బొత్స కుటుంబంలో చిచ్చు

ABN , First Publish Date - 2021-02-09T05:12:42+05:30 IST

వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి..

బొత్స కుటుంబంలో చిచ్చు
పూసపాటిరేగ మండలం నడిపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

వైసీపీలో విభేదాలు

మంత్రి బొత్స సోదరుడు లక్షణరావుపై ఎమ్మెల్యే బడ్డుకొండ ఫైర్‌

రెబల్స్‌కు అండగా నిలుస్తున్నారని ఆరోపణ

నేరుగా అధిష్టానానికే ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక


పూసపాటిరేగ(విజయనగరం): వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. పంచాయతీ ఎన్నికల్లో ఇవి బయటపడుతున్నాయి. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు... మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు వైఖరిపై సోమవారం బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అని చెప్పుకొని పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్నిచోట్ల టీడీపీకి మద్దతు తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. సోమవారం పూసపాటిరేగ మండలం గోవిందపురం, నడిపల్లిలో పార్టీ మద్దతుదారులు నామినేషన్‌ వేసిన సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా హాజరయ్యారు.


ఈ సందర్భంగా బహిరంగంగానే మంత్రి సోదరుడి తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ మండలంలో చాలా పంచాయతీలు అధికార పార్టీ మద్దతుదారులకు ఏకగ్రీవం కావాల్సి ఉంది. కానీ రెబల్స్‌ బరిలో ఉండడంతో పోటీ అనివార్యమవుతోంది. దీని వెనుక మంత్రి బొత్స సోదరుడు లక్ష్మణరావు ఉన్నారని.. ఆయనే ధన రూపంలో సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడుతున్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని.. వారికైతే ఒక రూల్‌..మాకో రూలా అంటూ నిలదీశారు. వైసీపీలో ఉంటూ ద్రోహం చేస్తున్నవారికి బుద్ధి చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎప్పుడూ లేనంతగా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీలో గ్రూపులు వెలుగు చూస్తుండడం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


Updated Date - 2021-02-09T05:12:42+05:30 IST