పరీక్ష రాయాల్సిందే!

ABN , First Publish Date - 2021-09-04T04:22:57+05:30 IST

ప్రభుత్వ అస్పష్ట విధానాలతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరో నెలలో ప్రొబేషనరీ పిరియడ్‌ పూర్తవుతుందని..రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారుతామని ఆనందంలో ఉండగా... ప్రభుత్వ ం పిడుగులాంటి వార్త చెప్పింది.

పరీక్ష రాయాల్సిందే!
ఎస్‌.కోట ఎంపీడీవో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందిస్తున్న సచివాలయ ఉద్యోగులుడిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ తప్పనిసరి

15న నిర్వహణకు సన్నాహాలు! 

ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు

 శృంగవరపుకోట, సెప్టెంబరు 3: ప్రభుత్వ అస్పష్ట విధానాలతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరో నెలలో ప్రొబేషనరీ పిరియడ్‌ పూర్తవుతుందని..రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారుతామని ఆనందంలో ఉండగా... ప్రభుత్వ ం పిడుగులాంటి వార్త చెప్పింది. ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు మార్చేసింది. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2019 అక్టోబరులో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. 11 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించింది. అప్పటి నుంచి వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ అక్టోబరు 2 నాటికి ప్రొబేషనరీ పిరియడ్‌ను పూర్తి చేసుకోనున్నారు. ఇందులో కొన్ని శాఖల సహాయకులకు డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహించారు. దాదాపు అందరూ ఉత్తీర్ణత సాధించారు. సంక్షేమ, విద్యా సహాయకులు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు (ఎఎన్‌ఎంల)కు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో వారంతా ఊరట చెందారు. ఇంతలో వారు కూడా పరీక్షలు రాయాల్సి ఉంటుందని తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ హర్షవర్థన్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు చూస్తూ.. మరో పక్క డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌కు సన్నద్ధం కావడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈనెల 15న వారికి పరీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. పట్టుమని రెండు వారాలు కూడా లేకపోవడంతో వారిలో కలవరం మొదలైంది. దీనికితోడు ఈ పరీక్షలకు సంబంధించి సిలబస్‌ అంటూ ఏదీ లేదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2021-09-04T04:22:57+05:30 IST