నెలల తరబడి విధులకు డుమ్మా!
ABN , First Publish Date - 2021-10-22T05:14:16+05:30 IST
పిప్పలభద్ర ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కె.ఉదయ్‌కుమార్ నెలల తరబడి విధులకు డుమ్మా కొడుతున్నారు.

మెమోలకూ స్పందించని వైనం
పిప్పలభద్ర ఉపాధ్యాయుడి నిర్వాకం
జియ్యమ్మవలస: పిప్పలభద్ర ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కె.ఉదయ్‌కుమార్ నెలల తరబడి విధులకు డుమ్మా కొడుతున్నారు. ఎంఈవో మెమోలు జారీ చేసినా స్పందించడం లేదు. పిప్పలభద్ర ఎంపీపీ పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ హెచ్‌ఎంగా బి.కమలాక్షితో పాటు ఉపాధ్యాయుడిగా కె.ఉదయ్‌కుమార్ పనిచేస్తున్నారు. అయితే ఉదయ్ కుమార్ తరచూ విధులకు డుమ్మా కొడుతుండడంతో గత నెల 23న ఎంఈవో ఎన్.సత్యనారాయణ మెమో జారీ చేశారు. అయినా ఆయన కనీసం స్పందించ లేదు. సెప్పెంబరు 7 నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు పాఠశాలకు డుమ్మా కొట్టిన ఈయన అక్టోబరు 7న పాఠశాలకు వచ్చి అప్పటి నుంచి మళ్లీ బడికి రాలేదు. ఇతని పరిస్థితిని తెలుసుకున్న హెచ్‌ఎం.. వినీత అనే డిగ్రీ చదివిన అమ్మాయిని వలంటీర్ గా కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎంఈవో సత్యనారాయణ బుధవారం ఆ పాఠశాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఉదయ్‌కుమార్‌ను సస్పెండ్ చేసేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్టు చెప్పారు.