సన్నద్ధతేదీ?
ABN , First Publish Date - 2021-12-10T05:10:34+05:30 IST
రబీలో బోరు బావుల పరిధిలో వరి వేయవద్దన్న ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రత్యామ్నాయం చూపడం లేదు. ఆరుతడి పంటల విత్తనాలు పంపిణీ చేసే ఆలోచనే లేదు. వ్యవసాయ శాఖ ఇదివరకే సిద్ధం చేసుకున్న రబీ సాగు ప్రణాళికనే అమలు చేస్తున్నారు. ఆర్‌బీకేల్లో సైతం విత్తనాలు ఉండటం లేదు. రైతులు డబ్బులు చెల్లించాకే ఇండెంట్ పెట్టి విత్తనాలను తెప్పిస్తున్నారు.

బోరు బావుల పరిధిలో వరి వేయోద్దన్న ప్రభుత్వం
పంపిణీ చేయని ఆరుతడి పంటల విత్తనాలు
అయోమయంలో రైతులు
రబీలో బోరు బావుల పరిధిలో వరి వేయవద్దన్న ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రత్యామ్నాయం చూపడం లేదు. ఆరుతడి పంటల విత్తనాలు పంపిణీ చేసే ఆలోచనే లేదు. వ్యవసాయ శాఖ ఇదివరకే సిద్ధం చేసుకున్న రబీ సాగు ప్రణాళికనే అమలు చేస్తున్నారు. ఆర్‌బీకేల్లో సైతం విత్తనాలు ఉండటం లేదు. రైతులు డబ్బులు చెల్లించాకే ఇండెంట్ పెట్టి విత్తనాలను తెప్పిస్తున్నారు.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
వ్యవసాయ శాఖ వద్ద ప్రస్తుతం మినుములు, పెసలు, రాగులు, సెనగలు, వేరు శనగ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రబీ ప్రణాళికలో పొందుపర్చిన విత్తనాలను పరిశీలించి ఇండెంట్ పెట్టాక తెప్పిస్తున్నారు. దీంతో రైతులు నేరుగా వెళ్లి ఆర్‌బీకేల్లో విత్తనాలు తీసుకునే వెసులుబాటు లేదు. అందులోనూ రబీలో మన ప్రాంతంలో అధికంగా వేసే ఆరుతడి పంటల విత్తనాలు అందుబాటులో లేకపోవడం మరింత లోటుగా కన్పిస్తోంది. రబీలో ఎక్కువగా సాగు చేసే పంటల్లో మొక్కజొన్న ప్రధానమైనది. సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, పార్వతీపురం, రామభద్రపురం, పూసపాటిరేగ, భోగాపురం తదితర మండలాల్లో అధికంగా పండుతోంది. రెండేళ్లుగా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ రైతులు రబీలో మొక్కజొన్న సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 50వేల క్వాంటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇంతటి ప్రధానమైన పంటకు వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై విత్తనాలు అందించే పరిస్థితి లేదు.
నువ్వు విత్తనాలేవీ
రబీలో నువ్వు పంటను కూడా వేస్తున్నారు. 25వేల ఎకరాలు పైబడి పండిస్తుంటారు. కాని వ్యవసాయ శాఖ వద్ద నువ్వుల విత్తనాలు లేవు. డబ్బులు చెల్లిస్తాం విత్తనాలు కావాలన్నా ఇచ్చే పరిస్థితి ఆర్‌బీకేల్లో లేదు. రబీలో పొద్దు తిరుగుడు(సన్ ఫ్లవర్) పంటను కూడా అధికంగా వేస్తున్నారు. ఈ విత్తనాలూ ఆర్‌బీకేల్లో అందుబాటులో లేవు. ఈ ఏడాది కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల్లో సోయా చిక్కుడు, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి నూనె గింజల ఉత్పత్తులకే అధిక ధరలు ఉన్నాయి. ఈ విత్తనాలేవీ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు.
చిరు ధాన్యాలు ఎక్కడ?
చిరు ధాన్యాలు పండించాలని ఇటు ప్రభుత్వం, అటు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాని దానికి తగ్గట్టు విత్తనాలు అందుబాటులో ఉంచడం లేదు. చిరు ధాన్యాల్లో రాగులు(చోడి) మినహా ఏ విత్తనాలూ వ్యవసాయ శాఖ వద్ద లేవు. విజయనగరం గాజులరేగలో చిరు ధాన్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. ఇటీవల కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పలువురు రైతులు ప్రశ్నించారు. రాగులు మినహా ఏ విత్తనాలూ అందుబాలో లేవని సంబంధిత శాస్త్రవేత్త చెప్పారు. జొన్నలు, గంటెలు, ఊదలు, అరెకలు, కొర్రలు, అండు కొర్రలు ఇలా వివిధ చిరు ధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉంచాలి. కాని ఇవేవీ ఉండటం లేదు. రబీ సీజన చిరుధాన్యాలు పండించేందుకు అనువైనది. విత్తనాలు లేని కారణంగా ప్రభుత్వం నిర్దేశించిన ఆరుతడి పంటలు వేసే పరిస్థితి కన్పించడం లేదు.
వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన విత్తనాలు
---------------------------------------------------
విత్తనం పేరు నిల్వలు
-------------------------------------------------
వరి ఆర్‌ఎన్‌ఆర్(15048) 3782 క్వింటాళ్లు
నెల్లూరు మసూరి 668
రాగులు(చోడి) 63
మినుములు 1400
పెసలు 1020
కొమ్ము సెనగలు 32
వేరు శనగ 1500
------------------