ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-02T04:55:28+05:30 IST

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆకాంక్షించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
మాట్లాడుతున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ

ఏర్పాట్లు సంతృప్తి కరం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

  జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆకాంక్షించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. ముందుగా జిల్లాను పొగడ్తలతో ముంచెత్తారు. సంస్కృతీ, సంప్రదాయాలు... కళలతో పాటు ప్రశాంత జిల్లాగా పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సజావుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఏకగ్రీవాలు జరగాలని, బలవంతంగా నోరు నొక్కి.. ఒత్తిడి తెచ్చి నిర్వహించే ఏకగ్రీవాలను అంగీకరించబోమని చెప్పారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 90శాతం పంచాయతీల్లో పోలింగ్‌ జరిగిందంటే.. ఎన్నికల పట్ల ప్రజలకు మంచి అవగాహన, నమ్మకం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఏకగ్రీవాలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తే బడుగు, బలహీన వర్గాలు అధికారానికి దూరమవుతారని అన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే ఎన్నికలే మార్గమని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు అవకాశం ఇస్తే ప్రజా స్వామ్యం బలపడుతుందన్నారు. ఎటువంటి అరాచకాలు, ఒత్తిళ్లు లేని ఏకగ్రీవాలకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. ప్రజా స్వామ్యాన్ని బలపరచడం కోసమే ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలను రాజ్యాంగం ఇచ్చిందని వివరించారు. తమకు అన్ని రాజకీయ పార్టీలూ సమానమేనని, రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. వ్యవస్థలను బలోపేతం చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాన్ని దేశ సర్వోన్నత న్యాయ స్థానం బలపరిచిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌.హరి జవహర్‌లాల్‌, అదనపు డీజీ సంజయ్‌, డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్‌పీ రాజకుమారి, ఎన్నికల పరిశీలకులు ఎస్‌.నాగలక్ష్మి, జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సింహాచలం, సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-02T04:55:28+05:30 IST