండా పోరాటం చేశారు. క్వారీ తవ్వకాలకు గనుల  శాఖ అనుమతించడంపై అటవీ శాఖ కూడా అభ్యంతరం చెప్పడంతో చివరకు హైకోర్టు గ్రానైట్‌ క్వారీ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. 

సంఘటితమవుతున్న గిరిజనులు

తమ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవత ఉన్న బోడికొండపై గ్రానైట్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎల్‌ఎన్‌ పురం సర్పంచ్‌ జక్కు ప్రవీణ్‌కుమార్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై సోమవారం స్పందనలో అధికారులను కలిశారు. ఎల్‌ఎన్‌పురం, చొక్కాపువానివలస తదితర గ్రామాల ప్రజలు కూడా ఉద్యమానికి మద్దతు పలికారు. మరోవైపు బోడికొండ పరిధిలో వందలాది ఎకరాల్లో సాగుకు ఈ కొండ ద్వారా వచ్చే వర్షపు నీరే ఆధారం. సాగు అవసరాలు, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే గ్రానైట్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్‌. 

అనుమతులు రద్దు చేయాలి

గ్రానైట్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. బోడికొండ వద్ద ఉన్న బోడెమ్మ దేవతను మా గ్రామంతో పాటు చొక్కాపువానివలస, తదితర గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రానైట్‌ తవ్వకాల అనుమతులను రద్దు చేయాలి.

- జక్కు ప్రవీణ్‌కుమార్‌, సర్పంచ్‌, ఎల్‌ఎన్‌ పురం

అనుమతించడం దారుణం

ప్రజలకు తెలియకుండా గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయడం దారుణం. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తాం. ప్రజలకు సీపీఎం అండగా నిలుస్తుంది.

- రెడ్డి శ్రీరామ్మూర్తి, సీపీఎం డివిజన్‌ కార్యదర్శి

మా ఆరాధ్య దైవం ఉన్న కొండ

గ్రానైట్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. మా ఆరాధ్య దైవం బోడెమ్మతల్లి. వందలాది ఎకరాలకు బోడెకొండ ద్వారా సాగునీరందుతోంది. ఇటువంటి ప్రాంతంలో గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులను మంజూరు చేయడం అన్యాయం.

- కొత్తాడ నాగభూషణం, గ్రామ పెద్ద, ఎల్‌ఎన్‌ పురం

ఉన్నతాధికారులకు తెలియజేస్తాం

బోడికొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు నిర్వహించవద్దని, ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎల్‌ఎన్‌ పురం తదితర గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో బోడెమ్మ దేవతను కొలుస్తున్నామని, బోడి కొండ ద్వారా సాగునీరందుతోందని ప్రజలు వినతిపత్రం ద్వారా ఐటీడీఏ పీవోకు తెలిపారు. బోడి కొండపై ప్రజల అభిప్రాయాలను తమ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తాను.

- జి.శ్రీరామ్మూర్తి, ఇన్‌చార్జి తహసీల్దార్‌, పార్వతీపురం


అనుమతులపై ఆగ్రహం

బోడికొండపై గ్రానైట్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ ఎల్‌ఎన్‌ పురం, చొక్కాపువానివలస, ఇతర గ్రామాల ప్రజలు ఐటీడీఏ, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాల వద్ద సోమవారం ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్‌ఎన్‌ పురం సర్పంచ్‌ జక్కు ప్రవీణ్‌కుమార్‌, సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది వరకు ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. తమ మనోభావాలను దెబ్బతీయవద్దంటూ అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఐటీడీఏ కార్యాలయానికి కూడా వెళ్లి పీవో కూర్మనాథ్‌కు వినతిపత్రం అందించి క్వారీ లీజుల అనుమతులు రద్దు చేయాలని ముక్తకంఠంతో కోరారు. దీనిపై పీవో స్పందించి తహసీల్దార్‌ శ్రీరామ్మూర్తితో ఫోన్‌లో మాట్లాడారు. ఆ కొండ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించాలని ఆదేశించారు. ఇదే విషయమై ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు కూడా వినతిపత్రం అందజేశారు. 



Updated Date - 2021-03-23T05:01:18+05:30 IST