ఆరిన ఆశల దీపాలు
ABN , First Publish Date - 2021-11-21T06:05:47+05:30 IST
ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థులు వారు. తల్లిదండ్రులు వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా సాకుతున్నారు. ప్రతిరోజులాగే శనివారం ఆనందంగా కళాశాలకు సాగనంపారు. అదే చివరి చూపు అయిందని తెలిశాక అక్కడికక్కడే కుప్పకూలారు. బొబ్బిలి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

కళాశాల నుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదాలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థుల మృతి
ఒకరు ఇంజనీరింగ్, ఇంకొకరు ఇంటర్ చదువుతున్న వైనం
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
బొబ్బిలి పట్టణంలో ఘోరం
బొబ్బిలిరూరల్, నవంబరు 20:
ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థులు వారు. తల్లిదండ్రులు వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా సాకుతున్నారు. ప్రతిరోజులాగే శనివారం ఆనందంగా కళాశాలకు సాగనంపారు. అదే చివరి చూపు అయిందని తెలిశాక అక్కడికక్కడే కుప్పకూలారు. బొబ్బిలి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
బొబ్బిలి మండలం పిరిడి పంచాయితీ కొల్లివలస గ్రామానికి చెందిన వాలిపల్లి సత్యనారాయణ (17) బొబ్బిలిలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగే కళాశాల తరగతులు ముగిసిన వెంటనే స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సెక్కాడు. కొద్దిదూరం బస్సు కదిలాక బస్సులోనుంచి కిందకు జారిపడిపోయాడు. తోటి విద్యార్థులంతా కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన కొద్ది క్షణాల్లోనే సత్యనారాయణ మృతిచెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు పరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న బిడ్డను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సత్యనారాయణ తండ్రి రాము, తల్లి లక్ష్మిలు వ్యవసాయకూలీలు. కాయకష్టం చేసుకొని ఇద్దరు బిడ్డలను చదివించు కుంటున్నారు. సత్యనారాయణ తమ్ముడు జగదీష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎస్‌ఐలు జ్ఞాన ప్రసాద్, చదలవాడ సత్యనారాయణ, ఇతర సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థి ఇంట పెనువిషాదం
పట్టణంలోని సంగవీధికి చెందిన సున్నపు జాన్సన్‌బాబు(20) విజయనగరంలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం కళాశాల నుంచి బైకుపై స్నేహితునితో కలిసి ఇంటికి వస్తుండగా స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఒక ట్రావెల్ బస్సును ఓవర్‌టేక్ చేయబోతూ ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి బస్సు కిందికి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో జాన్సన్‌బాబు అక్కడికక్కడే మృతిచెందగా, స్నేహితుడు ప్రవీణ్‌కుమార్ గాయాల పాలయ్యాడు. జాన్సన్ బాబు తండ్రి దాసు సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో వార్డెనగా పనిచేస్తున్నాడు. కుమారుని మరణ వార్త తెలిసి కుటుంబసభ్యులంతా గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో మృతుల బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. సీఐ ఎం.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.