కొనసాగిస్తారా? లేదా?

ABN , First Publish Date - 2022-01-01T04:23:55+05:30 IST

రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మెడపై కత్తి వేలాడుతోంది. శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపడుతుండడంతో వీరికి ఉద్వాసన పలుకుతారా? లేక కొనసాగిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తమను రెగ్యులర్‌ చేసి రెవెన్యూ సేవల్లో వినియోగించుకోవాలని వారంతా కోరుతున్నారు.

కొనసాగిస్తారా? లేదా?
కలెక్టర్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు

రెవెన్యూ శాఖలో చిరుద్యోగుల భవిష్యత్తు అయోమయం

కంప్యూటర్‌ ఆపరేటర్లను వెంటాడుతున్న తొలగింపు భయం

శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడడమే కారణం

(కలెక్టరేట్‌)

రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మెడపై కత్తి వేలాడుతోంది. శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపడుతుండడంతో వీరికి ఉద్వాసన పలుకుతారా? లేక కొనసాగిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తమను రెగ్యులర్‌ చేసి రెవెన్యూ సేవల్లో వినియోగించుకోవాలని వారంతా కోరుతున్నారు. జిల్లాలోని 34 మండలాలతో పాటు కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల్లో 44 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో 34 జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ భర్తీ పూర్తయితే తమ పరిస్థితి ఏమిటని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో తొలుత 2007లో ఔట్‌ సోర్సింగ్‌  ప్రాతిపదికన 19 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లను భర్తీ చేశారు. 2011లో మరో 25  మందిని నియమించారు. అప్పట్లో వచ్చిన మెరిట్‌ ప్రాతిపదికన నియామకం చేపట్టారు.  మొదట్లో వీరికి రూ.4,900 వేతనంగా అందించే వారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీతాన్ని రూ.15,000కు పెంచారు. 

వేతనానికి మించి శ్రమ

పేరుకే కంప్యూటర్‌ ఆపరేటర్లు కానీ అన్నిరకాల సేవలందిస్తున్నారు. వేతనానికి మించి శ్రమిస్తున్నారు. భూముల రీసర్వే, సంక్షేమ పఽథకాలు, మీసేవ, స్పందన వినతుల అప్‌లోడ్‌, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల జారీ వంటి ప్రక్రియ వీరే చేపట్టాల్సి ఉంటుంది. ఒక్కోసారి అర్ధరాత్రి వరకూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తక్కువ వేతనమే అయినా ఎప్పటికైనా రెగ్యులర్‌ చేయకపోతారా? అన్న ఆశతో వీరు సేవలందిస్తూ వచ్చారు. వీరిలో చాలామంది 40 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. ఇప్పుడు విధుల నుంచి తొలగిస్తే కుటుంబాలతో  ఎలా బతికేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నియామకాలు సంతోషమే అయినా..తమ ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. 




Updated Date - 2022-01-01T04:23:55+05:30 IST