పెళ్లికానుక ఏదీ?

ABN , First Publish Date - 2021-11-24T04:19:26+05:30 IST

పిల్లల వివాహం చేయడమనేది తల్లిదండ్రులకు జీవితంలో అతిపెద్ద పరీక్ష. అందులో ఆడపిల్ల పెళ్లి అంటే మరింత ఆర్థిక భారం. చేతిలో రూ.లక్షల్లో ఉండాల్సిందే. స్థోమత ఉన్న వారి సంగతి పక్కన పెడితే... సామాన్య, మధ్యతరగతి వారికి అప్పోసప్పో చేయడమో...లేకుంటే ఉన్న ఆస్తులను విక్రయించి పెళ్లిళ్లు చేయడమో తప్పదు.

పెళ్లికానుక ఏదీ?

 ఒక్కరికీ అందని సాయం

 రెండేళ్లుగా ఎదురుచూపులు

సామాన్య, మధ్యతరగతి వారికి నిరాశ

పట్టించుకోని ప్రభుత్వం

(గజపతినగరం)

పిల్లల వివాహం చేయడమనేది తల్లిదండ్రులకు జీవితంలో అతిపెద్ద  పరీక్ష. అందులో ఆడపిల్ల పెళ్లి అంటే మరింత ఆర్థిక భారం. చేతిలో  రూ.లక్షల్లో ఉండాల్సిందే. స్థోమత ఉన్న వారి సంగతి పక్కన పెడితే... సామాన్య, మధ్యతరగతి వారికి అప్పోసప్పో చేయడమో...లేకుంటే ఉన్న ఆస్తులను విక్రయించి పెళ్లిళ్లు చేయడమో తప్పదు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘చంద్రన్న పెళ్లికానుక’ పేరిట పథకాన్ని ప్రకటించారు. సామాన్య, మధ్యతరగతి వారికి దీనిని వర్తింపజేశారు. అమలు బాధ్యతను ప్రత్యేక శాఖకు అప్పగించారు. వివాహమైన కొద్దిరోజుల వ్యవధిలోనే సాయం మొత్తాన్ని అందించేవారు. ఇది పేద ప్రజలకు ఎంతో కొంత ఊతంగా ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు   కావస్తున్నా ఇంతవరకూ ఒక్కరికీ ‘పెళ్లికానుక’ అందించలేకపోయారు. గత ఏడాది సెప్టెంబరులో పెళ్లి కానుక పథకం పేరు మార్చడంతో పాటు నగదు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాది గడుస్తున్నా పెళ్లికానుక ఊసే లేకుండా పోయింది. 

 గత ప్రభుత్వ హయాంలో..

టీడీపీ ప్రభుత్వ హయాంలో పెళ్లి కానుక పథకం సక్రమంగా అమలయ్యేది. వెలుగు ఆధ్వర్యంలో కళ్యాణమిత్రలు నేరుగా దరఖాస్తులు స్వీకరించేవారు. వివాహానికి సంబంధించి ఆహ్వానపత్రికతో పాటు కొన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే.. కొద్దిరోజులకే లబ్ధిదారుల ఖాతాలో నగదు పడేది. వధువు బీసీ అయితే రూ.35 వేలు, వధువు బీసీ అయి ఉండి కులాంతర వివాహం చేసుకుంటే రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, వధువు ఎస్సీ అయి ఉండి కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు పెళ్లికానుకగా అందించేవారు.  టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 వరకూ సక్రమంగా చెల్లింపులు జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత నుంచి వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘కానుక’ ఊసే లేకపోయింది. ప్రజాప్రతినిధులకు వినతులు వెల్లువెత్తినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019 సెప్టెంబరులో పథకాన్ని వైఎస్సార్‌ పెళ్లికానుకగా పేరు మార్చుతూ ప్రభుత్వం ప్రకటించింది. సాయం మొత్తాన్ని పెంచుతూ జీవో జారీచేసింది. 2019 ఏప్రిల్‌ నుంచే పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయించింది. కానీ ఇంతవరకూ వేలాది దరఖాస్తులు వచ్చినా.. ఒక్క లబ్ధిదారుడికీ సాయం అందించలేకపోయింది. ఏడాది గడస్తుండడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారులు మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతున్నారు.   

 స్పష్టత కరువు

గత ఏడాది మార్చి నుంచి కరోనా ప్రభావంతో వివాహాలు నిలిచిపోయాయి. ఆంక్షల నడుమ కొందరు పరిమిత సంఖ్యలో బంధువుల నడుమ వివాహాలు చేసుకున్నాయి. సరిగ్గా వివాహాల సీజన్‌లో కరోనా రెండో దశతో పెళ్లిళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, నవంబరు, డిసెంబరులో ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో వివాహాలకు నిర్ణయించారు. అయితే గతంలో పెట్టిన దరఖాస్తులకే మోక్షం లేదు..కొత్తగా పెడితే కానుక వస్తుందా లేదా అన్న అనుమానం తల్లిదండ్రులను వెంటాడుతోంది. గతంలో విధులు నిర్వహించే కల్యాణమిత్రలను సైతం ప్రభుత్వం తొలగించింది. గ్రామ సచివాలయాల్లో సైతం వైఎస్సార్‌ పెళ్లికానుకపై స్పష్టత లేదు. దీంతో గ్రామాల్లో అవగాహన కరువవుతోంది. చాలా మంది దరఖాస్తు చేయడం లేదు. దీనిపై సచివాలయాలకు స్పష్టమైన మార్గదర్శకాలు సూచించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. 


Updated Date - 2021-11-24T04:19:26+05:30 IST