దళారులకు అవకాశం ఇవ్వొద్దు
ABN , First Publish Date - 2021-11-27T04:59:35+05:30 IST
ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను అరికట్టాలని మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ ఎమ్.వీరాచారి సూచించారు. ఎవరైనా రైతులు తమ పంటను బయట విక్రయిస్తే ఆ సర్వే నంబర్లను ఆర్‌బీకేల్లో బ్లాక్ చేయించుకోవాలని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన మార్క్‌ఫెడ్ జీఎం
పూసపాటిరేగ, నవంబరు 26: ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను అరికట్టాలని మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ ఎమ్.వీరాచారి సూచించారు. ఎవరైనా రైతులు తమ పంటను బయట విక్రయిస్తే ఆ సర్వే నంబర్లను ఆర్‌బీకేల్లో బ్లాక్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. తద్వారా పండిన పంటకు సరైన వివరాలు అధికారుల వద్ద ఉంటాయని అన్నారు. దళారుల బారిన పడే అవకాశం ఉండదన్నారు. కొప్పెర్లలోని రైతు భరోసాకేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బంది, రైతులతో చర్చించారు. పలువురు రైతులు మాట్లాడుతూ రెవెన్యూ వారు 1బీలను సరిగా అందజేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. డీపట్టా భూములను ఆన్‌లైన్ చేయకపోవటం వల్ల కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇవ్వలేకపోతున్నామన్నారు. అనంతరం వీరాచారి మాట్లాడుతూ ఆర్‌బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలు ఉంటుందని స్పష్టం చేశారు. గోనెసంచులు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకు అందజేస్తామన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం నాయక్, జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ ఎస్‌కే యాసిన్, వ్యవసాయశాఖ అధికారులు శ్రీనివాసరావు, తహసీల్దారు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.