సమరమే!

ABN , First Publish Date - 2021-02-02T04:38:18+05:30 IST

జిల్లాలో ఎన్నికల కోలాహలం ప్రారంభమవుతోంది. మూడు దశల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి దశ మంగళవారం మొదలవుతోంది. పార్వతీపురం డివిజన్‌ నుంచి పోరు ఆరంభం కానుంది. 15మండలాల పరిధిలోని 415 పంచాయతీల్లో మంగళవారం నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.

సమరమే!

జిల్లాలో నేటి నుంచి నామినేషన్ల పర్వం

తొలుత పార్వతీపురం డివిజన్‌లో ప్రారంభం 

15మండలాల పరిధిలో 415 పంచాయతీల్లో ఎన్నికలు

 13న పోలింగ్‌


జిల్లాలో ఎన్నికల కోలాహలం ప్రారంభమవుతోంది. మూడు దశల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి దశ మంగళవారం మొదలవుతోంది. పార్వతీపురం డివిజన్‌ నుంచి పోరు ఆరంభం కానుంది. 15మండలాల పరిధిలోని 415 పంచాయతీల్లో మంగళవారం నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 4 వరకు     సర్పంచ్‌, వార్డు పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న పోలింగ్‌ జరుగనుంది. ఇప్పటికే పల్లెల్లో సందడి నెలకొంది.  


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)/ పార్వతీపురం/ కలెక్టరేట్‌

ఎన్నికల సమరం మొదలవుతోంది. నామినేషన్‌ సమయం రానే వచ్చింది. ఎన్నికలకు సై అంటున్న వారంతా నామినేషన్‌కు బయలుదేరనున్నారు. ఇంతవరకు అధికారులు మాత్రమే ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. ఓటర్ల జాబితా తయారీ నుంచి పోలింగ్‌ బూత్‌ల కేటాయింపు వరకూ అన్నీ కొలిక్కితెచ్చారు. వారితో పాటు నాయకుల హడావుడి మొదలవనుంది. ఎన్నికల్లో ఢీకొట్టే వారంతా బయటకు రానున్నారు. అసలైన సిత్రాలన్నీ ఇప్పుడే ప్రత్యక్షం కానున్నాయి. పార్వతీపురం డివిజన్‌లో నామినేషన్ల ఘట్టానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి సర్పంచి, వార్డు మెంబర్లుగా పోటీ చేసే అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. ఒక్కసారిగా గ్రామాల్లో రాజకీయ వేడి పెరిగింది. సమీకరణాలు జోరందుకున్నాయి. ఒకే పార్టీ మద్దతుతో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. వారిని శాంతపర్చడం నాయకులకు తలనొప్పిగా తయారైంది. కొందరు పోటీకే మక్కువ చూపుతున్నారు. మరోవైపు అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక్కో తేదీలో నామినేషన్లు వేసేందుకు నిర్ణయించుకుంటున్నారు. ఈనెల 4వరకే గడువు ఉంది. 

మొదటి దశలో ఇలా...

 మొదటి దశలో జరిగే 15మండలాల్లో 415 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 3,908 వార్డులు ఉన్నాయి. 6,19,834 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం ఓటర్లలో 3,13,164 మంది మహిళలు, 3,06,633 మంది పురుషులు ఉన్నారు. జిల్లాలో మొదటి దశలో పోలింగ్‌ జరిగే మండలాల్లో బాడంగి, బలిజిపేట, బొబ్బిలి, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సీతానగరం, రామభద్రపురం, సాలూరు, తెర్లాం మండలాలు ఉన్నాయి. 

మావో ప్రభావిత పోలింగ్‌ కేంద్రాలు

పార్వతీపురం డివిజన్‌ పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో మావో ప్రభావిత పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలు లేకపోయినా గత అనుభవాలను, సంఘటనలను దృష్టిలో పెట్టుకుని 67 పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీస్‌ బలగాలను కేటాయిస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌లో 71 అతి సమస్యాత్మక, 109 సమస్యాత్మక, 162 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా 6 పోలింగ్‌ కేంద్రాలకు రహదారులు లేవు. ఆయా చోట్ల ఓటర్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.


జిల్లాలో మొదటి దశ ఇలా..

- ఈనెల 2నుంచి 4 వరకు నామినేషన్లు 

- 5న పరిశీలన 

- 6న తిరస్కరించిన నామినేషన్ల అప్పీలు 

- అప్పీల్‌పై 7న నిర్ణయం

- 8 వరకు నామినేషన్ల ఉపసంహరణ

- 13న ఉదయం 6.30నుంచి 3.30వరకు పోలింగ్‌ 

- అదే రోజు 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు

- అదే రోజు సర్పంచి, ఉప సర్పంచి ఎన్నిక 


మండలాల వారీ నామినేషన్‌ కేంద్రాలు

- పార్వతీపురం: పెదబొండపల్లి, డీకేపట్నం, ఎన్‌.ములగ, వెంకంపేట, ఎమ్మార్‌ నగరం, కృష్ణపల్లి, బందలుప్పి, నర్సిపురం, అడ్డాపుశిల, తాళ్లబురడి

- సీతానగరం మండలం: గేదెలవలస, కోటసీతారాంపురం, అంటిపేట, చినభోగిలి, గెడ్డలుప్పి, గుచ్చిమి, నిడగళ్లు, బూర్జ, సీతానగరం

- రామభద్రపురం: రొంపల్లి, కొట్టక్కి, ఆరికతోట, బూసాయివలస, రామభద్రపురంలో రెండు

- మక్కువ: మార్కొండపుట్టి, శంబర, కవిరిపల్లి, కోన, వెంకటబైరిపురం, కాశీపట్నం, మక్కువ.

- జియ్యమ్మవలస: జియ్యమ్మవలస, తామరకండిజమ్ము, బీజే పురం, జీటీ వాడ, టీఎన్‌ వలస, బిత్తరపాడు, చినమేరంగి, తుంబలి.

- తెర్లాం: తెర్లాం, నందిగాం, లోచర్ల, కొరటం, పెరుమలి, నెమలం, వెలగవలస.

- గరుగుబిల్లి: రావివలసలో రెండు, గొట్టివలస, గరుగుబిల్లి, పెదగుడబ, సంతోషపురం, ఉల్లిభద్ర.

- సాలూరు: కురుకుట్టి, మామిడిపల్లి, తోణాం, కొత్తవలస, తుండ, బాగువలస.

- బాడంగి: గజరాయునివలస, డొంకినవలస, పిన్నవలస, ముగడ, బొచ్చవానివలస, పినపెంకి.

- కొమరాడ: మసిమండ, చోళ్లపధం, కొమరాడ, గంగరేగువలస, అర్తాం, విక్రమంపురం, కెమిశీల, దళాయిపేట, మాదలంగి.

- కురుపాం: గుజ్జువాయి, గుమ్మ, కురుపాం, మొండెంఖల్‌, నీలకంఠాపురం, పెదగొత్తిలి, రస్తాకుంటుబాయి.

- గుమ్మలక్ష్మీపురం: కేధారిపురం, పెదఖర్జ, కొండవాడ, ఎల్విన్‌పేట-1, దుడ్డుఖల్లు, రాయగడజమ్ము, బీరుపాడు

- బలిజిపేట: బలిజిపేట, బర్లి, వెంగాపురం, చిలకలపల్లి, అరసాడ, గంగాడ

- బొబ్బిలి: దిబ్బగుడ్డివలస, గోపాలరాయుడుపేట, పెంట, ఎం.బూర్జవలస, మెట్టవలస, అలజంగి, పిరిడి, కోమటిపల్లి, కలవరాయి, పెంకి.

పాచిపెంట: పాచిపెంట, పి.కోనవలస, కర్రివలస, కేసలి, తాడూరు, పాంచాలి, నంద్యాడవలస, ముటకూడు, గుట్టూరు

నామినేషన్లకు ఏర్పాట్లు

నామినేషన్లను స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తారు. తొలిదశ ఎన్నిక జరిగే ప్రాంతాలను 67 జోన్లుగా, 121 రూట్‌లుగా విభజించారు. ప్రచారం, ఓటింగ్‌ వంటి వివిధ దశల కోసం 74 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. 2వ తేదీ నుంచి 4 వరకూ ఉదయం 10.30 నుంచి 5.30 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 

నేతల విగ్రహాలకు ముసుగులు

ఎన్నికల నియమావళిలో భాగంగా నేతల విగ్రహాలకు ముసుగులు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వాహనాలను కార్యాలయాల వద్దకు చేర్చి వాటిపై టార్పాలిన్లు కప్పారు. గ్రామ సచివాలయాల వద్ద ముఖ్యమంత్రి ఫొటోలు కనిపించకుండా అడ్డు పెట్టారు. 

 

Updated Date - 2021-02-02T04:38:18+05:30 IST